హాజీపూర్, జూన్ 11 : ‘మాకు సెంటు భూమి లేదు. అత్తామామలిచ్చిన గుడిసెల్నే ఉంటున్నం. గిప్పుడు సీఎం కేసీఆర్ సార్ 75 గజాల భూమికి పట్టా ఇచ్చిన్రు. ఆయన చేతుల మీదుగా తీసుకుంటుంటే మస్తు సంబురమనిపించింది. దిక్కూమొక్కులేని మాకు భూమిచ్చి భరోసానిచ్చిన్రు. ఇందుకు మస్తు సంతోషంగా ఉంది.’ అని మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం దొనబండ గ్రామానికి చెందిన బిరుదుల లక్ష్మి తెలిపింది. శుక్రవారం మంచిర్యాలలో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఇంటి పట్టా అందుకున్న సందర్భంగా ఆమెను ‘నమస్తే తెలంగాణ’ పలకరించగా, తమ అభిప్రాయం వ్యక్తం చేసింది.
నమస్తే : మీకు సొంత భూమి లేదా ? ఎన్నేండ్లుగా ఈ గుడిసెలో ఉంటున్నారు?
లక్ష్మి : నాకు 25 ఏండ్ల కింద పోషయ్యతో పెండ్లయ్యింది. మాకు కొడుకు, బిడ్డ ఉన్నరు. కూలీనాలీ చేసి పెండ్లిళ్లు చేసిన. మాకు సెంటు భూమి కూడా లేదు. మొదట్లో అత్తామామలతో కలిసి ఉన్నం. ఏడాది గడిసినంక ఏరుపోసిన్రు. గప్పటి నుంచి మా అత్తామామలిచ్చిన గీ చిన్న గుడిసెల్నే ఉంటున్నం. వానకాలం ఉరువకుండా కవర్ కప్పుకొని ఉంటున్నం.
నమస్తే : ఈ ఇంటి జాగ ఎలా వచ్చింది?
లక్ష్మి : మా ఊరు సర్పంచ్ సత్యం సార్‌ను, ఎంపీటీసీ బేతు రమాదేవి మేడం దగ్గరకు పోయి మా బాధ చెప్పుకున్నం. వాళ్లు ఎమ్మెల్యే దివాకర్‌రావు సారు దగ్గరికి తీసుకుపోయిన్రు. దయగల సారు నీకు ఇంటి జాగ వస్తదమ్మ అని చెప్పిండు. ఎమ్మెల్యే చెప్పినట్టే నాకు 75 గజాల భూమి ఇచ్చిన్రు.
నమస్తే : కేసీఆర్ భూమి పట్టా ఇస్తడని అనుకున్నావా? ఎలా అనిపించింది ?
లక్ష్మి : మొదట్ల మా ఎంపీటీసీ మేడం నీకు రేపు (శుక్రవారం) భూమి పట్టా ఇస్తున్నరు అని చెప్పింది. మన ముఖ్యమంత్రి కేసీఆర్ సారు ఇస్తరు అంటే నాకు మాట రాలే. పెద్ద సారు.. పేరైతే ఎరుకనే.. మాకు పింఛన్లు ఇచ్చి, రేషన్ బియ్యం ఇచ్చే దేవుడు ఆయన. గంత పెద్ద సారు నాకు పట్టా కాగితం ఇస్తుండా! అని కొంచెం సేపు కిందిమీదైంది. పొద్దుగూకే వరకు అందరూ లక్ష్మి నీకు కేసీఆర్ సారు పట్టా ఇస్తుండట కదా.. నువ్వు అదృష్టవంతురాలివి అంటుంటే సంబుర మనిపించించింది(ఆనంద భాష్పాలు).
నమస్తే : సీఎం సారు చేతుల మీదుగా పట్టా తీసుకుంటుంటే ఎలా అనిపించింది ?
లక్ష్మి : సారు దగ్గరకు పోతంటే భయమైంది. సారు దగ్గరకు పోయినంక నవ్వుకుంటూ పట్టా అందుకున్నంక పాణం అలకగైంది. సానా దినాలైనంక నా పుట్టింటికీ పోతే ఎట్లుంటదో గట్లనిపించింది. నా జన్మ ధన్యమైంది. సీఎం సారుకు సచ్చేదాక రుణపడి ఉంట.