 
                                                            కుంటాల, అక్టోబర్ 30 : నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో తడిసిన మక్క, సోయాను కొనుగోలు చేయాలని రైతులు, వివిధ పార్టీల నాయకులు ఆందోళన నిర్వహించారు. గురువారం ఉదయం కుంటాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట కుంటాల-కల్లూరు ప్రధాన రహదారిపై దాదాపు 100 మందికిపైగా రైతులతో కలిసి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు రాస్తారోకో నిర్వహించారు. దాదాపు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఆందోళన నిర్వహించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ కమల్‌సింగ్ ఆందోళన ప్రదేశానికి చేరుకొని ఉన్నతాధికారులతో మాట్లాడారు.
మక్క, సోయా పంటలను కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిప్రతం అందించారు. ఈ సందర్భంగా రైతులు, నాయకులు మాట్లాడుతూ.. తడిసిన ధాన్యాన్ని ఎటువంటి షరతులు లేకుండా ప్రభుత్వం కొనాలని డిమాండ్ చేశారు. వర్షాలకు ముందు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఉంటే ఈ దుస్థితి రాకుండా ఉండేదని ఆవేదన చెందారు. ఈ ఆందోళన కార్యక్రమంలో బీఆర్ఎస్ కుంటాల మండల కన్వీనర్ పడకంటి దత్తు, నాయకులు జక్కుల గజేందర్, తాటి శివ, రాకేశ్, గోవర్ధన్, గజేందర్, రైతులు పాల్గొన్నారు.
 
                            