చెన్నూర్, జనవరి 14 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కారులో అప్పటి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రమైన చెన్నూర్ పట్టణం అభివృద్ధి పథంలో దూసుకెళ్లగా, నేడు కాంగ్రెస్ ప్రభుత్వ పుణ్యామాని అధోగతి పాలవుతున్నది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం గడప గడపకూ సంక్షేమ పథకాలు తీసుకెళ్లడంతో పాటు ప్రగతి పరుగులు పెట్టించి ఆదర్శంగా నిలుపగా, నేడు రేవంత్‌రెడ్డి పాలనలో పురోగతి లేక అధ్వానంగా మారింది.
పక్కదారి పట్టిన నిధులు
బీఆర్ఎస్ పాలనలో మౌలిక వసతుల కల్పన కోసం రూ.10 కోట్లతో అంతర్గత రోడ్లు, రూ. 90 లక్షలతో 18 వార్డుల్లో 18 బతుకమ్మ గ్రౌండ్లు, రూ.కోటితో వైకుంఠధామం, రూ.1.50కోట్లతో డంపింగ్ యార్డు, రూ.80లక్షలతో 4 కేసీఆర్ మల్టీపర్పస్ కమ్యూనిటీ భవనాలు, రూ.కోటితో మురుగు కాలువలు, రూ. కోటితో బృహత్ పట్టణ ప్రకృతి భవనం, రూ 2.58 కోట్లతో జంతు వధశాలకు నిధులు మంజూరు చేయించారు. కానీ, కాంగ్రెస్ పాలనలో ఆ నిధులన్నీ పక్కా దారి పట్టగా, ఇట్టి అభివృద్ధి పనులు ప్రారంభానికి నోచుకోలేదు.
కాంగ్రెస్ పాలనలో..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన పలు అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోగా, మరికొన్ని నత్తనడకన సాగుతున్నాయి. అంతేకాకుండా బీఆర్ఎస్ పాలనలో పలు అభివృద్ధి పనులు పూర్తయి, అప్పడే ప్రజలకు అందుబాటులోకి రాగా, ప్రస్తుతం వాటి నిర్వహణను పట్టించుకోవడం లేదు. బీఆర్ఎస్ హయాంలో పూర్తి చేసిన పనులను మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రారంభిస్తూ అభివృద్ధి అంతా తానే చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారని ప్రజలు నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండేళ్లు గడిచినప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైన పనులను పూర్తి చేయకపోగా, కొత్తగా పట్టణాభివృద్ధికి ఎలాంటి నిధులు తీసుకురాకపోవడంపై ప్రజల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతున్నది.
బీఆర్ఎస్ పాలనలో పండుగ వాతావరణం
బీఆర్ఎస్ పాలనలో పలు అభివృద్ధి పనులకు శం కుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, సంక్షేమ పథకాల పంపిణీ.. తదితర కార్యక్రమాలతో చెన్నూర్ పట్టణం లో ఎప్పుడూ పండుగ వాతావరణం కనిపించేది. అంతేకాకుండా మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు ఇతర మంత్రుల కార్యక్రమాలతో చెన్నూర్ నియోవజకవర్గం నిత్యం సందడిగా ఉండేది.
నిరుపయోగంగా మినీస్టేడియం
క్రీడాకారుల కోసం చెన్నూర్ పట్టణంలో రూ 4.35 కోట్లతో నిర్మించిన మినీ స్టేడియం నేడు నిరుయోగంగా మారింది. అప్పుడు నిర్మించిన క్రీడా కోర్టులు, భవనాలు తప్ప, ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు చేసిందేమీ లేదు. క్రీడలకు ఉపయోగపడాల్సిన క్రీడా కోర్టులు నేడు ధాన్యం ఆరబోతకు ఉపయోగ పడుతున్నాయి.
కలగానే బస్ డిపో
చెన్నూర్ ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో రూ 4.35 కోట్లతో ప్రారంభించిన బస్ డిపో పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. బీఆర్ఎస్ హయాంలో దాదాపు 70 శాతం నిర్మాణం పూర్తి కాగా, ఎన్నికల అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వంలో పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. దీంతో చెన్నూర్ ప్రజల చిరకాల వాంఛ అయిన బస్ డిపో కలగానే మిగిలిపోయింది.
