ఆసిఫాబాద్ టౌన్, ఫిబ్రవరి 20 : వేసవి సమీపిస్తున్నందున జిల్లా ప్రజలకు తాగునీటి ఇబ్బందుల్లేకుండా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారాం, జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతిగౌడ్తో కలిసి వివిధ శాఖల అధికారులతో తాగునీటి ప్రణాళిక, ఉపాధి హామీ పనులు, ఇందిరమ్మ ఇండ్ల పనుల ప్రారంభం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.
కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి గ్రామపంచాయతీకి మిషన్ భగీరథ ద్వారా నీరు అందించాలని, పైప్లైన్ల లీకేజీలు అరికట్టాలని, మోటర్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ఏజెన్సీ మండలాలైన తిర్యాణి, లింగాపూర్, జైనూర్, కెరమెరి, సిర్పూర్ (యు)లలోని ఆవాస ప్రాంతాలకు తాగునీరందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ పనులు కల్పించాలని, ప్రతి గ్రామపంచాయతీ నుంచి 100 రోజులకు తకువ కాకుండా పని కల్పించాలని, ఆ దిశగా ఉపాధి హామీ సిబ్బందికి అవగాహన కల్పించాలని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు.