ఎదులాపురం, డిసెంబర్ 23: జిల్లా అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా ముందుకెళ్దామని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ అన్నారు. ఆదిలాబాద్ జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా సర్వసభ్య సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ సమావేశంలో చర్చించిన సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు అధికార యంత్రాంగం కృషి చేయాలని, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పూర్తి స్థాయిలో దూరం చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో తమ దృష్టికి వచ్చిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. సభకు అటవీ శాఖ జిల్లా అధికారి రాకుండా సీనియర్ అసిస్టెంట్‌ను పంపించడంతో ఇది గ్రామసభ అనుకుంటున్నారా? అని ప్రజాప్రతినిధులు ప్రశ్నించారు. అనంతరం ఇటీవల ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యేలుగా గెలుపొందిన పాయల్ శంకర్, అనిల్ జాదవ్‌ను జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, డీసీఎంఎస్ చైర్మన్ లింగయ్య, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, అదనపు కలెక్టర్ ఖుష్బూగుప్తా, జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా అధికారులు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో గణపతి, వివిధ శాఖల జిల్లా అధికారులు శ్రీనివాస్, శంకర్, సురేశ్, మిల్క, రమేశ్ రాథోడ్, రాజలింగు, కిరణ్ కుమార్, జడ్పీటీసీలు తాటిపెల్లి రాజు, గోక గణేశ్ రెడ్డి, బ్రహ్మానంద్, కుమ్ర సుధాకర్, అక్షితా పవార్, నల్ల వనిత, ఎంపీపీలు తుల శ్రీనివాస్, మార్శెట్టి గోవర్ధన్ తదితరులు ఉన్నారు.
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి కృషి
రాజకీయాలకు అతీతంగా జిల్లా అభివృద్ధి కోసం కృషి చేద్దాం. ఎన్నికల సమయంలో పార్టీల పరంగా విభేదాలు ఉన్నా వాటిని పక్కన పెట్టి కలిసికట్టుగా ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేద్దాం. నేరడిగొండ జడ్పీటీసీగా నాలుగున్నరేండ్లు జడ్పీలో సభ్యుడిగా కొనసాగి చాలా విషయాలు నేర్చుకున్నా. వివిధ శాఖల జిల్లా అధికారులు ప్రజల సమస్యల పరిష్కారం కోసం పూర్తిస్థాయి సహకారం అందించాలి.
– అనిల్‌జాదవ్, ఎమ్మెల్యే. బోథ్
ఉపాధి నిధులు స్థానిక సంస్థలకు అందించాలి
ఉపాధి హామీ పథకం నిధులు నేరుగా స్థానిక సంస్థలకు అందించాలి. ఈ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేసేలా జడ్పీ సమావేశంలో తీర్మానం చేయాలి. గ్రామాల్లో సమస్యల పరిష్కారం కోసం స్థానిక సంస్థల ప్రతినిధుల సలహాలు, సూచనలు తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. స్థానిక సంస్థలు బలోపేతం కావాల్సిన అవసరం ఉంది.
– పాయల్ శంకర్, ఎమ్మెల్యే, ఆదిలాబాద్
కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దు..
పనుల కోసం ప్రజలు రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగకుండా చూడాలి. ఉట్నూర్ దవాఖానలోనే కాన్పులు జరిగేలా చూడాలి. అక్కడే 24 గంటల పాటు వైద్యులు, సిబ్బంది ఉండేలా చూడాలి. పీహెచ్‌సీల్లో వైద్యులను వెంటనే నియమించాలి. విద్య, వైద్య, అటవీ శాఖ సమస్యలను పరిష్కరించాలి.
-వెడ్మ బొజ్జూపటేల్, ఎమ్మెల్యే ఖానాఫూర్