ఆదిలాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ) : అక్షరాల రూ.3.24,234 కోట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం శానసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ బడ్జెట్.. అంకెల గారడే తప్ప.. ప్రజలకు ప్రయోజనం చేకూర్చేవిధంగా లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా ఉద్యోగాల భర్తీ విషయంలోనే కాదు, యువతకు అన్ని రంగాల్లోనూ రిక్తహస్తం చూపించిందని, ఎకరాకు రూ.15 వేల చొప్పున ఇస్తామన్న రైతు భరోసాకు రాం.. రాం పలికిందని.. ఇక పింఛన్ దారుల ఆశలపై నీళ్లు చల్లిందని ఆయా వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలుకు సంబంధించి బడ్జెట్ కేటాయింపులు చేయలేదన్న స్పష్టం చేస్తున్నాయి.
ఇది కమీషన్ల బడ్జెట్‌లా ఉంది
ఎదులాపురం, మార్చి 20: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నాయకుల కమీషన్ల కోసమే అన్నట్లు ఉంది. ప్రజా సంక్షేమాన్ని వదిలి కమిషన్లకే ప్రాధాన్యమి చ్చారు. ఈ బడ్జెట్‌తో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు. అన్ని కులాలకు కార్పొరేషన్లు ప్రకటిస్తామని చెప్పి మొండిచేయి చూపారు. ఉద్యోగులకు పీఆర్సీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్, జాబ్ క్యాలెండర్ వంటివాటిపై ఎలాంటి ప్రకటనలు చేయకపోవడం బాధాకరం. ఉమ్మడి జిల్లాలో ఏ ఒక ఇరిగేషన్‌పై ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. ఇక ఆరు గ్యారెంటీల ఊసే ఎత్త లేదు.
– జోగు రామన్న, మాజీ మంత్రి
ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో అన్ని వర్గాల ప్రజలను మభ్యరపెట్టే విధంగా ఉంది. ఆరుగ్యా రెంటీలను విస్మరిం చారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని కుచ్చుటోపి పెట్టారు. పింఛన్లు పెంచడాన్ని పక్కన పెట్టారు. గిరిజనా భివృద్ధికి నిధుల కేటాయింపు అంతంత మాత్రం గానే ఉంది. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల, బోథ్ నియోజకవర్గం సమస్యలపై ముఖ్యమంత్రి, మంత్రులకు పలు వినతిపత్రాలు ఇచ్చినా స్పందన లేదు. ఈ బడ్జెట్లో ఆదిలాబాద్ జిల్లాకు నిధుల మంజూరులో ప్రభుత్వం అన్యాయం చేసింది. ప్రజలు ఈ విషయాన్ని గమనిస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.
– అనిల్‌జాదవ్, ఎమ్మెల్యే, బోథ్
ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఇందులో భాగంగా నిర్మల్ జిల్లా బాసరలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్లో జిల్లాలోని యూనివర్సిటీ ప్రస్తావన లేకపోవడంపై ఉన్నత చదువుల కోసం ఇబ్బందులు తప్పవని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పది వేల ఎకరాల్లో ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు చేసి.. పరిశ్రమలను నెలకొల్పి స్థానికులకు ఉపాధి కల్పిస్తామని సీఎం ఇటీవల ప్రకటించారు. కానీ, ఆ ప్రస్తావన సైతం లేకపోవడం ప్రజలను విస్మయానికి గురి చేస్తున్నది.
సన్నవడ్లు పండిస్తున్న రైతులకు రూ.500 బోనస్ ఇస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. కానీ పంటలకు బోనస్, ఫసల్ బీమా ఉసెత్తకపోవడంపై రైతుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 10 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి పంట సాగు చేస్తారు. ఇతర పంటలతో పోల్చితే ఈ పంట సాగులో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. జిల్లాలో పత్తితో పాటు సోయాబీన్, కంది, శనగ, జొన్న పంటలకు బోనస్ విషయాన్ని ప్రస్తావించకపోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో రైతులు సాగు చేసే పంటలకు గతంలో ఫసల్‌బీమా పథకం అమల్లో ఉండడంతో వర్షాలు.. ఇతర కారణాలతో పంటలు నష్టపోయిన వారికి మేలు జరిగేది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే ఈ పథకం రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను చెల్లించాల్సి ఉంటుంది. కానీ, రెండుళ్లుగా వాటా చెల్లించకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. బడ్జెట్లో ఫసల్‌బీమా ప్రస్తావన లేకపోవడం రైతుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తాము అధికారంలోకి వస్తే రైతు భరోసా పథకం కింద ఎకరాకు రెండు పంటలకు కలిపి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని, అలాగే వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇస్తామని మేనిఫెస్టేలోపెట్టిన విషయం తెలిసిందే. కానీ, బడ్జెట్లో ఈ ముచ్చట ప్రస్తావించలేదు. కేవలం గత బీఆర్ఎస్ సర్కారు ఇచ్చిన మాదిరిగానే ఎకరాకు రూ.6వేల చొప్పున రెండు పంటలకు రూ.12వేలు ఇస్తున్నట్లుగా ఉప ముఖ్యమంత్రి బట్టి చెప్పారు. ఇదిలా ఉంటే.. రైతు భరోసా కింద ఇవ్వాల్సిన పాత బకాయిల ముచ్చటపై స్పష్టత ఇవ్వకుండానే ముగించారు. రెండు లక్షల వరకూ రుణమాఫీ కాని రైతులు లక్షల్లో ఉన్నారు. వారి గురించి బడ్జెట్లో ఊసేలేదు.
అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉ ద్యోగాలు భర్తీచేస్తామని మేనిఫెస్టోలో పెట్టిన విషయం తె లిసిందే. ఈ బడ్జేట్‌లో జ్యాబ్ క్యాలెండర్ ప్రకటిస్తుందని నిరుద్యోగ యువకులు ఆశ పడ్డారు. కానీ, కొత్త ఉద్యోగాలు, నోటిఫికేషన్ల గురించే ఊసెత్తకుండానే అర్థిక మం త్రి ప్రసంగం ముగించడంపై విమర్శలు వస్తున్నాయి. బడ్జెట్లోనే క్లారిటీ లేకపోతే.. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఎలా నిర్వహిస్తారన్న ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ బడ్జెట్లోనూ చేయూత పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం హ్యాండిచ్చింది. తాము అధికారంలోకి వస్తే రూ.4 వేలకు పింఛన్లు పెంచుతామని చెప్పిన కాంగ్రెస్. ఈసారి కూడా రిక్తహస్తమే చూపింది. ఫలితంగా పింఛన్ పెరుగుతుందని ఆశలు పెట్టుకున్న వారికి నిరాశే మిగిలింది. ఇక మహాలక్ష్మీ పథకం కింద నిరుద్యోగ యువతకు రూ. 2500 చొప్పున అందిస్తామని చెప్పి, ఆ ఊసే ఎత్తులేదు
కల్యాణ మస్తు పథకం కింద ప్రతినిరుపేద అడబిడ్డ వివాహానికి రూ. లక్షతో పాటు ఇందిరమ్మ కానుకగా 10 గ్రాముల బంగారం ఇస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ చెప్పిన విషయం తెలిసిందే. కానీ, ఈబడ్జెట్లోనూ తులం బంగారం గురించి ప్రస్తావన తీసుకురాలేదు. నిధులు కేటాయింపులు లేవు. అంటే.. తులం బంగారానికి రాం రాం పలికినట్లే స్పష్టమవుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశప్టటిన బడ్జెట్‌తో రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదు. ఇప్పటికే మూడు పంటలకు రైతు భరోసా విడుదల చేయలేదు. వరంగల్ డిక్లరేషన్‌లో ఫసల్ బీమా అమలు చేస్తుమన్నారు. ఫసల్ బీమా లేనిపక్షంలో పంటల బీమా పథకం అమలు చేస్తుమని హామీ ఇచ్చారు. రైతులకు ఉపయోగపడే రెండు పథకాలను ప్రభుత్వం పక్కనపెట్టింది. జిల్లాలో రైతులు వాణిజ్యపంటగా పత్తిని సాగు చేస్తారు. సోయాబీన్, కంది, శనగ, జొన్న పంటలను సైతం పండిస్తారు. సన్నవడ్లకు రూ. 500 ఇస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం పత్తితో పాటు ఇతర పంటలకు బోనస్ ఇవ్వాలి.
– సంగెం బొర్రన్న, రైతు వేదిక, జిల్లా అధ్యక్షుడు
ఉట్నూర్, మార్చి20 : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో మహిళలు, గిరిజనులకు, రైతులను పట్టించుకున్నట్లే కనబడుత లేదు. ఎన్నో ఆశలతో బడ్జెట్ కోసం వేచి చూస్తే చివరకు నిరాశ పరిచారు. ప్రధానంగా రైతులకు మేలు చూకూర్చేలా ఏ ఒక్కటీ ప్రకటించలేదు. కాంగ్రెస్‌కు ప్రజల సంక్షేమంకన్నా విగ్రహాల ఏర్పాటు ముఖ్యమైంది. రాబోయే ఎన్నికల్లో హస్తం పార్టీకి గుణపాఠం తప్పదు.
– పంద్ర జైవంత్‌రావు, ఉట్నూర్ మాజీ ఎంపీపీ
రాష్ట్ర బడ్జెట్లో పీఆర్సీ, పెండింగ్ బిల్లులు, 5 డీఏలు పెండింగ్‌లో ఉన్న బడ్జెట్లో ప్రభుత్వం వాటిని ప్రస్తవించకపోవడం విచారకరం. ఇప్పటికే పీఆర్సీ అమలు 33 నెలలు అవుతున్నది. ఆరు నెలల్లో పీఆర్సీ అమలు చేస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని పక్కనపెట్టారు. ఉద్యోగ ఆరోగ్య పథకం నిధులు దారిమళ్లకుండా చర్యలు తీసుకోవాలి. ఉచిత పథకాలకు ఇచ్చిన ప్రాధాన్యం, విద్యారంగానికి ఇవ్వలేదు. బ్రేక్‌ఫాస్ట్, ఇంటర్‌వరకు మధ్యాహ్నభోజన పథకానికి కేటాయించిన నిధులు సరిపోకపోవచ్చు. పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగు, మధ్యాహ్న భోజనం నాణ్యత పెంచడం గురించి అదనంగా నిధులు కేటాయించే ప్రస్తావనను పట్టించుకోలేదు. విద్యాకు 15 శాతం కేటాయిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నా హామీని వరుసగా మూడో బడ్జెట్లో అమలు పర్చలేదు.
– కొమ్ము కృష్ణకుమార్, పీఆర్టీయూటీఎస్ జిల్లా అధ్యక్షుడు. ఆదిలాబాద్