పెంచికల్పేట్, ఫిబ్రవరి 11 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండల కేంద్రంలోని కాగజ్నగర్-పెంచికల్పేట్ ప్రధాన రహదారి సమీపంలోని హనుమాన్ విగ్రహం వెనుకాల గల ఖాళీ స్థలం విషయమై గ్రామస్తులు-ఫారెస్ట్ అధికారుల మధ్య వివాదం నెలకొంది. కొన్నేళ్లక్రితం రెవెన్యూ శాఖ వదిలేసిన స్థలాన్ని శ్మశానవాటిక కోసం గ్రామస్తులు ఉపయోగిస్తున్నారు. శనివారం ఇదే స్థలంలో క్వార్టర్స్ నిర్మాణం కోసమని ఫారెస్ట్ అధికారులు పిల్లర్స్ గుంతలు తవ్వించగా, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆదివారం ఉదయం సుమారు వందమంది అక్కడికి చేరుకొని గుంతలను పూడ్చి వేస్తుండగా, ఫారెస్ట్ అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. దశాబ్దాలుగా ఈ స్థలాన్ని శ్మశాన వాటిక కోసం వినియోగిస్తున్నామని, ఇప్పుడొచ్చి మా స్థలం అని ఫారెస్ట్ అధికారులు అడ్డగించడం సరికాదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. 15 రోజుల క్రితం ఫారెస్ట్, రెవెన్యూ జాయింట్ సర్వే నిర్వహించినప్పటికీ సమస్యకు పరిష్కారం చూపలేదన్నారు. గ్రామస్తులంతా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా గుంతలను పూడ్చివేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఇక్కడ క్వార్టర్స్ నిర్మాణం చేపడుతున్నామని ఇన్చార్జి ఎఫ్ఆర్వో సుధాకర్ తెలిపారు.