కోటపల్లి, ఆగస్టు 28 : ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్ది నాణ్యమైన విద్యనందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. బుధవారం సర్వాయిపేట ప్రాథమిక పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులను పలు ప్రశ్నలను అడిగి.. వారి సామర్థ్యాలను పరిశీలించారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ అంకితభావంతో పని చేసి ప్రభుత్వ పాఠశాలలకు గుర్తింపును తీసుకురావాలన్నారు.
విద్యార్థుల గైర్హాజరు తగ్గించాలని, విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి వారిని క్రమం తప్పకుండా పాఠశాలకు వచ్చేలా చూడాలన్నారు. అనంతరం సర్వాయిపేట, ఎసన్వాయి, ఎడగట్ట గ్రామాల్లో పర్యటించిన పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశమున్నందున పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. నీటి లీకేజీలను అరికట్టాలని, మురుగు నీరు నిల్వ ఉండకుండా చూడాలని ఆదేశించారు.
అనంతరం కోటపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ విద్యాభోదన, పాఠశాలలోని వసతులపై ఆరా తీశారు. వంటశాలను పరిశీలించి పరిశుభ్రమైన వాతావరణలో భోజనం వండాలని, మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టాలని సూచించారు. పాఠశాల ప్రత్యేకాధికారిణి హరితతో మాట్లాడి పాఠశాలలోని సమస్యలు తెలుసుకున్నారు. ఎంపీడీవో ముల్కల్ల సత్యనారాయణ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు శంకర్, తాజుద్దీన్, సంతోష్, టైపిస్ట్ శివనాగ సాత్విక్ ఉన్నారు.
మెరుగైన వైద్యమందించాలి
చెన్నూర్ రూరల్, ఆగస్టు 28 : రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం చెన్నూర్‌లోని ప్రభుత్వ దావఖానను ఆయన తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి సేవల గురించి అడిగారు. 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండాలని సూచించారు. డెంగ్యూ, మలేరియా సోకిన రోగులపై ప్రత్యేక శ్రద్ధపెట్టి చికిత్స అందించాలని వైద్యులు సత్యనారాయణకు సూచించారు. దావఖాన పరిసరాలతో పాటు రోగుల వార్డుల్లో శుభ్రత పాటించాలని ఆదేశించారు. పట్టణంలోని పలు వార్డుల్లో సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలన్నారు. ఓపీ రిజిష్ట్రర్లు, వైద్యుల హాజరు పట్టికలను పరిశీలించారు. రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.