జనం కోసం తపించే ఓ మహానేత తలపు తిరుగులేని సంకల్పమైంది. అపర భగీరథుడి కోరిక మన్నించి గోదావరి ఎదురు నడిచి వచ్చింది. అమాంతం ఎత్తుకు ఎగిసి నదిలేని చోట నడి సంద్రమై నిలిచింది. కొమురవెల్లి మల్లన్న పాదాల చెంత జన హృదయ సాగరమై.. జల చరిత్ర సాగరమై వెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అతి పెద్ద జలాశయమైన మల్లన్న సాగరం జాతికి అంకితమైంది. నేలలు నెర్రెలిచ్చి.. వలసలకు, ఆకలి చావులకు, ఆత్మహత్యలకు నిలయంగా మారిన ప్రాంతంలో గోస తీర్చేలా.. ముఖ్యమంత్రి కేసీఆర్ తాను స్వప్నించిన సుజల దృశ్యాన్ని నిజం చేసి బుధవారం ఆవిష్కరించారు. ఆ తర్వాత కొమురవెల్లి మల్లన్నకు గోదావరి జలాలతో అభిషేకం చేశారు. లక్షలాది గొంతుకల దాహం తీర్చేందుకు.. బీడుపడ్డ భూములను సస్యశ్యామలం చేసేందుకు.. పరవళ్లు తొక్కింది గోదారమ్మ. కాళేశ్వర ఎత్తిపోతల్లో నిర్మించిన కీలకమైన, ఆయువుపట్టులాంటి 50 టీఎంసీల మల్లన్నసాగర్ రిజర్వాయర్ ప్రారంభోత్సవం కనుల పండువగా సాగింది. సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ పంప్‌హౌస్ ఈ గొప్పకార్యానికి వేదికైంది.
-సిద్దిపేట, ఫిబ్రవరి 23(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఇది నడిగడ్డ ప్రాంతం. ఇక్కడ రిజర్వాయర్ వస్తే మొత్తం తెలంగాణ బాగు పడ్తదని మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ స్థలాన్ని ఎంపిక చేశారు. ఇంజినీర్లందరినీ కూర్చొబెట్టుకొని ఇంత అద్భుతంగా రూపకల్పన చేశారు. గుక్కెడు తాగునీళ్లు లేక, సాగు నీరు లేక వలసలు, ఆకలిచావులు, ఆత్మహత్యలు, అంబలి కేంద్రాలు, గంజికేంద్రాలకు నిలయంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో గోదారమ్మను తీసుకొచ్చి సస్యశ్యామలం చేసిన నాయకుడు మన కేసీఆర్ గారు. ఆయనకు మీ అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నది లేనటువంటి చోట భారత దేశంలో ఇంత పెద్ద రిజర్వాయర్ ఎక్కడైనా ఉందంటే…అది మల్లన్నసాగరే. సమైక్య రాష్ట్రంలో ఏ కాలం చూసినా ఎండాకాలంలా కనిపించేది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఏ కాలం చూసినా వానకాలంలా కనబడే మార్పు వచ్చింది. రాష్ట్రంలో ఏ మూలకు పోయినా మండుటెండల్లో కూడా చెరువులు మత్తళ్లు దుంకుతున్నయి. చెక్ డ్యాంలు అలుగులు దుంకి పారుతున్నయి.
– మంత్రి హరీశ్‌రావు
ఇది (మల్లన్నసాగర్) తెలంగాణ జన హృదయ సాగరం. తెలంగాణ జల చరిత్ర సాగరం. తెలంగాణ మొత్తాన్ని జలంతో అభిషేకించే సాగరం. కేవలం సిద్దిపేట జిల్లాకే కాదు… హైదరాబాద్ మహా నగరానికి కూడా శాశ్వతంగా మంచినీటి గోసను తీర్చే జల భాండాగారం. 20 లక్షల ఎకరాలను కడుపులో పెట్టుకొని కాపాడుకునే ప్రాజెక్టు ఇది.
ఎంతో మనసు పెట్టి ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎంత మంది దుర్మార్గులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెరవ కుండా ముందుకు పోయినం. అనేక విధాలుగా బద్నాం చేసిండ్రు. అయినా కూడా చాలా నిబద్ధతతో, క్రమశిక్షణతో..కడుపు, నోరు కట్టుకొని పూర్తి అవినీతి రహితంగా వ్యవహరించాం. రెడ్ టేపిజాన్ని, అడ్మినిస్ట్రేటివ్ డిలేస్ను అధిగమిస్తూ ముందుకు సాగితే మల్లన్నసాగర్ సాధ్యమైంది.
అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగర్ రిజర్వాయర్, మల్లన్నసాగర్ రిజర్వాయర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్, బస్వాపూర్ రిజర్వాయర్, ఏడుపాయల వనదుర్గ మాత వద్ద పర్యాటకం అభివృద్ధి చెందేలా 1500 కోట్లు మంజూరు చేస్తున్నాం. బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు ఇక్కడ షూటింగ్ జరుపుకునే స్థాయిలో తీర్చిదిద్దుదాం. వివాహ వేడుకలకు, సినిమా షూటింగ్‌లకు, టూరిస్టులకు ఆకర్షణగా మారనుంది. దుబాయిలో ఉన్న బుర్జ్ ఖలీఫాను మించి మల్లన్నసాగర్ వద్ద కలర్ ఫౌంటేన్లు రావాలి. సింగపూర్ నుంచి ఇక్కడికి టూరిస్టులు వచ్చేలా తయారు చేసుకుందాం.
మల్లన్నసాగర్ జలాశయాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, మల్లారెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, ఫారూఖ్ హుస్సేన్, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్‌రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రఘునందన్‌రావు, మదన్ రెడ్డి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్
విడుదలైన జలాలను చూసి సంబురపడుతున్న రైతులు, సెల్ఫీ తీసుకుంటున్న ఓ కుటుంబం
కొమరవెల్లి మల్లన్నకు అభిషేకం చేసేందుకు ఆలయానికి గోదావరి జలాలను కలశంలో తీసుకొస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్