నస్పూర్, సెప్టెంబర్ 30 : రెండో సాధారణ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నోడల్ అధికారులకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మండల స్థాయిలో తహసీల్దార్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు పకడ్బందీగా చేపట్టాలని, అభ్యర్థుల సభలు, సమావేశాలు కోసం అనుమతి తప్పనిసరి అన్నారు. మాస్టర్ల ట్రైనర్ల ద్వారా అందిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రయ్య, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, డీపీవో వెంకటేశ్వర్రావు, జడ్పీటీసీ గణపతి, డీఈవో యాదయ్య, సంక్షేమాధికారి రౌఫ్ఖాన్ పాల్గొన్నారు.
బాధ్యతాయుతంగా పనిచేయాలి ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. నామినేషన్ నుంచి ఎన్నికల ఫలితాలు ప్రకిటించే వరకూ ప్రతి అంశంపై అప్రమత్తంగా ఉండాలన్నారు. పొరపాట్లు లేకుండా సజావుగా సాగేలా చూడాలన్నారు.