నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్25(నమస్తే తెలంగాణ) సమైక్య పాలనలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అత్యంత వెనకబడ్డ నియోజకవర్గం మునుగోడు. తాగేందుకు మంచినీళ్లు లేక ఫ్లోరైడ్ భూతానికి చిక్కి కుప్పకూలింది. పంటల సాగుకు నీటి వనరుల్లేక భూమి బీడు పడింది. కంకర తేలి గుంతలమయంగా మారిన రోడ్లపై ప్రయాణం అంటే నరకం కనిపించేది. ఇక.. విద్య, వైద్యం అందని ద్రాక్షే. అలాంటి ఈ నియోజకవర్గం తెలంగాణ పోరాటంలో ఉద్యమ రథసారధి కేసీఆర్ వెంట నడిచి రాష్ట్ర సాధనలో తన వంతు ప్రత్యేక పాత్రను పోషించింది.
అందుకే స్వరాష్ట్రంలో మునుగోడును ముందడుగు వేయించేలా సీఎం కేసీఆర్ అత్యంత శ్రద్ధను కనబరుస్తున్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు రూ.4,500 కోట్లతో అన్ని రంగాల్లో అభివృద్ధికి బాటలు వేశారు. మిషన్ భగీరథ జలాలతో ఫ్లోరైడ్ రక్కసిని తరిమి కొట్టారు. శాశ్వత పరిష్కారం దిశగా డిండి ఎత్తిపోతల ద్వారా రిజర్వాయర్ల పనులు చేపట్టారు. రాష్ర్టానికి తలమానికంగా దండుమల్కాపూర్‌లో గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్క్‌ను ఏర్పాటు చేసి ఉపాధికి పెద్దపీట వేశారు. అన్ని రంగాల్లో వసతులు, సబ్బండ వర్గాలకు సంక్షేమ పథకాలు అందించి మునుగోడు నియోజకవర్గం రూపురేఖలు మార్చారు. ఏడాది కిందట ఇక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు అందుకే మళ్లీ బీఆర్ఎస్ను గెలిపించుకున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్కు జైకొట్టేందుకు సిద్ధంగా ఉన్నారనడంలో సందేహమే లేదు.
అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ : ఎమ్మెల్యే కూసుకుంట్ల
మునుగోడు అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ఉన్నారు. ఇప్పటికే చండూర్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతోపాటు చౌటుప్పల్‌లో 100 పడకల ఆస్పత్రి నిర్మాణంలో ఉన్నది. అంతర్గత రోడ్లు, బీటీ రోడ్ల నిర్మాణాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మౌలిక వసతలు కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాం. చేనేత పరిశ్రమకు అండగా నిలిచాం. విద్యా, వైద్య పరంగానూ మెరుగైన వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నాం. దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో మునుగోడును పట్టి పీడించిన ఫ్లోరైడ్‌ను పారదోలిన ఘనత కేసీఆర్‌దే. ఉప ఎన్నికల్లో గెలిపించినందుకు మునుగోడు ప్రజలు జరుగుతున్న అభివృద్ధితో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమంటూ విశ్వసిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక మునుగోడు గోడును తీర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. నేడు తలపెట్టిన ప్రజా ఆశీర్వాద సభకు ప్రజల నుంచి అనూహ్య స్పందన కనిపిస్తున్నది. వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే మిగిలి ఉన్న అన్ని సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత నాదే. సభకు ప్రజలంతా పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలి.
చేనేత పరిశ్రమకు మునుగోడు నిలయం కాగా అందుకు అనుగుణంగా హ్యాండ్లూమ్ క్లస్టర్ల ఏర్పాటుపై మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. నారాయణపురం, గట్టుప్పల్, తెరట్పల్లిల్లో చేనేత క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి వెంటనే నిధులు మంజూరు చేశారు. గట్టుప్పల్‌లో రూ.2.37కోట్లతో, తెరట్‌పల్లిలో రూ.76లక్షలతో, నారాయణపురంలో రూ.73లక్షలతో క్లస్టర్లకు తొలి విడుతగా 60శాతం నిధులు విడుదల చేశారు. దాంతో మగ్గాల కొనుగోళ్లు, ఆసు యంత్రాలకు ఆర్డర్లు, ఇతర సామగ్రి సమకూర్చుకోవడంపై దృష్టి పెట్టారు. త్వరలోనే ఇవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి.
రూ.600 కోట్లతో ఉప ఎన్నికల హామీల అమలు
మునుగోడు నియోజకవర్గ రూపురేఖలు మారుస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు ఒక్కొక్కటిగా ఆచరణరూపం దాలుస్తున్నాయి. ఏడాదిలోగానే ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ అన్నీ కార్యరూపంలోకి తెచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే నవంబర్‌లో 6న ఎన్నికల ఫలితాలు వెలువడితే డిసెంబర్1న మంత్రి కేటీఆర్ స్వయంగా మునుగోడు వచ్చి సమీక్ష చేశారు. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి మునుగోడు అబివృద్ధిపై రోడ్‌మ్యాప్‌ను మంత్రి కేటీఆర్ ప్రకటించారు. దాని ప్రకారమే అన్ని పనులు కార్యరూపం దాల్చాయి. ఉప ఎన్నికల్లో కీలకమైన డిమాండ్‌గా ఉన్న చండూర్ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేశారు.
