మంచిర్యాల, జనవరి 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పథకాలకు లబ్ధిదారుల ఎంపిక పేరిట కాంగ్రెస్ సర్కారు నిర్వహిస్తున్న గ్రామసభలు రచ్చ రచ్చగా మారాయి. పథకాల ఎగవేతపై జనం అధికారులను నిలదీస్తున్నారు. లబ్ధిదారుల ఎంపికలో అర్హులైన పేదలకు చోటు కల్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు, రేషన్‌కార్డులు, ఆత్మీయ భరోసా పథకాల్లో చోటు దక్కకపోవడంపై గుండెమండిన సామాన్యులు తిరగబడుతున్నారు. అనర్హులను జాబితాలో చేర్చడంపై ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. మూడోరోజైన గురువారం కూడా గ్రామసభలు నిలదీతలు, నిరసనలు మధ్య సాగాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గ్రామసభల్లో ఎక్కడ చూసినా ఈ దృశ్యాలే కనిపించాయి.
కుంటాల, జనవరి 23 : నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని లింబా(కే)లో ఎంపిక చేసిన పథకాల జాబితాల్లో తమ పేర్లు లేకపోవడంతో గ్రామస్తులు అధికారులను నిలదీశారు. సర్కారు ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలు దక్కుతాయో లేదోనన్న ఆందోళనతో జనం రచ్చ చేశారు. అధికారులు సమాధానం ఇవ్వలేక అర్ధాంతరంగా జారుకున్నారు. పోలీసులు భద్రత కల్పించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఏజాజ్ ఖాన్, ఎంపీడీవో లింబాద్రి, డీటీ నరేశ్ గౌడ్, ఎంఏవో విక్రమ్, ఎంపీవో రహీం పాల్గొన్నారు.
బోథ్, జనవరి 23 ః ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని ధన్నూర్(బీ) గ్రామంలో గురువారం నిర్వహించిన గ్రామసభలో రైతు భరోసాపై రభస జరిగింది. యాసంగి పంటలు వేసి రెండు నెలలు గడుస్తున్నా పంటల నమోదు ప్రక్రియ చేపట్టలేదని, రైతుభరోసా ఎలా ఇస్తారని బీఆర్ఎస్ మండల కన్వీనర్ నారాయణరెడ్డి అధికారులను నిలదీశాడు. కాంగ్రెస్ నాయకులు కల్పించుకోవడంతో గందరగోళ పరిస్థితి నెలకున్నది. సీఐ వెంకటేశ్వర్రావ్, ఎస్సై ప్రవీణ్‌కుమార్, శిక్షణ ఎస్సై రాజశేఖర్‌రెడ్డి కల్పించుకుని ఇరు పార్టీల నాయకులతోపాటు గ్రామస్తులను సముదాయించారు. ఈ సమావేశంలో ప్రత్యేకాధికారి వాజిద్ అలీ, ఎంపీడీవో రమేశ్, ఇంద్రారెడ్డి, శ్రీనివాస్, ఏఈవో సంతోష్, ప్రత్యేకాధికారి శ్రీకాంత్ రెడ్డి, పంచాయ కార్యదర్శి శిరీషా పాల్గొన్నారు.
తాంసి, జనవరి 23 ః పొన్నారి గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన సభలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఫొటో లేదని బీఆర్ఎస్ నాయకులు వెంకటరమణ, అశోక్, ఆనంద్, ముచ్చ రేఖ రఘు, లక్ష్మీపతి ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రజాపాలన కాదని కాంగ్రెస్ పాలన అంటూ నిరసన వ్యక్తం చేశారు. అర్హులైన పేదల పేర్లు జాబితాలు ప్రచురించలేదని గ్రామస్తులు అధికారులను నిలదీశారు. గ్రామంలో పది మంది ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యుల పేర్లు వచ్చాయని మండిపడ్డారు. ప్రొటోకాల్ రగడ నేపథ్యంలో డీఎస్పీ జీవన్‌రెడ్డి, ఎస్సై రాధికతో కలిసి గ్రామసభను పరిశీలించారు.
ముథోల్, జనవరి 23 : నిర్మల్ జిల్లా ముథోల్ మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామసభలో మేము అర్హులమే అయినా రేషన్‌కార్డు ఎందుకు రాలేదని అధికారులను ప్రశ్నించారు. దీంతో కొద్దిసేపు గందరగోళం నెలకున్నది. ఇందిరమ్మ ఇండ్ల అర్హుల పేర్లు చదివి సభను ముగించారు. దీంతో గ్రామస్తులు పూర్తి గ్రామసభ కాకుండానే ముగించడం ఏంటని తీవ్ర నిరాశకు గురయ్యారు.