నత్తనడకన 100 పడకల దవాఖాన పనులు
చెన్నూర్ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో రూ.72కోట్లతో 100 పడకల దవాఖాన నిర్మాణం ప్రారంభించగా, నత్తనడకన సాగుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో దాదాపు 80శాతం పనులు పూర్తి కాగా, కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో పురోగతి కనిపించడం లేదు. నత్తనడకన పనులు సాగుతున్నాయి.
కేసీఆర్ పార్కుపై పట్టింపేది
చెన్నూర్ పట్టణంలో రూ. 2.50 కోట్లతో కేసీఆర్ పార్కు నిర్మించారు. కేసీఆర్ పార్కులో పిల్లల కోసం ఆట వస్తువులు, మ్యూజిక్ పౌంటెయిన్తో పాటు పె ద్దల కోసం వాకింగ్ ట్రాక్ నిర్మాణాలు చేపట్టారు. బీ ఆర్ఎస్ హయాంలో వివిధ రకాల పూల మొక్కలతో ఆహ్లాదం పంచిన ఈ పార్కు ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో కళావిహీనంగా మారింది. ఈ పార్కులు పలుమార్లు సందర్శకులు పాము కాటుకు గురయ్యారు.
నాడు జిగేల్.. నేడు మసకగా సెంట్రల్ లైటింగ్
చెన్నూర్ పట్టణ సుందరీకరణలో భాగంగా రూ.25 కోట్లతో పట్టణంలోని జలాల్ పెట్రోల్ పంపు నుంచి అంబేద్కర్ చౌక్ వరకు ప్రధాన రహదారిని విస్తరించారు. రహదారి మధ్యలో డివైడర్ ఏర్పాటు చేసి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు పౌంటెయిన్ను నిర్మించారు. బీఆర్ఎస్ హయాంలో సెంట్రల్ లైటింగ్‌తో పట్టణం జిగేల్ మనగా, పౌంటెయిన్ వెదజల్లే నీటితో పాటు వెలుగులు రహదారి వెంట వచ్చీ పోయేవారిని ఆకట్టుకునేవి. నేడు నిర్వహణలోపంతో సెంట్రల్ లైటింగ్‌తో పాటు పౌంటెయిన్ మసకబారింది.

Adilabad1
కళావిహీనంగా మినీ ట్యాంకు బండ్లు
వాకర్స్‌తో పాటు ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం అందించేందుకు రూ.9 కోట్లతో పట్టణంలోని పెద్ద చెరువు, కుమ్మరి కుంటను మినీ ట్యాంకు బండ్లుగా నిర్మించారు. పూల మొక్కలు, విద్యుత్ దీపాలతో ఈ రెండు ట్యాంకు బండ్లను సుందరంగా తీర్చిదిద్దారు. బీఆర్ఎస్ హయాంలో సందర్శకులతో మినీ ట్యాంకు బండ్లు కళకళాలాడేవి. కాంగ్రెస్ పాలనలో నిర్వహణ లోపంతో ఈ రెండు ట్యాంకు బండ్లపై ఉన్న పూల మొక్కలు ఎండిపోయి, పిచ్చి మొక్కలకు నిలయంగా మారాయి, అంతేకాకుండా లైటింగ్ కూడా పని చేయకపోగా, కళావిహీనంగా మారాయి.
నిలిచిపోయిన స్కిల్‌డెవలప్‌మెంట్ పనులు
విద్యార్థులు ఉన్నతి కోసం, ఉద్యోగార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవ్వటానికిగాను పట్టణంలో రూ. 5కోట్లతో స్కిల్‌డెవలప్‌మెంట్ భవన నిర్మాణం ప్రారంభించారు. బీఆర్ఎస్ హయాంలో పనులు శరవేగంగా సాగగా, కాంగ్రెస్ హయాంలో పనులు నత్తనడకన సాగుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో సాగిన మాదిరిగానే కాంగ్రెస్ పాలనలో సాగితే స్కిల్‌డెవలప్‌మెంట్ భవన నిర్మాణం పూర్తయి విద్యార్థులకు, ఉద్యోగార్థులకు ఉపయోగంలోకి వచ్చేది.
