నిర్మల్, జూలై 12(నమస్తే తెలంగాణ) : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియను పూర్తి పారదర్శకంగా, వంద శాతం పూర్తి చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. నిర్మల్ జిల్లాలో ఎస్ఐఆర్పై కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పని చేస్తున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరును ఓటరు జాబితాలో నమోదు చేసేలా బీఎల్వోలకు ఆదేశాలిచ్చామన్నారు. మరణించిన, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయిన వారితోపాటు రెండు, అంతకంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓట్లు కలిగిన అనర్హుల పేర్లు తొలగిస్తున్నట్లు తెలిపారు.
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో పేర్లు నమో దు చేసుకోవాలని సూచించారు. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్, ముథోల్, నిర్మల్ నియోజకవర్గాల పరిధి లో మొత్తం 7,55,905 మంది ఓటర్లు ఉన్నారన్నా రు. ఇందులో ఇప్పటి వరకు 90 శాతానికి పైగా మం దికి ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేశామని, నేటి తో 50 శాతం వరకు డిజిటలైజేషన్ ప్రక్రియ కూడా పూర్తయిందని వెల్లడించారు. జిల్లాలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదివారం ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
కలెక్టర్ భవేశ్ మిశ్రా : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు 2002 సంవత్సరంలో చివరిసారి ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగింది. ఆ తర్వాత అనేక ఎన్నికలు జరిగినప్పటికీ, వలస ఓటర్లను, మరణించినవారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించలేకపోయాం. దీని కారణంగా చాలా చోట్ల పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతూ వస్తున్నది. ఉదాహరణకు హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో ప్రతిసారి పోలింగ్ శాతం తక్కువగా (40 నుంచి 45 శాతం మాత్రమే) నమోదవుతున్నది. దీనికి కారణం ఓటరు లిస్టులో ఉన్న చాలా మంది ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ర్టాలకు వలసపోయి ఉంటారు. అలా వెళ్లినవారి పేర్లు ఓటరు లిస్టులో ఉండడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే కేంద్ర ఎన్నికల సంఘం ప్రతి ఓటరు వివరాలపై పూర్తి విచారణ చేసి పారదర్శకంగా కొత్త ఓటరు జాబితాను రూపొందించేందుకే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను చేపట్టింది.
కలెక్టర్ : సిటిజన్‌గా ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదై ఉండాలి. అలాగే ఓటరు జాబితాలో కచ్చితత్వంతో కూడిన పూర్తి వివరాలు ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉంది. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండాలంటే ప్రజలు ఎస్ఐఆర్ ప్రక్రియకు పూర్తిగా సహకరించాలి. ప్రజల భాగస్వామ్యం లేనిదే ఏ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయలేం. చివరి రోజు వరకు ఎదురు చూడకుండా పూర్తి చేసిన ఫారాలను ప్రజలు వెంటవెంటనే బీఎల్వోలకు అందజేయాలి. ఫారాలు తీసుకొని తిరిగి ఇవ్వని వారి ఇంటికి రేపటి నుంచి ప్రత్యేక బృందాలు విజిట్ చేస్తాయి. వారి సందేహాలను నివృత్తి చేసి ఫారాలను సేకరిస్తాయి.
కలెక్టర్ : నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 7,55,905 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో దాదాపు 90 శాతం మందికి ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేశాం. అలాగే ప్రజలు తిరిగి ఇచ్చిన ఫారాలను 50 శాతం వరకు డిజిటలైజేషన్ చేశాం. ఈనెల 24 వరకు ఈసీ గడువు ఉన్నప్పటికీ, 20వ తేదీలోపు ప్రక్రియను పూర్తి చేయాలని సర్వేలో పాల్గొంటున్న సిబ్బందికి ఆదేశాలిచ్చాం.
కలెక్టర్ : ఎస్ఐఆర్ ప్రక్రియను సులువుగా, వేగంగా పూర్తి చేసేందుకు బీఎల్వో యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఓటరు వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసేలా బీఎల్వోలకు ఈ యాప్‌పై పూర్తి అవగాహన కల్పించాం.
కలెక్టర్ : ఎస్ఐఆర్లో పాల్గొంటున్న అన్ని శాఖల అధికారులు, సిబ్బంది మధ్య పూర్తి సమన్వయం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్, ఐకేపీ సిబ్బంది సహకారాన్ని తీసుకుంటున్నాం. పల్లెల్లో ఎలాంటి ఇబ్బంది లేదు. పట్టణాల్లో మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది సర్వే విధుల్లో పాల్గొంటున్నారు. అయితే పట్టణాల్లోనే కొంత ఇబ్బంది ఎదురవుతున్నది. కొన్ని వార్డుల్లో ఓటర్లను గుర్తించడం బీఎల్వోలకు కష్టమవుతున్నది. ఒక వార్డులో ఉన్న ఓటరు.. మరో వార్డులో ఉండడం వల్ల కొంత ఇబ్బందిగా మారుతున్నది. అందుకే జిల్లాలోని ప్రధాన పట్టణాలైన నిర్మల్, భైంసా పట్టణాలను రెండు జోన్లుగా విభజించి ఉన్నతాధికారులకు(అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ, భైంసా సబ్ కలెక్టర్) ఇన్చార్జి బాధ్యతలు అప్పగించాం.
కలెక్టర్ : ఓటరు జాబితాలో రెండు చోట్ల పేర్లున్న వారు ఏదైనా ఒక చోట మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. రెండు చోట్ల దరఖాస్తు చేస్తే ఎన్యుమరేషన్ ఫారాలను డిజటలైజేషన్ చేసేటప్పుడు బీఎల్వో యాప్‌లో ఓటరుగా ఆమోదం లభించదు. ప్రతి ఒక్కరు ఎన్యుమరేషన్ ఫారాన్ని అందజేయాల్సి ఉండడంతో వలస వెళ్లిన వారు, మరణించిన వారు ఓటరుగా నమోదు చేసుకొనేందుకు అవకాశం ఉండదు. రాజకీయ పార్టీల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి, క్షేత్రస్థాయిలో పరిష్కరిస్తున్నాం.
కలెక్టర్ : ఎస్ఐఆర్లో పాల్గొనే ప్రతి అధికారి, బీఎల్వో, రాజకీయ పార్టీల ప్రతినిధులకు సర్వేకు సంబంధించిన అన్ని అంశాలపై మూడు నుంచి నాలుగు సార్లు ఇప్పటికే శిక్షణ ఇచ్చాం. గ్రామాల్లో బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేశారు. పట్టణాల్లో ఓటరు లిస్టులో ఉన్న అడ్రస్‌లో కొంతమంది అందుబాటులో లేకపోవడంతో ఫారాల పంపిణీలో కొంత ఇబ్బంది ఉంది. ఎవరికైనా ఎన్యుమరేషన్ ఫారాలు అందకపోతే 1950కు కాల్ చేయవచ్చు. సేకరించిన ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియలో నిర్మల్ జిల్లా టాప్ టెన్‌లో ఉంది. ఈ రోజు వరకు 50 శాతం పూర్తయింది. అధికారులు, బీఎల్వోలు సమన్వయంతో పని చేస్తున్నారు. కచ్చితంగా ఈసీ పెట్టిన గడువులోగా సర్ ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
కలెక్టర్ : అర్హులైన ఏ ఒక్కరి ఓటు కూడా మిస్ కావొద్దని అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చాం. అలాగే 18 ఏళ్ల వయసు నిండిన యువత కోసం ప్రత్యేక ఫారం ద్వారా ఓటరుగా నమోదు చేసుకొనేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం.