ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, సెప్టెంబర్ 25 : అక్టోబర్ 3 నుంచి 9వ తేదీ వరకు ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఆసిఫాబాద్ ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ఓపెన్ సూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఎస్సెస్సీ పరీక్షల కోసం జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, ఇంటర్ పరీక్షల కోసం జనకాపూర్లోని జడ్పీ ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పదో తరగతి పరీక్షలకు 165 మంది, ఇంటర్ పరీక్షలకు 110 మంది విద్యార్థులు హాజరుకానున్నారన్నారు. ఉద యం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
పరీక్షల సమయానికి అనుగుణంగా ఆర్టీసీ బస్సులు నడిపించాలని, ప్రశ్నా పత్రాలను పోలీసు బందోబస్తు మధ్య తరలించాలని సూచించారు. పరీక్షా కేంద్రాల సమీపంలోని 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి జిల్లా విద్యాధికారి ఉదయ్ బాబు, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి తుకారాం, ఆసిఫాబాద్ టౌన్-1 సీఐ సతీశ్, అధికారులు పాల్గొన్నారు.