నిర్మల్ టౌన్, ఫిబ్రవరి 24 : రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు తీపి కబురు ప్రకటించింది. పల్లె, పట్టణ ప్రగతికి ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రతినెలా నిధులను మంజూరు చేయడమే కాకుండా ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనం అందిస్తున్నది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రారంభంలో ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాన్ని జడ్పీటీసీ, ఎంపీపీలు, జడ్పీ కో ఆప్షన్ సభ్యులకు రూ.10వేల చొప్పున, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, మండల కో అప్షన్ సభ్యులకు రూ.5వేల చొప్పున గౌరవ వేతనాన్ని చెల్లించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు నెలల క్రితమే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ప్రతినెలా అందిస్తున్న గౌరవ వేతనాన్ని 30శాతం పెంచడంతో ఇప్పుడు జడ్పీటీసీలు, ఎంపీపీలు, జడ్పీ కో ఆప్షన్ సభ్యులకు రూ. 13500 చొప్పు న, ఎంపీటీసీలు, సర్పంచ్‌లకు, మండల కో ఆప్షన్ సభ్యులకు రూ.6,500 చొప్పున చెల్లిస్తున్నారు. ఈ నిధులు డీపీవో ఖాతాలో జమ చేసి ఎంపీడీవోల ఖాతాలకు బదిలీ చేసి వారి ద్వారా సర్పంచ్ల ఖాతాల్లోకి పంపించేవారు. జడ్పీటీసీ, జడ్పీ కో ఆప్షన్ సభ్యులకు జడ్పీ సీఈవో ఖాతాల్లో జమ చేసి వారి ద్వారా చెల్లించేవారు. వేతనాల చెల్లింపులో పారదర్శకత పాటించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వేతనాల చెల్లింపునకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసే విధంగా చర్యలు చేపట్టింది. జనవరి వరకు పరోక్ష పద్ధతిలో గౌరవ వేతనం పొందిన ప్రజాప్రతినిధులు ఫిబ్రవరి నుంచి నేరుగా వారి ఖాతాలకే చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 1507 పంచాయతీలుండగా.. 68 మండలాలున్నాయి. 598 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ప్రతి మండలానికో ఎంపీపీ, జడ్పీటీసీ ఉన్నారు. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆయా మండలాల్లో ఎంపీపీలతో పాటు జడ్పీటీసీలు, కో ఆప్షన్ సభ్యు లు, ఎంపీటీసీలు, సర్పంచ్ల బ్యాంకు ఖాతాలు సేకరించిన అధికారులు వారి ఖాతాల్లోనే గౌరవ వేతనం జమయ్యేలా అన్ని వివరాలను ఆన్లైన్లో నమోదు చేసినట్లు తెలిపారు. ఫిబ్రవరి నుంచే నేరుగా ప్రజాప్రతినిధుల ఖాతాల్లో గౌరవ వేతనం పడనుండడంతో వారు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 1517 జీపీలుండగా..ఆదిలాబాద్‌లో 465, నిర్మల్‌లో 396, ఆసిఫాబాద్‌లో 335, మంచిర్యాలలో 311 మంది సర్పంచ్‌లున్నారు. ఆదిలాబాద్‌లో 16, మంచిర్యాలలో 17, నిర్మల్‌లో 18, ఆసిఫాబాద్‌లో 15 మండలాలలుండగా.. ఎంపీపీలు, జడ్పీటీసీలు, జడ్పీ కో ఆప్షన్ సభ్యులకు ప్రయోజనం దక్కనుంది. దీనికితోడు 598 మంది ఎంపీటీసీలకు గౌరవ వేతనం అందనుంది. ఆన్లైన్ ద్వారా ఈ వేతనాన్ని బ్యాంక్ ఖాతాల్లో జమకానుండడంతో ప్రజాప్రతినిధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నిర్మల్ జిల్లాలో ఫిబ్రవరి నుంచే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనం బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు మార్గదర్శకాలు జారీ కావడంతో ఖాతాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందించాం. ఆయా మండలాల్లో పని చేస్తున్న సర్పంచ్ల పేర్లు, ఊరు, మండలం, బ్యాంకు ఖాతా నంబర్‌తో పాటు అన్ని వివరాలను సేకరించి ప్రభుత్వానికి పంపించాం. ఈనెల నుంచే గౌరవ వేతనం వారి ఖాతాల్లో జమ అయ్యేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
వెంకటేశ్వర్రావు, నిర్మల్ డీపీవో
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు టీఆర్ఎస్ హయాంలోనే గౌరవం దక్కుతున్నది. మొన్నటి వరకు రూ.10వేలు ఉన్న గౌరవ వేతనాన్ని ప్రస్తుతం రూ.13500 చెల్లిస్తున్నారు. గతంలో వేతనాలు మొదటగా జడ్పీ ఖాతాలోకి వచ్చి.. అక్కడినుంచి ఎంపీపీ, జడ్పీటీసీలకు బదిలీ చేసేవారు. ఇప్పుడు నేరుగా వారి మా ఖాతాల్లోనే ఈ నెల నుంచే జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం చాలా సంతోషంగా ఉంది.
విజయలక్ష్మి, నిర్మల్ జడ్పీ చైర్పర్సన్
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాన్ని నేరుగా బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేయడం చాలా సంతోషంగా ఉంది. గతంలో గౌరవ వేతనం విడుదలైతే మా ఖాతాల్లో జమ కావడానికి వారం సమయం పట్టేది. దీనివల్ల వేతనం తీసుకోవడంలో కొన్ని ఇబ్బందులు తలెత్తేవి. ప్రభుత్వం ఈనెల నుంచే బ్యాంకు ఖాతాల్లో నేరుగా వేతనం చెల్లిస్తున్నందుకు సంతోషంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అది అందరికీ ప్రయోజనం కలిగేలా ఉంటుంది.
కొత్తపల్లి గంగామణి, జడ్పీటీసీ, కుంటాల