మంచిర్యాల, జనవరి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘మేం గుంట చొప్పున భూమి అమ్ముతాం. రిజిస్ట్రేషన్ కూడా చేపిస్తాం. లే-అవుట్ అవసరం లేదు. ఫామ్ల్యాండ్స్ మీద పెట్టుబడి పెట్టండి. మీ భూమిలో ఎర్రచందనం, శ్రీగంధం చెట్లు పెట్టిస్తాం. లక్షల రూపాయలతో మీరు ఇప్పుడు కొనుగోలు చేసే గుంట స్థలం.. కొన్నేళ్లకు మిమ్ములను కోటీశ్వరులను చేస్తుంది. గుంట భూమి కొంటే చాలు. గజానికి రూ.ఐదు వేల నుంచి రూ.6 వేలు మాత్రమే మీ పెట్టుబడి. మా దగ్గర భూమి కొన్నోళ్లకు ఎన్నో ఆఫర్లు ఉన్నాయి. వారం రోజుల్లో సగం డబ్బులు చెల్లిస్తే లక్కీడ్రా తీస్తాం. కారు, స్కూటీలు, బంగారం గెలుచుకోవచ్చు.’
అని తీయని మాటలతో కస్టమర్ల గొంతులు కోసే ఫామ్ల్యాండ్స్ దందా జిల్లాలో జోరుగా సాగుతున్నది. నిబంధనల ప్రకారం ఫామ్ల్యాండ్స్ గుంటల చొప్పున రిజిస్ట్రేషన్ చేయడానికి లేదు. కానీ అధికారులకు ఆమ్యామ్యాలు ముట్టజెప్పి నాలా కన్వర్షన్ చేయించుకునో, ఇంటి నంబర్లు సృష్టించో.. ఎలాగోలా రిజిస్ట్రేషన్ చేపించడం, కస్టమర్లను బురిడీ కొట్టించడం పరిపాటిగా మారింది. ఎకరం భూమి రూ. ఐదు నుంచి రూ. పది లక్షలకు కొనడం, ఫామ్ల్యాండ్స్ పేరిట గుంటకు రూ. ఐదు లక్షల నుంచి రూ. పది లక్షలకు అమ్మడం.. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి ఎగనామం పెట్టి కోట్లు సంపాదించుకోవడం జరుగుతున్నది. ఇక కొందరు రియల్టర్లు పట్టా భూముల పక్కనున్న అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములను సైతం రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు.
పట్టణ ప్రాంతాల్లో కొందరు ప్రబుద్ధులు అసైన్డ్, ప్రభుత్వ భూములకు ఇంటి నంబర్లు తీసుకొని దర్జాగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడడంతో పాటు విలువైన ప్రభుత్వ భూముల, అసైన్డ్ భూములు కోల్పోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ అంశాలను కలెక్టర్ కుమార్ దీపక్ సీరియస్గా తీసుకున్నారు. ఇలాంటి భూ మోసాలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఐదు గుంటల్లోపు భూములను రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అన్ని డాక్యుమెంట్స్ ఉంటేనే చేయాలంటూ తహసీల్దార్లకు ఈ నెల 4న ఆదేశాలు జారీ చేశారు. ఇదే తరహాలో గత నెలలో సబ్ రిజిస్ట్రార్లపై సైతం సూచనలు చేశారు.
కలెక్టర్ ఆదేశాలతో అక్రమార్కులతో పాటు కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల గుండెల్లో దడ పుడుతున్నది. గడిచిన ఏడాది కాలంగా రిజిస్ట్రేషన్లు లేక పెట్టిన పెట్టుబడి మొత్తం ఆగిపోయి నానా ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా కలెక్టర్ ఆదేశాల నేపథ్యంలో ఇక తమ భూముల రిజిస్ట్రేషన్లు కావని భయపడుతున్నారు. ముఖ్యంగా ఫామ్ల్యాండ్స్ వ్యాపారానికి పేరుగాంచిన జైపూర్ మండలంలో పెట్టుబడి పెట్టిన రియల్టర్లు తలలు పట్టుకుంటున్నారు.
మండలంలో నర్వా, టేకుమట్ల, షెట్పల్లి, రాసూల్పల్లి, ఇందారం గ్రామాల్లో ఫామ్ల్యాండ్స్ వ్యాపారులకు ఈ నిర్ణయం కొత్త కష్టాలను తీసుకురానున్నది. ఇప్పుడేదో అధికారులను మేనేజ్ చేసుకొని అతికష్టంగా నెలకు ఒకటీ.. రెండు రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నామని.. గత నాలుగు రోజులుగా అది కూడా చేయడం లేదంటున్నారు. ఇన్నాళ్లూ సహకరించిన అధికారులు కూడా చేతులెత్తేస్తున్నారని వాపోతున్నారు. నిబంధనలకు విరుద్ధమని తెలిసినా నాలా కన్వర్షన్ పేరుతో ఎలాగోలా రిజిస్ట్రేషన్లు చేసిన కొందరు తహసీల్దార్లకు ఇప్పుడు ఈ వ్యవహారం మింగుడుపడడం లేదు.
అసలు కలెక్టర్ ఇకపై చేసే డాక్యుమెంట్ల వివరాలు అడగకుండా.. గడిచిన ఏడాదిలో చేసిన రిజిస్ట్రేషన్లపై నివేదిక తీసుకుంటే భూముల రిజిస్ట్రేషన్లలో జరుగుతున్న అక్రమాలు బయటికి వచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత రిజిస్ట్రేషన్లను పరిశీలించి నిబంధనలకు వ్యతిరేకంగా పని చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.