ఆసిఫాబాద్, అక్టోబర్ 21 : ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ,జిల్లా ఎన్నికల అధికారి బోర్కడే హేమంత్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఈవీఎం గోదాంలో అదనపు కలెక్టర్లు దీపక్ తివారీ, దాసరి వేణుతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పా ర్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం, వీవీ ప్యాట్ల రాండమైజేషన్ ప్రక్రియను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నవంబర్ 3 నుంచి 10 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. 13న పరిశీలన, 15న ఉపసంహరణ, 30వ తేదీన పోలింగ్ , డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్ జరుగుతాయని వివరించారు. ఎన్నికల నిబంధనలు డిసెంబర్ 5 వరకు అమల్లో ఉంటాయని తెలిపారు.
ఎన్నికల నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 597 పోలింగ్ కేం ద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలోని సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాలకు కేటాయించిన బ్యాలెట్, కంట్రోల్ యూ నిట్లు, వీవీ ప్యాట్ల పంపిణీ ప్రక్రియను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పంపిణీ చేశామన్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గానికి 380 బ్యాలెట్ యూనిట్లు, 380 కంట్రోల్ యూనిట్లు, 425 వీవీ ప్యాట్లు, సిర్పూర్ నియోజకవర్గానికి 366 బ్యాలెట్ యూనిట్లు, 366 కంట్రోల్ యూనిట్లు, 410 వీవీ ప్యాట్లు కేటాయించామని తెలిపారు. స్ట్రాంగ్ రూంల వద్ద 24 గంటలు పోలీసు బందోబస్తు ఉంటుందని చెప్పారు. ప్రతి అంశం సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో కదం సురేశ్, ఎన్నికల విభాగం అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
బెల్లంపల్లి, అక్టోబర్ 21 : బెల్లంపల్లిలోని జడ్పీ బజార్ ఏరియా పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములకు శనివారం పటిష్ట భద్రత నడుమ, గుర్తింపు పొందిన రాజకీయ ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలను భద్రపరిచారు. ఈ ప్రక్రియను మొత్తం వీడియో చిత్రీకరణ చేశారు. అదనపు కలెక్టర్, నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి రాహుల్ దగ్గరుండి పర్యవక్షించారు. 284 బ్యాలట్ యూనిట్లు, 284 కంట్రోల్ యూనిట్లు, 318 వీవీ ప్యాట్లను భద్రపరిచినట్లు రాహుల్ తెలిపారు. స్ట్రాంగ్ రూంలు పూర్తి సీసీ కెమెరాల పర్యవేక్షణ, కట్టుదిట్టమైన భద్రత నిఘాలో ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ సుధాకర్, డీటీ ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, మున్సిపల్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.