వసతులలేమితో ఇంటిగ్రేటెడ్ మార్కెట్
ప్రజలు, రైతులు, కూరగాయల వ్యాపారుల సౌకర్యార్థం చెన్నూర్ పట్టణంలో రూ. 7.20కోట్లతో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణం ప్రారంభించారు. బీఆర్ఎస్ హయాంలో దాదాపు 70శాతం పనులు పూర్తయ్యాయి. అయితే కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో పట్టించుకోవకపోవడంతో ఇంటిగ్రేటేడ్ మార్కెట్ నిర్మాణం పూర్తికాలేదు. ప్రస్తుతం ఎలాంటి మౌలిక వసతలు కల్పించకుండానే ఇంటిగ్రేటెడ్ మార్కెట్లోనే కూరగాయలు విక్రయించాలని ఒత్తిడి తెస్తుండడంతో కూరగాయల వ్యాపారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నది.
నిరుపయోగంగా బైపాస్ రోడ్డు
చెన్నూర్ పట్టణంలోని ప్రధాన రహదారిలో వాహనాల రద్దీ తగ్గించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ. 8కోట్లతో బుద్ధారం రోడ్డు నుంచి పెద్ద చెరువు కట్ట (రాయిచెట్టు) వరకు బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది. రోడ్డు నిర్మాణంలో భాగంగా బైపాస్ రోడ్డు ప్రారంభం నుంచి కొత్తగూడెం కాలనీ వరకు సిమెంటు రోడ్డును నిర్మించారు. అలాగే రోడ్డు కోతకు గురికాకుండా సైడ్ వాల్స్ నిర్మించారు. అవసరమైన నాలుగు కల్వర్టులతో పాటు వడ్డెపల్లి కాలనీ వద్ద పెద్ద కల్వర్టును నిర్మించి, సైడ్ లైటింగ్‌ను ఏర్పాటు చేశారు. దీంతో దాదాపు 70శాతం పనులు పూర్తయ్యాయి. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో తట్టెడు మట్టికూడా వేయకుండా పట్టించుకోకపోవటంతో నిరుపయోగంగా మారింది.
బోసిపోతున్న జిమ్‌లు
యువకులు, పిల్లల కోసం బీఆర్ఎస హయాంలో రూ.40 లక్షలతో రెండు ఓపెన్ జిమ్‌లతో పాటు, చిల్డ్రన్స్ ప్లే ఏరియాలను నిర్మించారు. అప్పట్లో జిమ్‌లు, చిల్డ్రన్స్ ప్లే ఏరియాలు యువకులు, పిల్లలతో ఎంతో సందడిగా ఉండేవి. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో నిర్వహణలోపంతో బోసి పోతున్నాయి.
ప్రారంభానికి నోచుకోని మహిళా భవనం
మహిళా సంఘాల సభ్యుల కోసం రూ 1.50కోట్లతో సమ్మక్క-సారలమ్మ మహిళా భవన నిర్మాణం చేపట్టారు. భవనం కూడా అన్ని హంగులతో పూర్తికాగా, కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో నిర్మాణం పూర్తయిన మహిళా భవనం నిరుపయోగంగా మారింది.
అందుబాటులోకి వచ్చిన 50 పడకల దవాఖాన
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ హయాంలో పట్టణ నడిబొడ్డున ఉన్న పాత దవాఖాన స్థానంలో రూ.7కోట్లతో 50 పడకల దవాఖాన నిర్మించారు. అప్పటి మంత్రి హరీశ్‌రావు ఈ దవాఖానను ప్రారంభించడంతో ప్రజలకు అందుబాటులోకి వచ్చి వైద్య సేవలు అందిస్తున్నది. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో దవాఖాన నిర్వహణలోపంతో కొట్టుమిట్టాడుతున్నది.
విద్యుత్ సేవలు అందిస్తున్న 33/11సబ్ స్టేషన్
చెన్నూర్ పట్టణ ప్రజలకు లో వోల్టేజీ సమస్య పరిష్కరించి మెరుగైన విద్యుత్ సరఫరా అందించాలనే ఉద్దేశంలో బీఆర్ఎస్ పాలనలో రూ.కోటితో 33/11కేవీ సబ్ స్టేషన్ నిర్మించారు. సబ్‌స్టేషన్ నిర్మాణం పూర్తి చేసుకొని ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందిస్తున్నది. అంతేకాకుండా రూ. 90లక్షలతో నూతనంగా విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. దీంతో బీఆర్ఎస్ హయాంలోనే పట్టణంలో ప్రజలకు మెరుగైన విద్యుత్ సరఫరా మెరుగైంది.
