నస్పూర్, జనవరి 25 : దేశ పౌరులకు భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ఎంతో విలువైనదని, 18 ఏళ్లు నిండిన వారంతా ఓటు హక్కు పొందాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. శనివారం నస్పూర్‌లోని కలెక్టరేట్లో 15వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచంలోనే మన దేశం అతి పెద్ద ప్రజాస్వామ్యం కలిగి ఉందన్నారు. ఒక్క ఓటుతో గెలుపోటములు మారుతాయని, ఎన్నికల సమయంలో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలన్నారు. అనంతరం అధికారులు, విద్యార్థులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వృద్ధులు, యువ ఓటర్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోతీలాల్, ఆర్డీవో శ్రీనివాసరావు, డీఆర్డీవో కిషన్ పాల్గొన్నారు.
ఆసిఫాబాద్ టౌన్, జనవరి 25 : ఓటు హకును వినియోగించుకుందాం – ఆదర్శవంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థ కోసం మనవంతు పాత్ర పోషిద్దామని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారీ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించిన ఓటరు దినోత్సవంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్, కాగజ్‌నగర్ సబ్‌కలెక్టర్ శ్రద్ధాశుక్లా, ఆసిఫాబాద్ ఆర్డీవో లోకేశ్వరరావు, స్వీప్ నోడల్ అధికారి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారాంతో కలిసి హాజరయ్యారు. అనంతరం అధికారులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. గత శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటరు జాబితా తయారీ, ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడంలో కృషి చేసిన బూత్ స్థాయి అధికారులు, సూపర్వైజర్లు, ఉప తహసీల్దార్లు, పంచాయతీ కార్యదర్శులు, తహసీల్దార్లకు ప్రశంసా పత్రాలు అందజేశారు. రంగోలి కార్యక్రమంలో పాల్గొన్న వారికి బహుమతులు అందజేశారు. కలెక్టరేట్ పరిపాలనాధికారి మధుకర్ పాల్గొన్నారు.
కలెక్టరేట్లో జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురసరించుకొని నిర్వహించిన 2కే రన్ కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారీ.. జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, ఆసిఫాబాద్ ఆర్డీవో లోకేశ్వరరావు, స్వీప్ నోడల్ అధికారి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారాంతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. కుమ్రం భీం చౌరస్తా మీదుగా జిల్లా కేంద్రంలోని బస్టాండ్, అంబేదర్ చౌక్ వరకు కొనసాగించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతి, తహసీల్దార్ రోహిత్, కలెక్టరేట్ పరిపాలనాధికారి మధుకర్ పాల్గొన్నారు.