సంక్షేమ పథకాలైన రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంటు వంటివి కొనసాగాలంటే బీఆర్ఎస్ గెలవాలని.. మా అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయ దుందుభి మోగించాలని గులాబీ బాస్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఉద్ఘాటించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాలు.. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గంలో బుధవారం బీఆర్ఎస్ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన ‘ప్రజా ఆశీర్వాద సభ’ల్లో కేసీఆర్ ప్రసంగించారు. గిరిజనేతరులు, సింగరేణి, ప్రభుత్వ భూముల్లో ఇండ్లు కట్టుకున్నవారికి పట్టాలిచ్చే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు. అమ్ముడు పోయినోడు తలమాసినోడే.. కానీ మనం కాదు.. అని పేర్కొన్నారు. హస్తం పార్టీకి ఓటేస్తే దళారుల రాజ్యం వస్తది.. ధరణి బంగాళాఖాతంలో కలుస్తదని సూచించా రు. ఆషామాషీగా ఓటేస్తే ఆగమైతం.. ఆలోచించి వేస్తే న్యాయం జరుగుతదని తెలిపారు. కష్టపడి కాగజ్‌నగర్‌లో ఎస్పీఎంను తెరిపించినం.. సర్‌సిల్క్ మిల్లును కూడా తెరిపిస్తామని మాటిచ్చారు. కచ్చితంగా గెలిచే నాయకులు కోనేరు కోనప్ప, కోవ లక్ష్మి, దుర్గం చిన్నయ్య అని, వీరికి భారీ మెజార్టీ ఇవ్వాలని కోరారు.
ఆసిఫాబాద్ ప్రాంతంలోని కుమ్రం భీం ప్రాజెక్టు కాలువకు అటవీ అనుమతులు ఇప్పించాలి. ప్రాజెక్టు మరమ్మతుల కోసం రూ. 50 కోట్లు మంజూరు చేయాలి. వట్టివాగు ప్రాజెక్టు కింద కాలువల నిర్మాణం చేపట్టాలి. ఆసిఫాబాద్ మండలంలోని గుండి వాగుపై బ్రిడ్జి ఎత్తు, పొడువు పనులు త్వరగా పూర్తి చేయించాలి. కెరమెరి మండలం లక్మపూర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి.
– కోవ లక్ష్మి, ఆసిఫాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి
కాగజ్‌నగర్ నియోజకవర్గంలో రెసిడెన్షియల్ పాఠశాలలను కళాశాలలుగా మార్చాం. ఆ కళాశాలల్లోనే డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలి. ఇప్పటికే 3 వేల గృహలక్ష్మి ఇండ్లు ఇచ్చారు.. మరిన్ని మంజూరు చేయాలి. అసంపూర్తిగా ఉన్న కుమ్రం భీం, జగన్నాథ్‌పూర్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి.
– కోనేరు కోనప్ప, సిర్పూర్ బీఆర్ఎస్ అభ్యర్థి
బెల్లంపల్లి ప్రజలకు గోదావరి నీటిని అందించాలి. బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలోని 12 ఎకరాల్లో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలి. గిరిజనులకు గురుకుల పాఠశాల మంజూరు చేయాలి. తాండూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలి. మరికొంత మందికి పోడు పట్టాలు పంపిణీ చేయాలి. కాసిపేట, నెన్నెల, వేమనపల్లి మండలాల్లో ప్రాజెక్టుల కింద కాలువలు నిర్మించాలి.
– దుర్గం చిన్నయ్య, బెల్లంపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి
మంచిర్యాల ప్రతినిధి/కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ 8(నమస్తే తెలంగాణ) ః అటు తెలంగాణలో గానీ, ఇటు నియోజకవర్గాల్లో గానీ రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్ లాంటి సంక్షేమ పథకాలు కొనసాగాలంటే బీఆర్ఎస్ గెలవాలని, మా అభ్యర్థులను గెలిపించాలని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాలు.. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గంలో బుధవారం బీఆర్ఎస్ అభ్యర్థులు కోనేరు కోనప్ప, కోవ లక్ష్మి, దుర్గం చిన్నయ్యల విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన ‘ప్రజా ఆశీర్వాద సభ’ల్లో కేసీఆర్ ప్రసంగించారు. గిరిజనేతరులకు పట్టాలు ఇవ్వడంతోపాటు సింగరేణి స్థలాలు, ప్రభుత్వ భూముల్లో ఇండ్లు కట్టుకున్న వారికి పట్టాలు ఇచ్చే బాధ్యత నాది అన్నారు.
