కుంటాల : నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని అందకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలోని ( Andakur PACS ) ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ( Collector Abhilasha Abhinav ) బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు కల్పించవలసిన సౌకర్యాలపై ఆరా తీశారు.ఈ క్రమంలో కేంద్రంలో టెంట్, త్రాగునీరు వసతులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొనుగోలు ప్రక్రియలో అలసత్వం కారణంగా రెండు లక్షల రూపాయల జరిమానా విధించారు. సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని తక్షణమే తూకం వేసి తరలించాలన్నారు. తేమ శాతం నిబంధనల మేరకే కొనుగోలు చేయాలని సూచించారు. తగినన్ని గన్ని సంచులు, టార్పాలిన్లు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అన్ని రిజిస్టర్లను పరిశీలించిన అనంతరం ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తెలుపాలని కలెక్టర్ రైతులను కోరారు. ప్యాడీ క్లీనింగ్ యంత్రాల ద్వారా ధాన్యాన్ని శుభ్రపరచాలని సూచించారు. ఈ తనిఖీలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో కోమల్ రెడ్డి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.