తాండూర్ : కేంద్రంలోని మోదీ ( Narendra Modi ) ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేసేలా నాలుగు లేబర్ కోడ్స్ చట్టాన్ని అమలుచేస్తుందని సీఐటీయూ ( CITU ) మంచిర్యాల జిల్లా సహాయ కార్యదర్శి దాగాం రాజారాం ఆరోపించారు. లేబర్ కోడ్స్( Labor Codes ) కు వ్యతిరేకంగా సీఐటీయూ ఆధ్వర్యంలో శనివారం తాండూర్ మండల కేంద్రం ఐబీ జాతీయ రహదారిపై కార్మికులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా రాజారాం మాట్లాడుతూ కార్మిక సంఘాలు, ప్రతిపక్షాల అభ్యంతరాలను భేఖాతరు చేస్తుందని విమర్శించారు. కార్మికులు అనేక త్యాగాలు, ఆందోళనాలు, పోరాటాల ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాలను కాలగర్భంలో కలిసివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లుగా చట్టాలను నిర్వీర్యం చేయాలని చూస్తున్న మోదీ ప్రభుత్వం కార్మికుల ఆందోళనలకు భయపడుతూ వెనకడుగు వేస్తువచ్చిందని ఆరోపించారు.
బిహార్లో ఎన్డీయే కూటమికి మెజార్టీ రావడంతో కేంద్రంలో కార్పొరేట్ అనుకూల విధానాల అమలు వేగవంతమైందని దుయ్యబట్టారు. దానిలో భాగంగానే 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్ లను అమల్లోకి తెచ్చిందని విమర్శించారు. ఈ సందర్భంగా పోలీసులు జోక్యం చేసుకుని సీఐటీయూ నాయకులను అదుపులోకి తీసుకున్నారు.
కార్యక్రమంలో సీఐటీయూ లీలారాణి, విజయలక్ష్మి, విజయలక్ష్మి, లక్ష్మి, ఉరడీ సరిత, సీహెచ్ రవీందర్, రాజా, కొండు వెంకటరమణారావు, ధరణి బుచ్చయ్య, పూర్ర లింగయ్య, వడ్నాల చందు, మేడి ఎల్లయ్య, దుర్గం నానయ్య, వేల్పుల శంకర్, చదువుల వెంకటేశం, కార్మికులు పాల్గొన్నారు.