ఆరె కులస్తులను ఓబీసీలుగా, మాలీ కులస్తులను ఎస్టీలుగా గుర్తించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణ రాక ముందు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో మంచం పట్టిన మన్యం అని వార్తలు వచ్చేవని, ఈ రోజు ఆ బాధలు పోయాయన్నారు. మారుమూల ప్రాంతాలకు వాగులు, వంకలపై వందల బ్రిడ్జిలు నిర్మించుకున్నామని, మరిన్ని నిర్మించుకుందామని చెప్పారు. గిరిజనులను, నిరుపేదలను బాగు చేసుకున్నామన్నారు. ఇవన్నీ ఇలాగే ఉండాంటే ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉండే మా అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఓటేసే ముందు ఆలోచించి ప్రజా ఆంకాక్షలను నెరవేర్చే నాయకులను, ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.
బెల్లంపల్లి చాలా చైతన్యమైన ప్రాంతమని, ఇక్కడ ఉద్యమాలు కూడా జరిగాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మంచి వాడైన దుర్గం చిన్నయ్యను గెలిపిస్తే, మంచి ప్రభుత్వం వస్తదని, మంచి పనులు జరుగుతాయని, ప్రజా బాహుళ్యానికి మేలు జరుగుతుందని చెప్పారు. అలా కాకుండా ఎవరో చెప్పారని, వేసే వాళ్లకు ఓటు వేయకుండా వేరే వాళ్లకు వేస్తే ‘మంది మాటలు పట్టుకొని మార్వానం పోతే, మళ్ల వచ్చే సరికి ఇండ్లు కాలినట్లు అవుతుంది’ అన్నారు. అలా జరగనివొద్దన్నారు. రైతుబంధు ఉండాలంటే దుర్గం చిన్నయ్య గెలవాలన్నారు. ఎవడో ఎన్నికల ముందు నోట్ల కట్టలు, సూట్ కేసులు పట్టుకొని వచ్చేటోడు కావాలా.. పొద్దాక జనంలో ఉండే దుర్గం చిన్నయ్య లాంటోడు కావాలా ఆలోచించాలన్నారు. చిన్నయ్య గెలిస్తే రైతుబంధు ఉండుడు కాదు రూ.10 వేలు ఉన్నది రూ.16 వేలు వస్తుందన్నారు.
అలాగే రైతులకు 24 గంటల కరెంట్ ఉండాలన్న అది చిన్నయ్య ఉంటేనే సాధ్యం అవుతుందన్నారు. బెల్లంపల్లిలో గవర్నమెంట్ భూములు, సింగరేణి భూములు కలిపి దాదాపు 10 వేల మందికి ఇండ్ల పట్టాలు ఇచ్చామని దుర్గం చిన్నయ్య చెప్పారని, ఇంకా కొంత మంది ఉన్నారన్నారని తప్పకుండా వాళ్లందరికీ కూడా పట్టాలు ఇప్పించే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు. ఎవరున్న మీ ఎమ్మెల్యేకు దరఖాస్తు పెట్టుకోండి చేస్తామని చెప్పారు. బెల్లంపల్లిలో వైద్య వ్యవస్థ మెరుగు పడిందన్నారు. వంద పడకల ఆసుపత్రి పెట్టుకున్నామని, దాన్ని ఇంకా కూడా పెంచుకుంటామన్నారు. అదే విధంగా రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టామని, దానిలో చదువుకున్న అందరూ బతుకుతున్నారన్నారు. ఈ రకంగా విద్యారంగంలో కూడా మనం ముందుకు పోతున్నామన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే చాలా వాగులపై చెక్ డ్యామ్‌లు కట్టుకున్నామని, చెరువులు బాగు చేసుకున్నామని చెప్పారు. ఇంకా కొన్ని మారుమాల ప్రాంతాలకు బ్రిడ్జిలు కావాలని అడిగారని, తప్పకుండా ఇంకా కూడా చేస్తామని సీఎం అన్నారు.
ఇవాళ డబ్బు కట్టలు పట్టుకొని దిగేటోళ్లు, మళ్ల ఎలక్షన్లు అయిపోతే ఎన్నడన్న కనబడుతరా ఆలోచించాలన్నారు. ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ మనిషిని చెన్నూరోళ్లు నాలుగు మాట్ల ఓడగొట్టారన్నారు. మరి చెన్నూర్‌లో చెల్లని రూపాయి.. బెల్లంపల్లిలో చెల్లుతదా.. చెన్నూర్‌లోనే చెల్లకపాయే.. వాళ్లే తీసికొట్టిరి.. మరి బెల్లంపల్లి వాళ్లం ఏమైనా తెలివి తక్కువోళ్లమా.. చెన్నూర్ కంటే తెలిసి కల్లోల్లమే క దా.. అది రుజువు చేయాలని పిలుపునిచ్చారు. ఆడ చెల్లని రూపాయి ఈడ ఎట్లా చెల్లుతదని, వాళ్లు తిరస్కరించాక, మనం ఎట్టా గెలిపిస్తామన్నారు. ఎన్నికలు రాగానే సూట్‌కేస్‌లు, డబ్బుల సంచులు పట్టుకోవాలే దిగాలే.. వాన్ని కొని, వీన్ని కొని గోల్మాల్ చేయాలే తప్ప ఎలక్షన్లు అయ్యాక కడుపు నొచ్చినా, కాలు నొచ్చినా కనబడుతరా.. ఆలోచన చేయాలన్నారు. మంచిగున్న ప్రజాప్రతినిధులను కొందర్ని కొంటున్నరని పాపం అమాయకులు గొర్రెల్లా అ మ్ముడు పోతున్నారన్నారు.
