ఆదిలాబాద్, మే 5(నమస్తే తెలంగాణ) : గిరిజనులకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్మన్ పథకం కింద ఇండ్లు నిర్మించి ఇస్తున్నది. ఇందులో భాగంగా పీవీటీజీ గిరిజనులకు ఇండ్లు మంజూరవుతుండగా.. సొంతింటి కల నేరవేరుతుందనే ఆశలో గిరిజనులు అప్పు చేసి ఇండ్ల నిర్మాణం చేపట్టారు. బిల్లులు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని చెప్రాలలో గిరిజన లబ్ధిదారులకు ప్రధానమంత్రి జన్మన్ పథకం కింద 43 ఇండ్లు మంజూరయ్యాయి. రూ. 5 లక్షలు ఇండ్ల నిర్మాణం యూనిట్ ధర కాగా బెస్మెంట్ లేవల్ వరకు ఇండ్లు నిర్మాణం పూర్తయిన వారికి మొదటి విడుత రూ. ఒక లక్ష రావాలి, రూఫ్ లెవల్‌కు రూ. ఒక లక్షల, స్లాబ్ పూర్తయిన తర్వాత రూ.1.60 లక్షల, మిగతా డబ్బులు ఇండ్లు పూర్తయిన తర్వాత ఇస్తారు.
నాలుగు విడుతల్లో డబ్బులు అందించాల్సి ఉండగా.. మొదటి విడుత ఇండ్ల నిర్మాణంలో భాగంగా బెస్మెంట్ లెవల్ వరకు ఇండ్లు నిర్మాణం పూర్తి చేసిన వారికి మొదటి బిల్లు రావడం లేదు. మొదటి విడుత బిల్లు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి. లబ్ధిదారులకు జాబ్‌కార్డుల్లో తప్పుల కారణంగా బిల్లుల మంజూరులో జాప్యమవుతున్నదని అధికారులు అంటున్నారు. కొందరు పేదలు తమ వద్ద డబ్బులు లేకపోవడంతో కాంట్రాక్టర్లకు ఇవ్వగా వారు సైతం బిల్లులు రాకపోవడంతో పనులను నిలిపివేశారు. సొంత గృహం మంజూరయిందనే ఆశతో ఉన్న ఇంటిని తీసివేసి తాత్కాలికంగా గుడిసెలు వేసుకొని ఉంటున్నారు. మరో నెల రోజుల్లో వర్షాకాలం ప్రారంభంకానుండగా తాము గుడిసెల్లో ఉండలేని పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తమ ఇండ్ల బిల్లులు మంజూరయ్యేలా చూడాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
మా గ్రామంలో పీవీటీజీ గిరిజనులకు పీఎం జన్మన్ పథకంలో 43 ఇండ్లు మంజూరయ్యాయి. అప్పులు చేసి ఇంటిని నిర్మించుకుంటున్నాం. ఇండ్ల నిర్మాణాలు బెస్మెంట్ వరకు పూర్తయి దాదాపు రెండు నెలలు గడుస్తున్నా మొదటి బిల్లు రావడం లేదు. దీంతో నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేసిందని చాలా మంది ఉన్న ఇండ్లను తీసివేసి వేరేచోట తాత్కాలిక గుడిసెలు వేసుకొని అ స్థలంలో కొత్త ఇంటిని నిర్మించుకుంటున్నారు. బిల్లుల గురించి అధికారులను అడిగితే ఆధార్‌కార్డు, జాబ్‌కార్డు, అకౌంట్ నంబరులో లోపాలు ఉన్నాయని అంటున్నారు. ప్రభుత్వం స్పందించి తమ ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి.
– అత్రం సక్కుబాయి. చెప్రాల, బేల మండలం