వాంకిడి, జూలై 7 : వాంకిడి పీఏసీఎస్ కార్యాలయం వద్ద యూరియా పంపిణీలో గందరగోళం నెలకొంది. సోమవారం ఉదయం పెద్ద సంఖ్యలో రైతులు తరలిరాగా, సిబ్బంది కొంతసేపు యూరియా పంపిణీని నిలిపేశారు. రైతులందరూ క్యూ కడితేనే యూరియా పంపిణీ చేస్తామని పట్టుబట్టడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఉదయం నుంచి నిరీక్షిస్తున్నా ఎందుకింత జాప్యం చేస్తున్నారంటూ మండిపడ్డారు.
లింగాపూర్,జూలై 7 : సిర్పూర్(యూ) మండల కేంద్రంలోని పీఏసీఎస్ కేంద్రంలో వద్ద రైతులు యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. సోమవారం లింగాపూర్లోని ఆగ్రోస్, సిర్పూర్(యూ)లోని పీఏసీఎస్ సెంటర్కు యూరియా బస్తాలు వచ్చాయని తెలుసుకొని రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి క్యూ కట్టారు. గంటల తరబడి నిరీక్షించారు. పోలీసుల పహారా నడుమ రైతులకు టోకెన్లు అందించి యూరియా బస్తాలు పంపిణీ చేశారు. కాగా, సాగుకు సరిపడా ఎరువులు పంపిణీ చేయకపోవడంతో రైతులు మండిపడుతున్నారు.
జైనూర్, జూలై 7 : సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం జైనూర్ మండల కేంద్రంలోని గోదాం ముందు రైతులు ఆందోళన చేపట్టారు. వారు మాట్లాడుతూ యూరియా సరఫరా సక్రమంగా జరగడం లేదని, ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.