ఉపయోగపడుతున్న గ్రంథాలయం
పట్టణంలో పూర్వకాలంలో గ్రంథాలయం నిర్మించగా, శిథిలావస్థకు చేరుకోవడంతో పాఠకులు ఇబ్బందిపడేవారు. బీఆర్ఎస్ హయాంలో పాత భవనం స్థానంలో రూ. కోటితో అన్ని వసతులతో కూడిన నూతన గ్రంతాలయ భవాన్ని నిర్మించారు. అందుబాటులోకి తెచ్చారు.
మహానీయలు విగ్రహాలు
బీఆర్ఎస్ హయాంలో పట్టణంలో పలువురు మహానీయుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. పట్టణానికి చెందిన ప్రముఖ కవి వానమామలై వరదాచార్యులు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అలాగే మహాత్మా జ్యోతిబాపూలే, సావిత్రీబాయి పూలే విగ్రహాలను ఏర్పాటు చేశారు.
బీఆర్ఎస్ హయాంలో పట్టణ ప్రగతి
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పాలనలో అప్పటి ఎమ్మెల్యే, విప్ బాల్క సుమన్ నియోజకవర్గ కేంద్రమైన చెన్నూర్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని సంకల్పించారు. రూ.250 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. రూ 25 కోట్లతో జలాల్ పెట్రోల్ పంపు నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకూ ప్రధాన రహదారిని వెడల్పు చేసి, సెంట్రల్ లైటింగ్‌తో పాటు, ఇరువైపుల సైడ్ డ్రైన్స్ నిర్మింపజేశారు. బుద్ధారం రోడ్డు నుంచి చెరువు కట్ట వరకు బైపాస్ రోడ్డును అభివృద్ధి చేయించారు. రూ.32 కోట్లతో 100 పడకల దవాఖాన పనులను ప్రారంభించారు. రూ.7 కోట్లతో 50 పడకల దవాఖానను నిర్మింపజేశారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా రూ 17.52 కోట్లతో 99.49 కిలో మీటర్ల పైపు లైన్ వేసి 7,629 నివాసాలకు తాగు నీరు అందించారు.
మహిళల కోసం రూ 1.50 కోట్లతో మహిళా భవనాన్ని నిర్మింపజేశారు. రూ 4.35 కోట్లతో బస్ డిపో పనులను ప్రారంభించారు. రూ 2.50 కోట్లతో కేసీఆర్ పార్కును ఏర్పాటు చేశారు. రూ 1.90లక్షలతో 33/11కేవీ సబ్ స్టేషన్ నిర్మాణంతో పాటు కొత్తగా విధ్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. రూ 7.20 కోట్లతో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్‌ను నిర్మించారు. రూ 4.35 కోట్లతో మినీ స్టేడియం నిరించారు. రూ 9 కోట్లతో పెద్ద చెరువు, కుమ్మరి కుంటలను మినీ ట్యాంకు బండ్లుగా తీర్చిదిద్దారు. రూ. కోటితో చెత్త కోసం 16 స్వచ్ఛ ఆటోలతో పాటు 19 వాహనాలను కొనుగోలు చేశారు. రూ.5 కోట్లతో స్కిల్‌డెవలప్‌మెంట్ భవన నిర్మాణాన్ని ప్రారంభించారు. రూ.కోటితో గ్రంథాలయానికి నూతన భవనాన్ని నిర్మించారు. రూ.40 లక్షలతో రెండు ఓపెన్ జిమ్‌లు, 5 చిల్డ్రన్స్ ప్లే ఏరియాలను నిర్మించారు. మన ఊరు-మన బడి పథకం ద్వారా రూ 12.79 లక్షలతో ప్రభుత్వ పాఠశాలను మెరగుపరిచారు. అలాగే మహానీయుల సేవలను గుర్తిస్తూ వానమామలై వరదాచార్యులు, పూలే దంపతుల విగ్రహాలను ఏర్పాటు చేశారు.