నస్పూర్, ఏప్రిల్ 19 : జిల్లాలో ఉపాధి హామీ పనులను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ పేర్కొన్నారు. శుక్రవారం నస్పూర్‌లోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ రాహుల్, డీఆర్డీవో కిషన్, డీపీవో వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈవో గణపతితో కలిసి ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు, ఏపీవోలతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి కూలీల సంఖ్య పెంచాలని, వేసవి దృష్ట్యా పని ప్రదేశాల్లో తాగునీరు, నీడతో పాటు అవసరమైన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. వడదెబ్బకు గురైన వారికి ప్రాథమిక చికిత్స అందించి సమీపంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, ప్ర భుత్వ దవాఖానలకు తరలించాలని సూచించారు.
పంచాయతీ కార్యదర్శులు పని ప్రదేశాలను సందర్శించాలని, అవసరమైన ఏర్పాట్లు చేయాలని, జాబ్‌కార్డుల వివరాలను నమోదు చేయాలన్నారు. నర్సరీల్లోని మొక్కలను సంరక్షించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోఅభివృద్ధి పనుల్లో భాగంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏకరూప దస్తుల తయారీ కోసం విద్యార్థుల కొలతలు తీసుకున్నారని, మెటీరియల్ రాగానే కుట్టు ప్రారంభిస్తారన్నారు. లోక్‌సభ ఎన్నికల విజయవంతానికి అధికారులందరూ సమన్వయంతో కృషి చేయాలన్నారు. అనంతరం అందరితో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లకు మొదటి ర్యాండమైజేషన్ పూర్తయ్యిందని, ఈవీఎం, వీవీ ప్యాట్లను ఆయా చోట్లకు తరలించామని, ఆయా సెగ్మెంట్ల పరిధిలో ఎలక్ట్రానిక్ ఓటింగ్‌యంత్రాల భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ పేర్కొన్నారు.
శుక్రవారం నస్పూర్‌లోని ఈవీఎం గోదాం నుంచి జిల్లా అదనపు కలెక్టర్లు రాహుల్, మోతీలాల్, ఆర్డీవో రాము లు,ప్రత్యేక ఉప పాలన ఆధికారి చంద్రకళతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ ప్రతినిధు ల సమక్షంలో ఈవీఎం, వీవీ ప్యాట్ల సెగ్రిగేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మే రకు ఎలక్ట్రానిక్ ఓటింగ్యంత్రాలను కేటాయించినట్లు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతం గా జరిగేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎన్నికల త హసీల్దార్ శ్రీనివాస్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.