మంచిర్యాల ఏసీసీ, ఏప్రిల్ 22 : మావోయిస్టుల సమాచారమిచ్చిన వారికి నగదు బహుమతి అందిస్తామని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. సోమవారం కమిషనరేట్‌లోని తన కార్యాలయంలో మంచిర్యాల డీసీపీ అశోక్‌కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావుతో కలిసి మావోయిస్టుల ఫొటోలతో ఉన్న వాల్ పోస్టర్లను విడుదల చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు మావోయిస్టులకు సహకరించవద్దని, పోస్టర్లలో ఉన్నవారి గురించి తెలిస్తే పోలీసులకు సమాచారమివ్వాలని సూచించారు. లేకపోతే సీపీ రామగుండం : 08728 271333, డీసీపీ : 8712656503, ఎన్ఐబీ : 8712656596 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. మావోయిస్టులు అజ్ఞాతాన్ని వీడి జన జీవన స్రవంతిలో కలిసి ప్రజాసమస్యలపై చట్ట బద్ధంగా పోరాడాలన్నారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తామని సీపీ శ్రీనివాస్ అన్నారు. సోమవారం మంచిర్యాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గల స్ట్రాంగ్ రూంమ్, డీఆర్సీ సెంటర్, హాజీపూర్ మండలం ముల్కల్లలోని కౌంటింగ్ సెంటర్లను కలెక్టర్ సంతోష్, డీసీపీ అశోక్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. అబ్జర్వర్స్‌కు ఈ నెల 25న సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. మంచిర్యాల ఆర్డీవో రాములు, ఏసీపీ ఆర్.ప్రకాశ్, సీఐ బన్సీలాల్, ఎస్ఐలు, మంచిర్యాల, నస్పూర్ ఎంఆర్వోల, సిబ్బంది పాల్గొన్నారు.