జైనథ్, జూలై 4 : జిల్లాలో భోరజ్, సాత్నాల మండలాల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ప్రకటించడంతో అంతటా హర్షం వ్యక్తమవుతున్నది. జైనథ్ మండలం విస్తీర్ణంలో విశాలంగా ఉన్నది. గతంలో 29 గ్రామ పంచాయతీలతో ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద మండలంగా నిలిచింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 13 కొత్త జీపీల ఏర్పాటు చేయడంతో ఈ మండలంలోని పంచాయతీల సంఖ్య 42కు చేరింది. మొత్తంగా 56 గ్రామాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పరిపాలన సౌలభ్యం కోసం భోరజ్, సాత్నాల ప్రత్యేక మండలాలుగా ఏర్పాటు చేయాలని స్థానిక నాయకులు, ఎమ్మెల్యే జోగు రామన్న ప్రభుత్వానికి విన్నవించారు. నాలుగేళ్ల క్రితం ఈ ప్రతిపాదనలు కూడా పంపించారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే జోగు రామన్న, మాజీఎంపీ నగేశ్ జూన్ 30వ తేదీన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్‌ను కలిసి మండలాల ఏర్పాటుపై నివేదించారు. దీనికి సీఎం కేసీఆర్ స్పందించడంతో రెండు మండలాల నాయకులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
భోరజ్ మండలంలో వచ్చే గ్రామాలు ..
గూడ, రాంపూర్, సిర్సన్న, గిమ్మ, ఆకోలి, కోరట, మాండగడ, కామాయి, పిప్పర్వాడ, పూసాయి, తరోడ(బీ), హసీంపూర్, బాలాపూర్, ఆకూర్ల, సావాపూర్, లేఖర్వాడ, పెండల్వాడ, సాంగ్వీ మొత్తం 19 గ్రామ పంచాయతీలతో భోరజ్ కేంద్రంగా మండలం ఏర్పడుతున్నది.
సాత్నాల మండలంలో వచ్చే గ్రామాలు..
సాత్నాల , పార్డి(కే), పార్డి(బీ), మేడిగూడ (సీ), మేడిగూడ (ఆర్), సుందరగిరి, మాంగూర్ల, జామిని, మారుగూడతో పాటు బేల మండలంలోని సైద్పూర్, సాంగ్వీ, డౌనా, పాటాగూడ, ఖారా, దుబ్బగూడ, మసాలా(కే), ఆదిలాబాద్ మండలంలోని రామాయి, రాంపూర్, శివఘాట్, జంబుల్‌ధరి, తిప్ప, పోచంలొద్ది మొత్తం 22 గ్రామ పంచాయతీలతో సాత్నాల మండలం ఏర్పడుతున్నది.
దూరభారం తగ్గుతుంది
సాత్నాల మండలం ఏర్పాటుతో దూరభారం తగ్గుతుంది. సాత్నాల పరిసర ప్రాంతాల్లో అధికంగా ఉండే గిరిజనులకు జైనథ్ మండల కేంద్రానికి రావడానికి నానాకష్టాలు పడేవారు. జైనథ్‌కు వెళ్లాలంటే ముందుగా ఆదిలాబాద్ వచ్చి అక్కడి నుంచి రావాలి. గిరిజనుల చెంతనే నూతన మండలం ఏర్పాటు చేయించిన ఎమ్మెల్యే జోగు రామన్నకు కృతజ్ఞతలు .
– పెందూర్ దేవన్న, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు, జైనథ్
పరిపాలనా సౌలభ్యం అవుతుంది
జైనథ్ మండలం విస్తీర్ణంలో జిల్లాలోనే అతిపెద్దది. భోరజ్ మండలం ఏర్పాటు కానుండడంతో జాతీయ రహదారి 44 గుండా ఉన్న గ్రామాల ప్రజలకు ప్రభుత్వ పరంగా పరిపాలన సౌలభ్యంగా ఉంటుంది. దూరభారంతో పాటు ప్రభుత్వ కార్యకలాపాలు ప్రజలకు చేరువ అవుతాయి. ఈ ప్రాంత ప్రజల కోరిక తీర్చిన సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే జోగు రామన్నకు ప్రత్యేక ధన్యవాదాలు .
– మద్దుల ఊశన్న, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు, జైనథ్