మంచిర్యాల టౌన్, మార్చి 28 : ఎల్ఆర్ఎస్ (లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం)-2020 దరఖాస్తుల పరిష్కారం కోసం 25 శాతం రాయితీ కల్పిస్తూ తీసుకున్న నిర్ణయంపై ప్రజల్లో గందరగోళం నెలకొంది. ఇప్పటికే పలురకాల కొర్రీలతో దరఖాస్తుదారులు సతమతమవుతుండగా, తాజాగా పలువురికి ఎల్ఆర్ఎస్ ఫీజు కోట్లలో వస్తుండడంతో బెంబేలెత్తి పోతున్నారు. రూ. లక్షల్లో కొనుగోలు చేసిన ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకోవాలంటే రూ. కోట్లు చెల్లించాలా అంటూ అవాక్కవుతున్నారు. ఇదిలాఉండగా మార్చి 31తో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు ఫీజు చెల్లించే గడువు ముగుస్తుండడంతో పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకుంటున్నారు. సిబ్బంది తక్కువగా ఉండటం, ఉన్న సిబ్బందికి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల్లో పేర్కొన్న అంశాలపై స్పష్టత లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
లక్షెట్టిపేట మండలం హన్మంతపల్లికి చెందిన లక్ష్మికి నస్పూరు శివారులోని 41 సర్వేనంబర్‌లో 288 గజాల ప్లాటు ఉంది. ఆమె 2020లో ఎల్ఆర్ఎస్కోసం రూ. వెయ్యి చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా.. ఈ ప్లాటుకు సంబంధించి ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించడం కోసం రాగా రూ. 5,88,11,998 ఫీజు వచ్చింది. ఇందులో నుంచి 25 శాతం రిబేటు పోను రూ. 4,41,07,999 చెల్లించాలని చూపెడుతోంది. మంచిర్యాలకు చెందిన ఆకుల అశోక్ కు సంబంధించి 204 గజాల భూమికి రూ. 13.82 కోట్లు, సంధ్యారాణి అనే మహిళకు సంబంధించిన472 గజాల ప్లాటుకు రూ. 57.59 కోట్లు చెల్లించాలని ఎల్ఆర్ఎస్ వెబ్‌పోర్టల్‌లో చూపెడుతోంది. దీంతో దరఖాస్తు దారులు ఒక్కసారిగా ఖంగుతింటున్నారు.
ఎల్ఆర్ఎస్ సైట్లో ఏర్పడిన టెక్నికల్ సమస్య వల్ల ఇలా చార్జీలు జనరేట్ అవుతున్నాయని, సంబంధిత డాక్యుమెంట్లు తీసుకుని కార్యాలయానికి వస్తే సరిచేస్తామని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఎల్ఆర్ఎస్ దరఖాస్తు దారులు కార్పొరేషన్ కార్యాలయంలో బారులు తీరుతున్నారు. గడువు సమీపిస్తున్న కొద్దీ పెద్ద సంఖ్యలో తమ దరఖాస్తులు పరిష్కరించుకోవడానికి తరలివస్తున్నారు. అయితే ఇందుకు సరిపడా సిబ్బంది లేకపోవడం, ఉన్న సిబ్బందిపై అధిక భారం పడడం, దీనికి తోడు తరచూ సర్వర్ డౌన్ అవడంలాంటి సమస్యలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కార్పొరేషన్‌గా ఏర్పడకముందు మంచిర్యాల మున్సిపాలిటీతో పాటు నస్పూరు మున్సిపాలిటీ, హాజీపూర్ మండలంలోని వేంపల్లి, ముల్కల, గుడిపేట, నర్సింగాపూర్, రాపల్లి, పోచంపాడ్, నంనూర్ గ్రామపంచాయితీ పరిధిలో ప్లాట్లు కొనుగోలు చేసిన వేలాది మంది 2020 సంవత్సరంలో రూ. వెయ్యి చెల్లించి ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ ప్రాంతాలన్నీ నూతనంగా ఏర్పడిన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో కలవడంతో ఇప్పుడు వీరంతా ఇక్కడకు తమ దరఖాస్తులను పట్టుకొని వస్తున్నారు.
ఎల్ఆర్ఎస్ కోసం 2020 సంవత్సరంలో మంచిర్యాలతో పాటు నస్పూరు మున్సిపాలిటీ, ప్రస్తుతం కార్పొరేషన్లో విలీనమయిన గ్రామపంచాయతీల పరిధిలో వేల సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. వీటన్నింటినీ నిర్ణీత గడువు ఈనెల 31లోగా పరిష్కరించి ఫీజులు చెల్లించేలా చర్యలు చేపట్టాలని మున్సిపాలిటీలకు ప్రభుత్వం సూచించింది. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో 23,303 దరఖాస్తులు, నస్పూరు మున్సిపాలిటీలో 4922 దరఖాస్తులు, గ్రామపంచాయితీల పరిధిలో 4874 దరఖాస్తులు చేసుకున్నారు. వేలల్లో దరఖాస్తులు వచ్చినప్పటికీ వందల్లో మాత్రమే ఎల్ఆర్ఎస్ పూర్తిచేశారు. గడువులోగా పూర్తిస్థాయిలో ఎల్ఆర్ఎస్ పూర్తిచేయడం ఎలాగూ సాధ్యపడదని, అందుకే ప్రభుత్వం గడువు పెంచుతుందని పలువురు భావిస్తున్నారు.