మంచిర్యాలటౌన్, జూలై 29 : కాంగ్రెస్ నాయకులు స్థాయిని మరిచి మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు గురించి ఇష్టారాజ్యంగా.. అనుచితంగా మాట్లాడడం సరికాదని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గాదెసత్యం, నాయకులు నరేశ్, రవీందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ పట్టణ నాయకులు అధికారంలో ఉన్నట్లుగా మాట్లాడటం లేదని, ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యేపై కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, వారు బేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసత్యప్రచారాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని, ప్రతిపక్షంలో ఉన్న నాయకులను బెదిరించే ధోరణితో మాట్లాడుతున్నారన్నారు. వారి బెదిరింపులకు ఎవరూ భయపడేవారు లేరని స్పష్టం చేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని గ్రహించాలని, ప్రతిపక్షాలు విమర్శిస్తే స్వీకరించి, మరింత మెరుగ్గా పనిచేసి చూపించాలని అన్నారు. అసలు పనులు చేయడం మానేసి ఇంకా విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని అసహనం వ్యక్తం చేశారు.
గతంలో మహిళలు దివాకర్‌రావు ఇంటిమీదకు వస్తే ఏం చేశారో చెప్పాలని కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నారని, కానీ కేసులు పెట్టడం మా సంస్కృతి కాదని, అమాయకులైన మహిళలపై కేసులు పెడితే వారు ఇబ్బందులు పడుతారన్న ఉద్దేశంతోనే ఆనాడు కేసులు పెట్టలేదని గుర్తు చేశారు. ప్రెస్మీట్లో మాట్లాడిన వారి ఇండ్లలోకి వెళ్లి కొడతామని మాట్లాడుతున్నారని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి గురించి కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు అని, ప్రతీసారి ఏమీ చేయలేదని అంటున్నారని, కానీ ఇంట్లోనుంచి కాలు బయట పెడితే మీరు నడిచే రోడ్డు వేసింది దివాకర్‌రావే అని గుర్తుంచుకోవాలన్నారు. అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేయడం కాదని, చేతనైతే కేసు పెట్టి నిరూపించాలన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ, ఇచ్చిన హామీలను మరిచి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాల పునాధులపై అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడంలేదని అన్నారు. ఒక్కసారి అయినా ప్రజాప్రతినిధిగా గెలవలేని వారు కూడా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దివాకర్‌రావు గురించి మాట్లాడటం సరికాదన్నారు. ఐబీలో తవ్విన వేల ట్రాక్టర్ల మట్టి ఎక్కడికి పోయిందో చెప్పాలని ప్రశ్నించారు. ఈ సమావేశంలో నాయకులు తోట తిరుపతి, అక్కూరి సుబ్బయ్య, ఎర్ర తిరుపతి, తాజుద్దీన్, శంకర్, పడాల రవీందర్, తదితరులు పాల్గొన్నారు.