మంచిర్యాల, జూలై 31(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఇందిరమ్మ ఇండ్లకు రోజుకో నిబంధన మారుస్తుండడంతో క్షేత్రస్థాయిలో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మొన్నటి వరకు వద్దని చెప్పిన పనులనే ఇప్పుడు చేయమని చెప్తుండడంతో పంచాయతీ కార్యదర్శులు, స్పెషల్ ఆఫీసర్లు, ప్రాజెక్ట్ డైరెక్టర్లు పాట్లు పడుతున్నారు. ఇందిరమ్మ ఇండ్లకు ఎల్-1, ఎల్-2, ఎల్-3 అని మూడు జాబితాల్లో దరఖాస్తుదారులను ఎంపిక చేశారు. లిస్ట్-1లో అర్హులైన వారిలో గ్రామానికి 15 ఇండ్ల నుంచి 20 ఇండ్ల చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేశారు. పైలెట్ గ్రామాల్లో ఈ మేరకు పనులను ప్రారంభించారు.
ఇక మిగిలిన ప్రాంతాల్లో లబ్ధిదారులుగా ఎంపికైన చాలా మంది ఇండ్ల నిర్మాణానికి ముగ్గు పోసేందుకు సిద్ధం అయ్యారు. అధికారులు వివరాలు మరోసారి నమోదు చేయాలి. వచ్చి చేస్తాం. మేము వచ్చి వివరాలు తీసుకుని, ఫొటో క్యాప్చర్ చేసే వరకు పనులు మొదలు పెట్టొద్దని చెప్పడంతో చాలా మంది అధికారుల రాకకోసం ఎదురు చూస్తున్నారు. ఇలా చెప్పి ప దిహేను, ఇరవై రోజులు పూర్తి కావస్తున్నా ఇప్ప టి వరకు అధికారులు రాలేదంటూ లబ్ధిదారులు వాపోతున్నారు. అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రక్రియను వేగవంతం చేయాల్సిన సర్కారు రోజుకో నిబంధన మారుస్తుండడంపై క్షేత్రస్థాయిలో గందరగోళ పరిస్థితులు నెలకున్నాయి.
ఇందిరమ్మ ఇండ్లకు వచ్చిన దరఖాస్తులను ఎల్-1, ఎల్-2, ఎల్-3 మూడు లిస్టులను రూపొందించారు. సొంత ఇంటి స్థలం కలిగి ఉండి, ఇండ్లు లేని అర్హులు ఎల్-1 జాబితాలో, ఇంటి స్థలం లేని అర్హులు ఎల్-2 జాబితాలో, రిజెక్టెడ్ (గతంలో ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన వారు, ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగి ఉన్న వారు, గ్రామీణ ప్రాంతంలో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షలకు మించి ఆదాయం ఉన్న వారు, ఫోర్ వీలర్ (కారు) ఉన్న వారి) అనర్హులు ఎల్-3 జాబితాలో ఉన్నారు. ప్రస్తుతం తొలి విడుత కింద ఎల్-1 జాబితాలోని అర్హుల నుంచి లబ్ధిదారులుగా కొందరిని ఎంపిక చేశారు.
ఉదాహరణకు ఒక గ్రామంలో 150 నుంచి 200 మంది ఎల్-1 లిస్ట్‌లో ఉంటే వారి నుంచి 15 లేదా 20 మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. ఈ మేరకు చాలా చోట్ల పనులను మొదలుపెట్టారు. ఇప్పుడు ఎంపికైన లబ్ధిదారులతోపాటు ఎల్-1 జాబితాలో అర్హులుగా ఉన్న వారందరి వివరాలు తీసుకుని, ఫొటోలు అప్లోడ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది. దీంతో ఎవ్వరిని క్యాప్చర్ చేస్తున్నారు? ఎందుకు క్యాప్చర్ చేస్తున్నారు? అన్న స్పష్టత లేదు. లబ్ధిదారులుగా ఎంపికైనందుకు వివరాలు తీసుకుంటారా? లేదా జాబితాలో ఉన్నందుకు వివరాలు తీసుకుంటున్నారా? అన్న స్పష్టత కొరవడింది.
ఇందిరమ్మ ఇండ్ల కోసం లబ్ధిదారులను ఎంపిక చేసే క్రమంలో గతంలోనే బేస్మెంట్ లెవల్ దాకా నిర్మించుకున్న వారిని అనర్హులుగా పక్కన పెట్టేశారు. ఇందిరమ్మ ఇండ్లు ప్రకటించగానే కొందరు ఇల్లు కట్టడం మొదలుపెట్టారు. బేస్మెంట్ వరకు కట్టుకుని, ఇందిరమ్మ ఇండ్ల కింద మిగిలిన ఇండ్లు కట్టుకుందామని భావించారు. అలాంటి వారికి ప్రభుత్వం మంజూరును నిరాకరించింది. కొత్తగా ముగ్గు పోస్తేనే అర్హులని చెప్పింది. దీంతో మూడు, నాలుగేళ్ల క్రితం బేస్మెంట్ లెవల్ వరకు ఇండ్లు నిర్మించి ఆపేసిన వారు అనర్హులుగా మారారు. తాజాగా జూలై 15వ తేదీన ఇలాంటి వారి వివరాలు ఇవ్వాలని సర్కార్ ఆదేశించింది.
మంజూరు చేయకుండానే బేస్మెంట్ లెవల్ దాకా కట్టుకున్న అర్హులైన వారి, ఇందిరమ్మ ఇండ్ల ప్రొసిడింగ్ రావడానికి ముందే బేస్మెంట్ లెవల్ దాకా నిర్మాణాలు చేసిన అర్హులైన వారు, గతంలో రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్ కింద ఎంపిక బేస్మెంట్ దాకా కట్టుకున్న అర్హులైన వారి వివరాలను ఇవ్వాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. వాళ్లకు కూడా ఇండ్లు మంజూరు చేస్తారని తెలిసింది. దీంతో మొన్నటి దాకా వద్దు అన్న వివరాలే ఇప్పుడు అడుగుతుండడం, లబ్ధిదారులతోపాటు ఎల్-1 జాబితాలో ఉన్న వారందరిని క్యాప్చర్ చేయమని చెప్పడం, బేస్మెంట్ లెవల్ దాకా కట్టుకున్న వారి వివరాలు కోరుతుండడం అయోమయంగా మారింది.
ఇంతకుముందు లబ్ధిదారుల ఎంపిక జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన ఇందిరమ్మ ఇండ్ల యాప్‌లో లబ్ధిదారుల వివరాలను నమోదు చేసి, ఇండ్లు కట్టుకునే ప్రదేశంలో వారిని నిల్చోబెట్టి పొటోలు తీసుకుని అప్లోడ్ చేశారు. కాగా ఇందిరమ్మ ఇండ్ల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై- గ్రామీణ్, అర్బన్) స్కీమ్ కింద రూ.1.60 లక్షలు వస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఆవాస్ ప్లస్ యాప్‌లోనే వివరాలు నమోదు చేస్తేనే ఆ డబ్బులు ఇస్తామంటూ కేంద్రం చెప్పింది. దీంతో కొన్ని రోజులుగా రీ సర్వే చేస్తున్నారు. పంచాయతీ సెక్రటరీలు లబ్ధిదారుల ఇంటికి పోయి వాళ్ల డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి, ఫొటోలు తీసి అప్లోడ్ చేస్తున్నారు. దీంతో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల వివరాలను అధికారులు మళ్లీ సేకరించాల్సి వస్తున్నది.
ఈ ప్రక్రియను పది రోజుల్లో పూర్తి చేయాలంటూ గతంలో అధికారులు డెడ్‌లైన్ పెట్టారు. ప్రతి గ్రామంలో 15 ఇండ్ల నుంచి 20 ఇండ్లనే నమోదు చేయాల్సి ఉన్నప్పటికీ యాప్ సమస్యల కారణంగా అది సాధ్యం కావడం లేదు. సర్వర్, యాప్ సమస్యలు, పంచాయతీ సెక్రటరీ ఫేస్ అథెంటికేషన్ ఫెయిల్ అవ్వడం, లబ్ధిదారుల ఆధార్ మిస్ మ్యాచ్‌తో యాప్ తీసుకోకపోవడం, అధికారులు వెళ్లిన సమయానికి లబ్ధిదారులు అందుబాటులో లేకపోవడం ఈ కారణాలతో జాప్యం జరుగుతున్నది. ఇప్పటికైనా ప్రభుత్వ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని క్షేత్రస్థాయిలో నెలకున్న గందరగోళ పరిస్థితులను సరిచేయకపోతే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియ ఆలస్యమయ్యే ప్రమాదం నెలకొన్నది.