కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 1(నమస్తే తెలంగాణ) పపోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజన రైతుల గోస తీరింది. పట్టాలు ఇవ్వడంతో దశాబ్దాల కల నెరవేరింది. రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందనుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు త్రీఫేజ్ కరంటు ఇవ్వనుండడం, అడవిబిడ్డలపై ఉన్న కేసులు ఎత్తివేస్తామనే ప్రకటనతో గిరిజనుల్లో అంతుపట్టని ఆనందం నెలకొంది. కాగా.. కుమ్రం భీం ఆసిఫాబాద్ పర్యటనకు శుక్రవారం వచ్చిన సీఎం కేసీఆర్ 11 మంది గిరిజనులకు పట్టాలు అందించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 31,026 మంది రైతులకు 99,019 ఎకరాల భూమికి పట్టాలు అందించనున్నారు. ఇందుకోసం రూ.98.83 కోట్ల రైతుబంధు సాయం కూడా అందనుంది. కాగా.. ఆసిఫాబాద్ జిల్లాలో 11,753 మంది రైతులకు సంబంధించి 74,130 ఎకరాలకు రైతుబంధు(రూ.23.56 కోట్లు) చెక్కును శుక్రవారం స్టేజీపైనే ఆసిఫాబాద్ కలెక్టర్కు సీఎం కేసీఆర్ అందజేశారు. యేండ్ల కల నెరవేరడంతో అభినవ కుమ్రం భీంగా కేసీఆర్ను గిరిజనులు కీర్తిస్తున్నారు.
పోడు పట్టాలు అందుకున్న రైతులపై ఉన్న అటవీశాఖ కేసులన్నీ ఎత్తివేస్తున్నాం. పట్టాలిస్తూ.. మరోవైపు వారిపై అటవీశాఖ తరఫున కేసులు ఉండడం సరికాదు. త్వరగా అన్ని కేసులు కొట్టివేయాలని అధికారులను ఆదేశిస్తున్నా. దీనికోసం సీఎస్, అటవీ శాఖ అధికారులు కావాల్సిన చర్యలు తీసుకోవాలి. రెండు, మూడు నెలల్లో పోడు భూములకు త్రీఫేజ్ కరంటు ఇస్తాం. మీ చేలకు కరంటు లైన్ రావడం త్వరలోనే చూస్తరు. పోడు పట్టాలు పొందిన రైతులందరికీ రైతుబంధు కూడా అందిస్తాం.
‘పట్ట’రానంత సంతోషంగుంది..
మాది జోడేఘాట్ పంచాయతీ పరిధిలోని పాట్నాపూర్. 1.29 ఎకరాల భూముంది. నాకు తెలిసినప్పటి సంది మా తాత వ్యవసాయం చేస్తుండే. అదే భూమిని మా నాయిన, గిప్పుడు నేను దున్నుకొని బతుకుతున్నం. మా తాతను, నాయినను, గిప్పుడు నన్ను గూడ అటవీశాఖోళ్లు ఎవుసం జేయద్దని బెదిరించిండ్రు. మాపై కేసులు గూడ పెడుతమన్నరు. గత ప్రభుత్వాలల్ల పట్టా చేయుండ్రని ఆఫీసర్ల సుట్టూ తిరిగినం. కానీ.. పట్టా కాలే. కేసీఆర్ సారు సీఎం అయ్యాక మేము దున్నుకుంటున్న భూములకు పట్టాలిస్తామని జేప్పిండు. ఇగ మస్తు సంబుర పడ్డం. సారు జెప్పిన ఎంటనే ఆఫీసర్లు మా ఊళ్లకచ్చి ఎవరు ఎంత భూమి దున్నుకుంటున్నరో రాసుకపోయిండ్రు. సీఎం సారు స్వయంగా శుక్రారం నా భార్య అన్నిబాయి పేరు మీద పట్టా ఇచ్చిన్రు. పట్టారానంత సంతోషం అనిపించింది. పెట్టుబడికి రూ.2,400 రైతుబంధు డబ్బులు గూడ ఇస్తన్నరు. త్రీ ఫేజ్ కరంటు ఇస్తమన్నరు. కేసులు కూడా కొట్టివేస్తానని జెప్పిన్రు. ఇగ మాకు ఇంకేం కావాలి.
– ఆత్రం కట్టి-అన్నిబాయి దంపతులు, పాట్నాపూర్(జోడేగాట్ జీపీ)