కాగజ్నగర్, అక్టోబర్18: వరి ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆదేశించారు. శుక్రవారం జిల్లాలోని కాగజ్నగర్ మండలం వంజరి గ్రామంలోని రైతు వేదికలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) దాసరి వేణు, సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లాతో కలిసి వ్యవసాయ, సహకార, మారెటింగ్, పౌర సరఫరాల శాఖల అధికారులు, ఐకేపీ బ్యాంకు అధికారులతో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వరి ధాన్యం దిగుబడికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వం సన్న రకం ధాన్యానికి 500 బోనస్ ఇస్తున్నందున, సన్న రకం, దొడ్డు రకం ధాన్యాలకు వేర్వేరుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తేమ శాతం, తదితర నిబంధనలపై రైతులకు ముందస్తుగా అవగాహన కల్పించాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో గన్ని సంచులు, టార్పాలిన్ కవర్లు, తూకం యంత్రాలతో సిద్ధంగా ఉండాలని తెలిపారు.
రైతులకు తాగునీరు, ఓఆర్ఎస్. ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, నీడ సౌకర్యం కల్పించాలని తెలిపారు. తూకం అయిన వెంటనే రైస్ మిల్లులకు తరలించి అన్లోడ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్ రావు, డీఎస్పీ రామానుజం, జిల్లా సహకార శాఖ అధికారి రబ్బాని, వ్యవసాయ, పౌరసరఫరాల, ఐకేపీ శాఖల అధికారులు, సిబ్బంది, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.