ఆదిలాబాద్, జూన్ 7(నమస్తే తెలంగాణ) ః ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ స్థలాలతోపాటు, కిరాయితో ఉంటున్న ఇండ్లకు మున్సిపాలిటీ అధికారులు ఇంటి నంబర్లు కేటాయించడం, అక్రమార్కులు ఆ స్థలాలను రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకోవడం వెలుగులోకి వస్తున్నాయి. కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాలతో ఫిర్యాదులు రావడంతోపాటు యజమానులు తమ ఇంటికి ఇతరులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.
స్థలాల అక్రమణలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తూ కబ్జాదారులపై కేసులు నమోదు చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు ఉన్నాయని నకిలీ పత్రాలు సృష్టించి కబ్జాదారులు మున్సిపాలిటీలో దరఖాస్తు చేసుకుంటున్నారు. మరికొందరు తాము కిరాయి ఉంటున్న ఇండ్లకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి మున్సిపాలిటీలో ఫేక్ డోర్ నంబర్ తీసుకుని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తమ పేరిట యథేచ్ఛగా రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు.
అధికారుల వ్యవహారశైలిపై ఆరోపణలు
మున్సిపాలిటీ అధికారులు ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో షెడ్లు, ఇతరుల పేరిట ఉన్న స్థలాలకు ఇంటి నంబర్లు కేటాయించడంపై పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా తమ సొంత స్థలంలో ఇంటిని నిర్మించుకునే ఇందుకు సంబంధించిన అన్ని పత్రాలు, లింక్ డాక్యుమెంట్లతో మున్సిపాలిటీలో దరఖాస్తు చేసుకుంటే అన్ని పరిశీలించిన అధికారులు డోర్ నంబర్లు కేటాయించాలి. కిరాయి ఉంటున్న వారు నకిలీ పత్రాలు సృష్టించి దరఖాస్తు చేసుకుంటే ఇంటి నంబరు ఇవ్వడం కుదరదు.
మున్సిపాలిటీ అధికారులు ఖాళీ స్థలాల్లో షేడ్లకు ఇంటి నంబర్లు, కిరాయికి ఉంటున్న వారు నకిలీ పత్రాలతో దరఖాస్తు చేసుకున్నా డోర్ నంబర్లు కేటాయిస్తున్నారు. ఇంటి నంబర్లు ఆధారంగా అక్రమార్కులు విలువైన స్థలాలను తమ పేరిట రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. గతంలో మున్సిపాలిటీ కేటాయించిన ఇంటి నంబర్ల రిజిస్ట్రేషన్ చేయాలంటే రిజిస్ట్రేషన్ కార్యాలయం అధికారులు మున్సిపల్ కమిషనర్ నుంచి అభ్యతరం లేదనే పత్రాలు తీసుకురమ్మనే వారు. ఇప్పుడు ఆ నిబంధన అమలు చేయడం లేదు. అక్రమణలపై పోలీసులకు ఇప్పటికే పలు ఫిర్యాదులు రాగా విచారణ జరిపి నిందితులపై కేసులు నమోదు చేస్తున్నారు. అక్రమార్కులపై పోలీసులు తీసుకుంటున్న చర్యలను ప్రజలు అభినందిస్తున్నారు.