లోకేశ్వరం, జనవరి 23 : ప్రజాపాలనలో దరఖాస్తులు ఇచ్చాం. సర్వేకు వచ్చిన అధికారులకు వివరాలు అందజేశాం. మళ్లీ ఇవాళ గ్రామసభ అంటూ దరఖాస్తు ఇవ్వాలని అధికారులు అడుగుతున్నారు. ఇలా ఎన్నిసార్లు దరఖాస్తులు ఇవ్వాలి. ఎప్పటికీ మాకు న్యాయం జరుగుతుంది. ఈ దరఖాస్తులు కేవలం నచ్చజెప్పడానికే తప్పా లేక మాకేమైనా న్యాయం జరుగుతుందా.. ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో మా పేర్లు లేవు. అలాగే ఇప్పటి వరకు రుణమాఫీ కాలేదు. రైతు భరోసా అందలేదు.
గుడిహత్నూర్, జనవరి 23 : ‘మేము వ్యవసాయ కూలీలం. పనికి వెళ్లంది పొట్ట గడవదు. మేం ఇందిరమ్మ అత్మీయ భరోసా పథకానికి అర్హులం కాదా? మా పేరు జాబితాలో ఎందుకు లేదు.’ అని కొల్హారిలో నిర్వహించిన గ్రామసభలో గ్రామస్తులు అధికారులను నిలదీశారు. ఈజీఎస్‌లో పని చేయకుంటే అర్హులం కాదా? ఇంటి వద్ద కూర్చొని సర్వేలు చేశారని ఆరోపించారు. ఒకే వర్గానికి చెందిన వారినే ఎంపిక చేశారని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తగరే ప్రకాశ్, గజానంద్, గిత్తెలు ఆరోపించారు.
బేల, జనవరి 23 ః ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన గ్రామసభలో అధికారులు చదివిన లబ్ధిదారుల పేర్లలో అవకతవకలు జరగడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ పనులు చేసే కూలీలు కులవృతులు చేస్తున్న వారు ఉపాధి హామీ పనికి వెళ్లకుంటే ఆత్మీయ భరోసా ఇవ్వరా? అని ప్రశ్నించారు. ఉపాధి హామీ కూలీ పనులకు వెళ్లకున్నా.. వారి పేర్లు ఆత్మీయ భరోసాలో ఎలా వచ్చాయని, అసలు పనికి వెళ్లిన వారి పేర్లు ఎందుకు రాలేదని అధికారులను నిలదీశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, ఎంపీడీవో మహేందర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
భీంపూర్, జనవరి 23 : భీంపూర్ మండలంలో నిర్వహించిన గ్రామసభలో ఎందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తరో చెప్పాలని ప్రజలు అధికారులను ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్యామలదేవి, డీఎస్పీ జీవన్‌రెడ్డిలు అక్కడికి చేరుకుని వారు చెప్పిన సమస్యలు విని సముదాయించారు.
కుభీర్, జనవరి 23 ః కుభీర్ మేజర్ గ్రామ పంచాయతీలో జరగాల్సిన గ్రామసభను గ్రామస్తులు బహిష్కరించారు. రేషన్‌కార్డులు, ఆత్మీయ రైతుభరోసాలో కేవలం 20 శాతం లబ్ధిదారులను ఎంపిక చేయడం, మిగతా దరఖాస్తు చేసుకున్న 80 శాతం పేదలకు ప్రభుత్వం మొండిచేయి చూపించడంపై ఎంపీడీవో, తహసీల్దార్, ఎంపీవోలతో గ్రామస్తులు వాదనకు దిగారు. ముందుగా సర్వే చేసిన వారిని తీసుకొచ్చి ఆ తర్వాత గ్రామసభ నిర్వహించాలని మండి పడ్డారు. కార్యాలయం ఎదుట బైఠాయించి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. అధికారులు ఎంత చెప్పినా వినకుండా ఇదేమీ రాజ్యం ఇదేమీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అక్కడకు చేరుకున్న భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్‌రావు పటేల్‌ను చుట్టూ ముట్టి రూ.2 లక్షల రుణమాఫీ చేశారా అని నిలదీశారు.
నేరడిగొండ, జనవరి 23 : ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని తేజాపూర్, నేరడిగొండ గ్రామాల్లో నిర్వహించిన గ్రామసభల్లో అర్హుల జాబితాలో తమ పేర్లు రాకపోవడంతో ప్రజలు సర్పంచ్ ఎన్నికల కోసమే సభలు నిర్వహిస్తున్నారా? అని అధికారులను నిలదీశారు. తేజాపూర్‌లో 20 శాతం మందికి మాత్రమే రుణమాఫీ అయిందని.. మిగతా 80 శాతం మందికి కాలేదని రైతులు ఆందోళన చేశారు.