Inter Exams | చెన్నూర్ టౌన్/వాంకిడి, మార్చి 4: పదో తరగతి, ఇంటర్ పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా రాయాలని చెన్నూర్ పట్టణ సీఐ రవీందర్ సూచించారు. చెన్నూరు పట్టణంలోని జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో సీఐ ఆధ్వర్యంలో విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించారు.
విద్యార్థులు ఒత్తిడిని జయించి సమర్థవంతంగా పరీక్షలు రాసేలా ప్రణాళికలను రూపొందించుకోవాలని సీఐ రవీందర్ సూచించారు. పరీక్షల సమయం దగ్గర పడుతున్నదని, ఆందోళన చెందకుండా చక్కగా ఏకాగ్రతతో చదువుపై దృష్టి సారించాలని తెలిపారు. విద్యార్థులపై తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పరీక్షలు రాసి ఉత్తమమైన ఫలితాలను పొందాలన్నారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరేలా విద్యార్థులకు పలు రకాల మార్గదర్శకం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వాంకిడి ప్రభుత్వ కళాశాల చీఫ్ సూపరిండెంట్ చంద్రయ్య తెలిపారు. మంగళవారం కళాశాలలో బెంచిలపై హాల్ టికెట్ నంబర్ వేసే ప్రక్రియను పరిశీలించారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి 400 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. పరీక్షలకు డిపార్ట్మెంట్ అధికారిగా అత్మారాం నియమితులైనట్లు తెలిపారు.