చిన్నయ్య నువ్వేం ఫికర్ చేయకు.. అమ్ముడు పోయినోడు ఒకడే పోతడు గడ్డ పార లెక్క.. కానీ ఇవాళ ప్రజల్లో చైతన్యం ఉంది, ఎవడో అమ్ముడు పోయిండని నువ్వు బయపడకు. ప్రజలు నీ పక్షాన గ్యారంటీగా ఉంటరు. వాళ్లే న్యాయం చెప్తారన్నారు. ఎవరో నలుగురు అమ్ముడు పోయినోళ్లు తలమాసినోల్లే కానీ మనం కాదు.. జనం కాదు అన్నారు. ఈ ప్రజలే మనల్ని కాపాడుతారని, ప్రజల ఆశీర్వాదమే మనకు శ్రీరామ రక్ష అని చెప్పారు. ఇవాళ డబ్బు సంచులు పట్టుకొని దిగి.. నాలుగు రోజులు ఏదో తమాషా చేసి ఎలక్షన్ అవ్వగానే వాడు అటు, మనం ఇటు అనే వాళ్లు కావాల్నా.. లేకపోతే పొద్దాకా బెల్లంపల్లిలో ఉండే చిన్నయ్య కావాలా ప్రజలే నిర్ణయం తీసుకోవాలన్నారు. మీ దివెన ఉంటే తెలంగాణను ఈ దేశంలోనే నంబర్ స్టేట్‌గా తీసుకుపోతామన్నారు. దుర్గం చిన్నయ్య సమంజసమైన నాలుగైదు కోరికలు కోరారని, ఒక ఇంజినీరింగ్ కాలేజీ కావాలన్నడు, ఒక రెసిడెన్షియల్ స్కూలు కావాలన్నడు.. వంద శాతం వాటిని చేసి పెట్టే బాధ్యత నాది అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
మీరు చిన్నయ్యను పెద్ద మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు, ఎంపీ వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్సీ దండే విఠల్, మాజీ మంత్రి బోడ జనార్దన్, మాజీ ఎమ్మెల్సీ వెంకట్రావ్, మాజీ ఎమ్మెల్యే అరవిందరెడ్డి, టీబీజీకేఎస్ నాయకులు మిర్యాల రాజిరెడ్డి, కెంగర్ల మల్లయ్య, మాజీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రాంమోహన్‌రావు పాల్గొన్నారు.
సింగరేణిలో ఇల్లందు తరువాత రెండో గని ప్రారంభించిన ప్రాంతం బెల్లంపల్లి అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. 134 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ సింగరేణిని ముంచింది కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. ఈ సంస్థ అచ్చం తెలంగాణదని, నిజాం రాజు ఉన్నప్పుడు పెట్టుకున్న కంపెనీ అని చెప్పారు. వంద శాతం తెలంగాణకు ఉన్న కంపెనీని ఆ నాడు ఉన్న కాంగ్రెస్ దద్దమ్మలు, కేంద్ర ప్రభుత్వ తొత్తుల దగ్గర అప్పులు తెచ్చి కట్టలేక వాళ్లకు 49 శాతం వాటా ఇచ్చారని, దానితో మన వాటా కోల్పోయామని మండిపడ్డారు. తెలంగాణ ఆస్తిని కేంద్రానికి కట్టబెట్టిన దద్దమ్మ పార్టీ కాంగ్రెస్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తరువాత వాళ్లు సింగరేణిని సరిగ్గా నడపలేక లాభాలు తేలేకపోయారన్నారు.
మూడు, నాలుగు వందల కోట్లే వచ్చేవన్నారు. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక రూ.2.200 కోట్లకు సింగరేణి ఆదాయం పోయిందన్నారు. దసరా, దీపావళి బోనస్ లాభాల్లో వాటా కలిసి ఈ సంవత్సరం రూ.1000 కోట్లు కార్మికులకు ఇస్తున్నామన్నారు. ప్రతి కార్మికుడికి ఇంచుమించు రూ.2.50 లక్షలు డబ్బులు చేతికి వస్తున్నాయన్నారు. ఇదే కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల అనుబంధ యూనియన్లే సంతకాలు పెట్టి డిపెండెంటు ఉద్యోగాలు ఊడగొట్టించారన్నారు. మళ్లీ తెలంగాణ పార్టీ వచ్చినంకనే వాటిని పునరుద్ధరించి డిపెండెంట్ ఉద్యోగాలు కల్పించుకున్నామని చెప్పారు. ఇవన్ని మీకు తెలుసుని, ఓటు వేసే ముందు అన్ని ఆలోచన చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు.