ఆదిలాబాద్, నవంబర్ 6(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులాల సర్వే బుధవారం ప్రారంభమైంది. ఆదిలాబాద్ మున్సిపాలిటీలోని పలు వార్డులతోపాటు గ్రామాల్లో అధికారులు, సిబ్బంది ఇంటింటా పర్యటించి వివరాలతో కూడిన స్టిక్కర్లు అంటించారు. జిల్లాలోని 17 మండలాల పరిధిలో 473 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలోని 1,49,151 ఇండ్లలో 1,612 మంది ఎన్యుమరేటర్లు, 173 మంది సూపర్వైజర్లు, ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 48,393 ఇండ్లలో 385 ఎన్యుమరేటర్లు, 41 మంది సూపర్వైజర్లు సర్వేలో పాల్గొన్నారు. కలెక్టర్ రాజర్షి షా పట్టణంలోని ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో గల ఓల్ట్ హౌసింగ్ బోర్డులో సర్వే తీరును పరిశీలించారు. జిల్లాలో 1.97 లక్షల కుటంబాల సర్వే నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే), గేర్జాం గ్రామాల్లో కలెక్టర్ రాజర్షి షా పర్యటించి సర్వే తీరును పరిశీలించారు. గెర్జాంలో ఇండ్ల సర్వేను సరిగా నిర్వహించకపోవడం, స్టిక్కర్లపై సరైన వివరాలు నమోదు చేయకపోవడం, సర్వే మ్యాప్ ద్వారా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నిర్వహించాలో అనే విషయాన్ని అధికారులు నిర్ధారించకపోవడంతో ఇచ్చోడ ఎంపీడీవో లక్ష్మణ్, మండల వ్యవసాయ అధికారి కైలాస్, పంచాయతీ కార్యదర్శి ఏజాజ్ హస్మీలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమగ్ర ఇంటింటి సర్వేకు సంబంధించి శిక్షణలు, సమావేశాలు, గూగుల్ మీట్, టెలి కాన్ఫరెన్స్‌ల ద్వారా అధికారులు సిబ్బందికి అవగాహన కల్పించినా విధులు సక్రమంగా నిర్వహించకపోవడంతో నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు.