ఖానాపూర్ రూరల్, జనవరి 30 : మండలంలోని బాదనకుర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని చింతల్పేట బుద్ధ విహార్ ప్రాంతంలో విపశ్యన అంతర్జాతీయ ధ్యాన కేంద్రం ఏర్పాటుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర. గుజరాత్. రాజస్థాన్ రాష్ర్టాల నుంచి సాధువులు హాజరై తఫోధ్యానంతో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సాధువులు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ధ్యాన నిర్మాణానికి కావాల్సిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి జ్ఞాన కేంద్రాలు 200లకు పైగా ఉన్నాయని, దీనిని బాదనకుర్తిలో నిర్మించడం గర్వకారణమని అన్నారు. ధ్యాన కేంద్రంలో ధ్యానం పొందడానికి పది రోజుల పాటు శిక్షణ శిబిరం కూడా ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆచార్యులు, తదితరులు పాల్గొన్నారు.