మంచిర్యాల, ఆగస్టు 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నిజామాబాద్-జగ్దల్పూర్ జాతీయ రహదారి-63పై మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో అటవీశాఖ టోల్గేట్లు ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారింది. హరితరుసుం పేరిట టోల్గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తుండడాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన జాతీయ రహదారిపై రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పని చేసే అటవీ శాఖ టోల్గేట్లు పెట్టడం పూర్తిగా చట్టవిరుద్ధమనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కోటపల్లి మండలంలోని పారుపల్లిలో, చెన్నూర్ మండలంలోని కిష్టంపేటలో రెండు చోట్ల టోల్గేట్లను ఫారెస్టు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాంతం ప్రాణహిత(కృష్ణజింకల) అభయారణ్యం పరిధిలోకి వస్తుందని, ఇక్కడ హరితరుసం వసూలు చేసేందుకు ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారని చెప్తున్నారు. అటవీశాఖ వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ -1972 సెక్షన్ 28 (1)(డీ) అండ్ (2) ప్రకారం అనుమతులు ఉన్నాయంటున్నారు. కాకపోతే చట్టంలో ఉన్నది ఒక్కటైతే మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో ఫారెస్ట్ అధికారులు చేసేది మరోలా ఉందని నిపుణులు అంటున్నారు.
ఫారెస్ట్ అధికారులు చెప్తున్న వైల్డ్‌లైఫ్ యాక్ట్ 28 సెక్షన్‌ను పరిశీలిస్తే.. సెక్షన్ 28(1) చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్‌కు అభయారణ్యం లోపలికి ఎవరినైనా అనుమతించే అధికారం కల్పించబడింది. 28 (1) (ఏ) వన్యప్రాణుల పరిశోధన-అధ్యయనం, 28 (1) (బీ)ఫొటోగ్రఫీ, 28(1) (సీ) శాస్త్రీయ పరిశోధన, 28(1) (డీ) టూరిజం గురించి చెప్తున్నాయి. ఇందులోనే సెక్షన్ 28 (2) అభయారణ్యంలోకి ఎవరైనా ప్రవేశించడానికి లేదా నివసించడానికి రుసుం వసూలు చేసే అధికారాన్ని కల్పిస్తున్నది.
దీని ప్రకారమే చెన్నూర్‌లోనూ హరితరుసం వసూలు చేస్తున్నామని అటవీశాఖ అధికారులు చెప్తున్నారు. యాక్ట్‌ను అనుసరించి అభయారణ్యం పరిధి లోపలి ప్రాంతాల్లోనే ఇలా రుసుం వసూలు చేసే అధికారం ఉంది. పారుపల్లి, కిష్టంపేటలో ఫారెస్టు అధికారులు ఏర్పాటు చేసిన టోల్గేట్లు పూర్తిగా జాతీయ రహదారి-63 పరిధిలోకి వస్తాయి. ఈ నేషనల్ హైవే అనేది అభ్యయారణ్యంలోకి రాదు. ఇక్కడే అటవీశాఖ తన పరిధి అత్యుత్యాహం పదర్శిస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
టోల్ పెట్టే అధికారం ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు లేదు..
కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే జాతీయ రహదారులు, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే ఆర్ అండ్ బీ రహదారులపై టోల్గేట్లు పెట్టి, పన్ను వసూలు చేసే అధికారం పూర్తిగా ఆ శాఖలదే. ఏ రాష్ట్రంలోనూ ఆ అధికారాన్ని అటవీశాఖకు ఇవ్వలేదు. అభయారణ్యంలో ఉన్న రహదారులపై చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి కలప అక్రమ రవాణ, అటవీ జంతువుల వేటను నివారించే అధికారమే అటవీశాఖకు ఉంటుంది. కేవలం అభయారణ్యం లోపలే హరితరుసుం, డెవలప్మెంట్ ఛార్జీలు తీసుకోవచ్చు. నేషనల్ హైవేలపై టోల్గేట్లు పెట్టి డబ్బులూ వసూలు చేయాలని చట్టంలో ఎక్కడా చెప్పలేదని నిపుణులు అంటున్నారు.
ఇక్కడ నేషనల్ హైవేపై ఫారెస్ట్ చెక్‌పోస్టు పెట్టడం ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. అటు ఎన్హెచ్ఏఐతోపాటు ఇటు అటవీశాఖ అధికారులు ఎవరికి వారు ఈ వ్యవహారం నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. జాతీయ రహదారులపై టోల్ వసూలు చేసే అధికారం అటవీశాఖకు గానీ, రాష్ట్రంలో ఇతర ప్రభుత్వ శాఖలకు ఉందా? అని అటవీశాఖ ఉన్నతాధికారులకు హైదరాబాద్‌కు చెందిన ఓ ఆర్టీఐ ఆక్టివిస్ట్ సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం కోరారు. దీనికి అటవీశాఖ ఉన్నతాధికారులు ఈ సమాచారం మా పరిధిలోకి రాదంటూ సమాధానం ఇచ్చారు.
