ఆసిఫాబాద్ అంబేదర్చౌక్, ఏప్రిల్ 18 : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఏర్పాటు చేసిన సహాయక పోలింగ్ కేంద్రాల్లో పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లు దీపక్ తివారీ, దాసరి వేణుతో కలిసి సిర్పూర్, ఆసిఫాబాద్ శాసనసభ నియోజకవర్గ పరిధిలోని తహసీల్దార్లు, ఎన్నికల అధికారులతో ఎన్నికల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులతో పాటు వయోవృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులకు రాంపులు ఏర్పాటు చేయాలన్నారు.
ఓటరు జాబితాపై పోలింగ్ కేంద్రం వివరాలు, చిరునామా సరి చూసుకోవాలని, ఏమైనా తప్పులు ఉన్నట్లయితే వెంటనే సరి చేయాలని సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓఆర్ఎస్. ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. తహసీల్దార్లు తమ పరిధిలోని ప్రతి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని, సెక్టార్ అధికారులు, బూత్ స్థాయి అధికారులు, సూపర్ వైజర్లతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి లోకేశ్వర్ రావు, కాగజ్ నగర్ రాజస్వ మండల అధికారి సురేశ్, తహసీల్దార్లు, ఎన్నికల విభాగం, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
లోకసభ ఎన్నిక నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఒక ప్రకటనలో తెలిపారు. సిర్పూర్, ఆసిఫాబాద్ శాసనసభ నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.ఈ నెల 25వ తేదీ వరకు (ప్రభుత్వ సెలవు రోజులు మినహాయించి) ప్రతి రోజూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం ఆదిలాబాద్ లోని రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఆదిలాబాద్,
సహాయ రిటర్నింగ్ అధికారి, రెవెన్యూ డివిజనల్ అధికారి రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించవచ్చని, నామినేషన్ ఫారాలను నిర్దేశిత పని వేళలయందు పొందవచ్చని తెలిపారు. ఈ నెల 26వ తేదీన ఉదయం 11 గంటల నుంచి రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఆదిలాబాద్ నందు నామినేషన్ల పరిశీలన జరుగుతుందని, అభ్యర్థిత్వము ఉపసంహరించుకొను నోటీసును అభ్యర్థి స్వయంగా, ప్రతిపాదకులచే, ఎన్నికల ఏజెంట్ కాని అభ్యర్థి చేత రాత పూర్వకముగా ఈ నెల 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోగా అందజేయవచ్చని పేర్కొన్నారు.
-అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారీ
లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ కేంద్రాల్లో పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారీ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో కాగజ్ గర్ రాజస్వ మండల అధికారి కాసబోయిన సురేశ్, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్‌తో కలిసి తహసీల్దార్లు, ఇంజినీరింగ్ విభాగం, సెక్టార్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
అమ్మ ఆదర్శ పాఠశాలల పథకంలో భాగంగా ఎంపికైన ప్రభుత్వ పాఠశా లల్లో పోలింగ్ కేంద్రాలు ఉన్నందున కల్పించాల్సిన వసతులపై యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించి మే 10వ తేదీలోగా పూర్తి చేసే విధంగా అధికారులు కృషి చేయాలని సూచించారు. 13వ తేదీన జరగనున్న లోక్ సభ ఎన్నికల పోలింగ్ కార్యక్రమం సందర్భంగా ప్రజలకు, పోలింగ్ విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేసేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
నస్పూర్, ఏప్రిల్ 18 : ఎన్నికల నేపథ్యం లో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి ఎన్నికల ఖర్చుల పరిశీలకులుగా నియమితులైన సమీర్ నైరంతర్యను గురువారం పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీలో జ్యోతి అతిథి గృహానికి రాగా కలెక్టర్ బదావత్ సంతోష్ మర్యాద పూర్వకంగా కలిశారు.
– మంచిర్యాల అదనపు కలెక్టర్ రాహుల్
తాండూర్, ఏప్రిల్ 18 : లోక్‌సభ ఎన్నికల కోసం ఓటర్లు, సిబ్బందికి అన్ని సౌకర్యాలతో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బీ రాహుల్ అన్నారు. గురువారం తాండూర్ మండల పరిధిలో ప్రజల సౌకర్యార్థం చేపడుతున్న పోలింగ్ కేంద్రాల మార్పు ప్రక్రియను పరిశీలించారు. మే 13న లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్ల తమ ఓటు హకును వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఇమ్రాన్‌ఖాన్, ఎంపీడీవో పీ శ్రీనివాస్, గిర్ధావార్ అంజన్‌కుమార్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
హాజీపూర్, ఏప్రిల్ 18 : పార్లమెంట్ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్‌ను మంచిర్యాల పార్లమెంట్ ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, జిల్లా రెవెన్యూ డివిజనల్ (ఆర్డీవో) కార్యాలయంలో నోటీస్ బోర్డులో అంటించారు. ఈ కార్యక్రమంలో వడాల రాములు, ఎన్నికల డీటీ గడియారం శ్రీహరితో పాటు ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
కోటపల్లి, ఏప్రిల్ 18 : పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్‌ను కోటపల్లి ఎంపీడీవో కార్యాలయంలో నోటీ స్ బోర్డుపై అంటించారు. గ్రామ పంచాయతీ కారా ్యలయాల్లోనూ అంటించాలని ఎంపీడీవో ఆకుల భూమయ్య ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ లక్ష్మయ్య, ఏపీవో బాలయ్య తదితరులున్నారు.
భీమారం, ఏప్రిల్ 18 :భీమారంలో మండల పరిషత్ కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్‌ను నోటిస్‌బోర్డులో చెన్నూర్ రిటర్నింగ్ అధికారి డీ చంద్రకళ అతికించారు. అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేయాలని సూచించారు. జడ్పీ పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి ఎంపీడీవో రాధ రాథోడ్, ఎంపీవో సతీశ్‌రెడ్డి పలు సూచనలు చేశారు.
చెన్నూర్ టౌన్, ఏప్రిల్ 18 : చెన్నూర్‌లోని తహసీల్ కార్యాలయంలో నోటిస్బోర్డుపై నోటిఫికేషన్‌ను అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ డీ.చంద్రకళ ఏర్పాటు చేయించారు. పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.