ఇప్పటికే ఉప ఎన్నికల సమయంలోనే గట్టుప్పల్‌ను నూతన మండలంగా ఏర్పాటు చేశారు. ఉప ఎన్నికల హామీ మేరకు చౌటుప్పల్ కేంద్రంగా 100 పడకల ఆస్పత్రిని మంజూరు చేశారు. రూ.38కోట్లతో మంత్రులు హారీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి శంకుస్థాపన చేయగా నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఇదే సమయంలో ఈ ఏడాది జనవరి 3న చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఐదు యూనిట్లతో డయాలసిస్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. మర్రిగూడలో 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నూతన భవనాన్ని ప్రారంభించారు. సంస్థాన్ నారాయణపురం కేంద్రంగా ఎస్టీ గురుకుల పాఠశాలతోపాటు బంజారార భవన్ ఏర్పాటు చేస్తామన్న హామీని నెరవేర్చారు.
సమైక్య పాలనలో మునుగోడు దుస్థితిని స్వయంగా చూసి చలించిపోయిన కేసీఆర్ స్వరాష్ట్రంలో ఏం చేస్తానో ఆనాడే చెప్పారు. 60 ఏండ్లల్లో ఫ్లోరైడ్‌ను పెంచి పోషించిన కాంగ్రెస్, బీజేపీ పాలకులకు చెంపచెల్లు మనిపించేలా ఆరేండ్లల్లోనే ఫ్లోరైడ్ రక్కసిపై పైచేయి సాధించారు. ఇక్కడే శ్రీకారం చుట్టిన మిషన్ భగీరథతో కొత్తగా ఒక్క ఫ్లోరైడ్ కేసు నమోదు కాలేదని పార్లమెంట్ సాక్షిగా కేంద్రమే ప్రకటించింది. ఇక దీనికి తోడు శాశ్వత నివారణ చర్యల్లో డిండి ఎత్తిపోతల పథకం ద్వారా మునుగోడు నియోజకవర్గంలోని 2.55లక్షల ఎకరాలకు సాగునీరు అందేలా చర్లగూడెం, లక్ష్మాణాపురం రిజర్వాయర్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇక రహదారులు, గ్రామాల్లో మౌలిక వసతులు ఇలా అనేక రంగాల్లో మునుగోడు ప్రగతిపథంలో సాగుతున్నది. అందుకే బీఆర్ఎస్నే మునుగోడుకు మేలిమలుపని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందే క్షేత్రస్థాయిలో ఉప ఎన్నికల్లో ప్రజలు తమ మనోగతాన్ని స్పష్టం చేశారు. 2018లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చెప్పిన పెద్దపెద్ద డైలాగుల మాయలో పడి బీఆర్ఎస్ను దూరం చేసుకున్న ప్రజలు సైతం వెంటనే తిరిగి ఆలోచనలో పడ్డారు. మునుగోడు అభివృద్ధికి రాజగోపాల్‌రెడ్డి ఆటంకంగా ఉన్నాడని భావిస్తూ ఉప ఎన్నిక రూపంలో అందివచ్చిన అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకుని తిరిగి అభివృద్ధికి దారులు వేసుకున్నారు. దీంతో ఉప ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన ప్రతి హామీ అమల్లోకి వచ్చింది. 2014 నుంచి 2018 సెప్టెంబర్ వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి రూ.3,545 కోట్లతో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. తిరిగి ఉప ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఏడాది కాలంలోనే సుమారు రూ.600 కోట్లతో పనులకు శ్రీకారం చుట్టారు.
అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, బీటీ రోడ్ల నిర్మాణం లాంటి మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక శ్రద్ధతో వందల కోట్లరూపాయలను వెచ్చిస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా రూ.105 కోట్లతో 50కి పైగా మట్టి రోడ్లను బీటీ రోడ్లుగా మారుస్తున్నారు. ఇందులో ఇప్పటికే చాలా వరకు పనులు ప్రారంభమయ్యాయి. ట్రైబల్ వెల్ఫేర్ ఫండ్ నుంచి మరో రూ.25కోట్లతో గిరిజన ప్రాంతాల్లో బీటీ రోడ్లను నిర్మిస్తున్నారు. ఉపాధి హామీ నిధులు రూ.35కోట్లతో గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తైంది. మరో రూ.50కోట్లతో ఆర్అండ్బీ రహదారుల నిర్మాణం జరుగుతున్నది.
స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కార్ చేసిన అభివృద్ధిపై మునుగోడు ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతున్నది. 2104 కంటే ముందు నియోజకవర్గ పరిస్థితిని, నేటి పరిస్థితులను బేరీజు వేసుకుంటూ బీఆర్ఎస్ వైపునకు జనం మొగ్గుచూపుతున్నారు. బీఆర్ఎస్తోనే స్థిరమైన అభివృద్ధి సాధ్యమన్న చర్చ సర్వత్రా సాగుతున్నది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ను గెలిపించేందుకు ఇక్కడి ప్రజలు ఇప్పటికే మానసికంగా సిద్ధమయ్యారు. మునుగోడు ప్రజా ఆశీర్వాద సభ వేదిక మీదుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమకు తిరుగులేదని చాటిచెప్పేందుకు సిద్ధమయ్యారు.