ఆసిఫాబాద్ టౌన్, మే 23 : జూన్ 9న నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన గ్రూప్-1 పరీక్షా కేంద్రాన్ని అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, అదనపు ఎస్పీ ప్రభాకర్ రావుతో కలిసి పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పరీక్ష నిర్వహణ కోసం జిల్లాలో 13 కేంద్రాలను ఏర్పాటు చేయగా, 2,783 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని చెప్పారు.
ఈ పరీక్షా కేంద్రంలో 210 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని, అన్ని వసతులు కల్పించాలని సూచించారు. ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ప్రతి కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని చెప్పారు. అభ్యర్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, ఉదయం 9 గంటలకు పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉంటుందని, 9.30 గంటలకు బయోమెట్రిక్ చెకింగ్తో పాటు 10 గంటల వరకు ప్రవేశానికి అనుమతి ఉంటుందని, 10 దాటిన తర్వాత అనుమతించరని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ రీజినల్ కో ఆర్డినేటర్ నర్సింహం, కళాశాల ప్రిన్సిపాల్, సీఐ పాల్గొన్నారు.
ఆసిఫాబాద్ టౌన్, మే 23 : ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వద్దని, ఈ నెల 30 లోగా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. గురువారం మండలంలోని అప్పపెల్లిలో అదనపు కలెక్టర్ దాసరి వేణుతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఆయన రైతులతో మాట్లాడారు. కొనుగోళ్లలో ఏవైనా సమస్యలుంటే పరిషారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ నెల 30లోగా కొనుగోళ్లు పూర్తి చేయాలని, తూకంలో మోసాలు లేకుండా చూడాలన్నారు.
రైతుల వారీగా కొనుగోళ్లు, సాగు విస్తీర్ణం, ధాన్యం వివరాలను నిర్వాహకులు ప్రతిరోజూ ట్యాబ్ లో ఎంట్రీ చేయాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం వెంటవెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు. వర్షాలు కురిసే అవకాశమున్నందున టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి నర్సింహరావు, మేనేజర్ వినోద్ కుమార్, జిల్లా కో ఆపరేటివ్ అధికారి రబ్బానీ, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.