నస్పూర్/మంచిర్యాల ఏసీసీ/ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్, జూన్ 9 : మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ఉదయం 9.30 గంటల నుంచి బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకున్నారు. నిబంధనల మేరకు బూట్లు, మొబైల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను కేంద్రాల్లోకి అనుమతించలేదు. 144 సెక్షన్ అమలు చేశారు. నిరంతర విద్యుత్ సరఫరా, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులు, ప్రథమ చికిత్స కిట్లతో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. మంచిర్యాలలోని ప్రతిభ కళాశాల, మిమ్స్ ప్లేస్కూల్, ఆర్బీహెచ్వీ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను కలెక్టర్ బదావత్ సంతోష్ పరిశీలించారు.
ఆయన మాట్లాడుతూ జిల్లాలో 27 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, 9,384 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా, 7,443 మంది హాజరైనట్లు తెలిపారు. మంచిర్యాలలోని ఆర్బీహెచ్వీ సూల్, ప్రభుత్వ బాలుర పాఠశాలలోని పరీక్షా కేంద్రాలను రామగుండం పోలీసు కమిషనర్ శ్రీనివాస్, డీసీపీ అశోక్‌కుమార్, ఏసీపీ ప్రకాశ్‌తో కలిసి పరిశీలించారు.
ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. పరీక్ష అనంతరం ఎగ్జామ్స్ షీట్స్ స్ట్రాంగ్ రూమ్‌కు తరలించే విషయమై పోలీస్ అధికారులు, సిబ్బందికి తగు సూచనలు చేశారు. మంచిర్యాల పట్టణ సీఐ బన్సీలాల్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరేశ్‌కుమార్, ఎస్ఐలు ఉన్నారు.
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని మోడల్ సూల్, పీటీజీ గురుకుల పాఠశాల, కాగజ్‌నగర్ పట్టణంలోని వసుంధర డిగ్రీ కళాశాల, సెయింట్ క్లారిటీ విద్యాలయంలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో 13 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, 2,783 మంది అభ్యర్థులకుగాను 2,258 మంది (81.13 శాతం) హాజరయ్యారని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు కల్పించామని తెలిపారు.