తిరువనంతపురం: కేరళకు చెందిన ఉషా జోసెఫ్ అనే మహిళ అయిదేళ్లుగా కడుపు నొప్పితో బాధపడుతున్నది. అయితే ఆమె కడుపులో కత్తెర(Surgical Scissor) ఉన్నట్లు గుర్తించారు. 2021లో అలప్పుజాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఆమెకు సర్జరీ జరిగింది. ఆ శస్త్రచికిత్స సమయంలో డాక్టర్లు ఆమె కడుపులో ఫోర్సెప్స్ వదిలేశారు. గర్భాశయ వ్యాధికి చికిత్సలో భాగంగా సర్జరీ చేశారు. అయితే ఆ సమయంలో ఆమె కడుపులో కత్తెరను వదిలేశారు. దీంతో అనేక సార్లు ఆమె మళ్లీ ఆస్పత్రికి వెళ్లారు. కానీ ఆ ప్రభుత్వ డాక్టర్లు ఆమెను పట్టించుకోలేదు. దీంతో ఆ మహిళ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లారు. కడుపు ఎక్స్‌రేలో ఫోర్సెప్స్ ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం కేరళలో ఈ ఘటన తీవ్ర వివాదం రేపింది.
ఈ ఘటన పట్ల కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ స్పందించారు. కడుపులో కత్తెర వదిలేసిన అంశంపై దర్యాప్తు చేపట్టనున్నట్లు ఆమె పేర్కొన్నది. సర్జరీ చేసిన ఆ వైద్యులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. యుటరైన్ ఫిబ్రాయిడ్ను తొలగించేందుకు ఆ మహిళకు డాక్టర్ లలితాంబిక సర్జరీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదు నేపథ్యంలో వైద్యశాఖ ఓ మెడికల్ బోర్డును ఏర్పాటు చేసింది. కొచ్చిలోని అమృత ప్రైవేటు ఆస్పత్రిలో ఇవాళ ఉషకు చికిత్స చేయనున్నారు. సర్జరీ ద్వారా కడుపులోని కత్తెరను తొలగించనున్నారు.
ప్రస్తుతం డాక్టర్ లలితాంబిక సర్వీసు నుంచి రిటైర్ అయ్యారు. ఆ సర్జరీ తాను చేయలేదని ఆమె చెబుతున్నారు. తన రిటైర్మెంట్ సమీపిస్తున్న తరుణంలో ఉషా తమ ఆస్పత్రిలో చేరినట్లు చెప్పారు. ఫోర్సెప్స్ కడుపులో మరో 50 ఏళ్లు ఉన్నా ఆమె ఆరోగ్యానికి కీడు ఏమీ ఉండదని డాక్టర్ లలితాంబిక చెప్పారు. యురినరి స్టోన్ వల్ల ఉషకు బ్లీడింగ్ అయ్యిందని, కత్తెర వల్ల కాదు అని ఆ డాక్టర్ అన్నారు. డాక్టర్ వ్యాఖ్యలను మంత్రి వీణా జార్జ్ ఖండించారు. పేషెంట్ ఉష ఫ్యామిలీకి మంత్రి మద్దతు ఇచ్చారు.