ఖానాపూర్‌లో ఆదివారం నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. నియోజకవర్గం నుంచి 70 వేల మంది వస్తారని అంచనా వేయగా, అంతకు మించి రావడంతో సభా ప్రాంగణం కిటకిటలాడింది. స్థలభావంతో అనేక మంది కార్యకర్తలు, ప్రజలు రోడ్లపైనే ఉండి ముఖ్యమంత్రి ప్రసంగం వినాల్సి వచ్చింది. వీవీఐపీ, వీఐపీ, ప్రెస్గ్యాలరీలు కూడా జనంతో నిండిపోయాయి. ఫ్లెక్సీలు.. జెండాలతో ప్రధాన వీధులన్నీ గులాబీమయమయ్యాయి.
సీఎం కేసీఆర్ రాగానే జనం చేతులు ఊపుతూ స్వాగతం పలికారు. ఆయన ప్రతిపక్షాల తీరును ఎండగడుతున్నప్పుడు విశేష స్పందన వచ్చింది. పదేళ్లలో ప్రభుత్వం చేపట్టిన ప్రగతిని వివరిస్తున్నప్పుడు జనం చప్పట్లతో మారుమోగించారు. పార్టీ శ్రేణులు జెండాలు చేతపట్టుకొని నృత్యం చేస్తూ ఉత్సాహ పరిచారు. తెలంగాణ కళాకారులు ఆటా పాటలతో హోరెత్తించారు. జన ప్రభంజనాన్ని చూసి బీఆర్ఎస్ అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్ గెలుపు ఖాయమనే అభిప్రాయం వ్యక్తమైంది. సీఎం సభను విజయవంతం చేసిన నియోజకవర్గ ప్రజలకు బీఆర్ఎస్ నేత బక్కశెట్టి కిశోర్, మండలాధ్యక్షుడు రాజగంగన్న కృతజ్ఞతలు తెలిపారు.
– ఖానాపూర్, నవంబర్ 26
గతంలో ఎవ్వరు కూడా గిరిజన బిడ్డల తండ్లాటలు తీర్చలేదని సీఎం కేసీఆర్ అన్నారు. మా తండాలో మా రాజ్యం అని, గోండు గూడేలకు పోతే మావా నాటే, మావ రాజ్ అని 50 ఏండ్లు కొట్లాడినా ఒక్క ముఖ్యమంత్రి, ఒక్క ప్రభుత్వం కూడా పట్టించుకోలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రం మొత్తంలో 3,600 పైచిలుకు తండాలు, గూడేలను సెపరేట్ గ్రామ పంచాయతీలు చేసిందన్నారు. 3,600 నుంచి 4 వేల మంది ఎస్టీ బిడ్డలే బ్రహ్మాండంగా వాళ్ల గ్రామాలను వాళ్లు ఏలుతున్నర న్నారు.
పోడు పట్టాలు ఏ ప్రభుత్వం కూడా సమగ్రంగా ఇవ్వలేదన్నారు. మేము ఒక్క ఖానాపూర్ నియోజక వర్గంలో సుమారు 7,500 మందికి 22,470 ఎకరాల పోడు పట్టాలు పంపిణీ చేశామన్నారు. పోడు పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకోకుండా, అంతకుముందు వాటి మీద ఉన్న కేసులన్నీ రద్దు చేశామన్నారు. పట్టాలు ఇచ్చిన వెంటనే రైతుబంధు కూడా ఇచ్చామని, రైతుబీమా కూడా కల్పించామని చెప్పారు. అంతేకాకుండా వాళ్ల బావులు, బోర్లకు త్రీఫేజ్ కరెంట్ కూడా ఇస్తున్నామ న్నారు.
చాలా వరకు పనులు అయిపోయాయని, ఇంకా కొంత జరగాల్సి ఉందని, త్వరలోనే అవి కూడా అవుతాయని చెప్పారు. హైదరాబాద్‌లో బంజారా హిల్స్ ఉంటుందని, పేరుకే అది బంజారా కానీ అక్కడ ఎవరూ బంజారాలు లేరు, వాళ్లను తరిమేసిండ్రు అని కేసీఆర్ అన్నారు. అందుకే నేను పట్టుబట్టి అదే బంజారా హిల్స్‌లో సేవాలాల్ మహారాజ్ పేరిట రూ.కోట్లు ఖర్చు పెట్టి బ్రహ్మాండమైన మహల్ కట్టినమని, దాని పక్కనే ఆదివాసుల కోసం కుమ్ర భీం భవన్ కట్టినమని చెప్పారు. అన్ని వర్గాల ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం తాము పని చేస్తున్నామన్నారు.