ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, ఫిబ్రవరి 15 : పదో తర గతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని, విద్యార్థుల తల్లిదండ్రులు ఆ దిశగా దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా విద్యా శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశా లల విద్యార్థుల తల్లిదండ్రులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వ హించారు. కలెక్టర్ మాట్లాడుతూ పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల పాత్ర కూడా కీలకమన్నారు. వార్షిక పరీక్షలకు ఇంకా 30 రోజుల సమయమే ఉందని, విద్యార్థులు ఇంటి వద్ద కూడా పరీక్షలకు సన్నద్ధమయ్యే విధంగా చూడాలని తెలిపారు.
ఇంట్లో టెలివిజన్, మొబైల్ వాడకుండా చూడాలని, పరీక్షల సమయాల్లో బయటకు తీసుకెళ్లడం తగ్గించాలని సూచించారు. విద్యార్థుల పురోగతిపై తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో మాట్లాడి తెలుసుకోవాలని, ప్రభుత్వం తరుపున జిల్లా యంత్రాంగం ప్రతి పాఠశాలలో విద్యారులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని, అల్పాహారం, అదనపు తరగతులు నిర్వహించాలని, సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పదో తరగతి వార్షిక పరీక్షా ఫలితాలలో జిల్లాను ముందంజలో నిలిపేందుకు సమష్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి గమ్మానియల్, జిల్లా గిరిజనాభివద్ధి శాఖ అధికారి రమాదేవి, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి సజీవన్ పాల్గొన్నారు.