మీకే స్పష్టత లేకుండా టోల్ గేట్ ఎలా ఏర్పాటు చేశారు. టోల్ ఎందుకు వసూలు చేస్తున్నారంటే వారి నుంచి సమాధానం లేదు. ఇక ఇదే విషయంపై ఎన్హెచ్ఏఐ అధికారులను వివరణ కోరితే.. సింపుల్ ఆ ఆర్టీఐ దరఖాస్తును అటవీశాఖకు ఫార్వర్డ్ చేసి చేతులు ఎత్తేశారు. మరోవైపు చెన్నూర్ సమీపంలో బావురావుపేటలో నేషనల్ హైవే అథారిటీ టోల్గేట్ ఉంది. త్వరలో దీన్ని ప్రారంభిస్తారని తెలిసింది. కిష్టంపేటలో ఫారెస్ట్ టోల్‌గేట్‌కు బావురావుపేటలో ఎన్హెచ్ఏఐ టోల్‌గేట్‌కు కేవలం కిలోమీటర్ దూరమే ఉండడం గమనార్హం. దీనిపై స్థానికులు మండిపడుతున్నారు. రెండు శాఖల అధికారులు కుమ్మక్కై అక్రమంగా టోల్ వసూళ్లు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
నిర్మల్ జిల్లాలో కేసు.. మంచిర్యాలలో ఇష్టారాజ్యం..
నిర్మల్ జిల్లాలో కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఎన్విరాన్మెంట్ సెస్ వసూలు చేసిన కడెం పెద్దూర్ ఎఫ్ఆర్వో గీతారాణి, ఇతర అటవీ శాఖ అధికారులపై కలెక్టర్ అభిలాష అభినవ్ కేసు పెట్టారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎసెన్షియల్ కమోడిటిస్ యాక్ట్(అవసరమైన వస్తువుల చట్టం) సెక్షన్ 7 కి కేసు నమోదైంది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద ఇక్కడ సెస్ వసూలు చేసేందుకు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్) అనుమతులు ఇచ్చారు.
ధాన్యం రవాణా చేసే లారీల నుంచి ఈ రుసం వసూలు చేయడం.. పీసీసీఎఫ్ రూ.300 కలెక్ట్ చేయాలని ఆదేశాలిస్తే ఒక్కో లారీ నుంచి రూ.525 వసూలు చేయడం, అది కూడా ధాన్యం రవాణా చేసే వాహనాల నుంచి తీసుకోవడంతో కేసు దాకా వెళ్లింది. ఇదే తరహాలో మంచిర్యాల జిల్లా పారుపల్లి, కిష్టంపేటలో ఫారెస్ట్ అధికారులు పెట్టిన టోల్గేట్లలో త్రీ వీలర్‌కు రూ.30, కార్లు, జీప్‌లకు రూ.50, లారీలు- ట్రక్కులకు రూ.200 చొప్పున రుసం నిర్ణయించారు. ఈ రుసుములను ఏ చట్టాన్ని అనుసరించి నిర్ణయించారు. పీసీసీఎఫ్ ఎక్కడైనా చెప్పారా? ఇలాంటి ప్రశ్నలకు అధికారుల నుంచి సరైన సమాధానాలు రావడం లేదు.
ఈ ఏడాది జనవరిలోనే ఫారెస్ట్ టోల్గేట్లను ప్రారంభించారు. చెన్నూర్, కోటపల్లి స్థానికుల నుంచి రుసుం వసూలు చేయడంతో స్థానికంగా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. దీంతో టోల్ వసూలును ఆపేశారు. స్థానికులకు మినహాయింపు అని చెప్పి సరస్వతి పుష్కరాల సమయంలో మరోసారి టోల్గేట్లను ప్రారంభించారు. అది వివాదాస్పదం కావడంతో వసూలును నిలిపివేశారు.
తాజాగా కిష్టంపేటలో మినహాయింపు ఇచ్చి కోటపల్లి మండలం పారుపల్లి సమీపంలో ఫారెస్ట్ అధికారులు టోల్ వసూలు చేస్తున్నారు. దీనిపై స్థానికులు మండిపడుతున్నారు. అన్యాయంగా టోల్ వసూలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నేషనల్ హైవే అధికారులు, జిల్లా ఉన్నతాధికారులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలంటున్నారు. మా ప్రాంతంలో ఉంటే ఫారెస్ట్ టోల్‌గేట్‌లా లేక ఎన్హెచ్ఏఐ టోల్‌గేట్‌లా రెండింటిలో ఏదో ఒక్కటే ఉండాలని, స్థానికులకు వాటి నుంచి కచ్చితంగా మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.