జన్నారం, జూన్ 16 : కవ్వాల్ టైగర్ రిజర్వ్డ్ అడవుల్లోని జన్నారం, తాళ్లపేట, ఇందన్పెల్లి, ఉడుంపూర్, బీర్సాయిపేట, కడెం రేంజ్ల పరిధిలోని కోర్ ఏరియా ప్రాంతాల్లో పులి మినహా మాంసాహార, శాఖాహార జంతువుల గణన చేపడుతున్నారు. మే 2న ప్రారంభమైన ఈ కార్యక్రమం జూన్ 20 వరకు కొనసాగనుందని అటవీశాఖ అధికారులు తెలిపారు. చిరుత, అడవి కుక్కలు, ఎలుగుబంట్ల పాదముద్రలు, మల, మూత్ర విసర్జితలను గుర్తిస్తున్నారు.
శాఖాహార జంతువులైన అడవి బర్రెలు, మనుబోతులు, దుప్పులు, అడవి పందులు, చుక్కల జింకలు, గడ్డి జింకలు, కొండ గొర్రెల పాదముద్రలు, వెంట్రుకలను సేకరించడంతో పాటుగా వన్యప్రాణులను ప్రత్యక్షంగా గుర్తించినట్లు తెలిపారు. ప్రస్తుతం మనుబోతులు, అడవి పందుల సంఖ్య అధికంగా పెరిగిందని, చుక్కల దుప్పులు, గడ్డి జింకలు, కొండగొర్రెల సంఖ్య తక్కువగా ఉన్నట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
కవ్వాల్ టైగర్ రిజర్వ్డ్ అడవిలోని మాంసాహార, శాఖాహార జంతువుల సంఖ్యను పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. వన్యప్రాణులకు ఆహారం అందించేందుకు అడవుల్లో విరివిగా గడ్డిక్షేత్రాలను పెంచుతున్నామని వేసవిలో తాగునీటికి ఇబ్బంది పడకుండా ఉండేందుకు సోలార్ మోటర్ల ద్వారా నీటికుంటలో నీటిని నింపడం, వాగుల్లో చెలిమలు ఏర్పాటు, సాసర్ పిట్లలో నీటి పోసి వాటి దాహాన్ని తీరుస్తూ వాటిని కాపాడుతున్నాం.
-జన్నారం ఇన్చార్జి రేంజ్ అధికారి సుష్మారావు