ఆదిలాబాద్, మే 29(నమస్తే తెలంగాణ) ః కేంద్ర ప్రభుత్వం ఏటా పంటలకు మద్దతు ధర పెంచుతోంది. దీంతో రైతులు తమకు మద్దతు ధర లభిస్తోందని ఆశించినా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) నిర్వాకం ఫలితంగా రైతులకు మద్దతు ధర లభించడం లేదు. ఆదిలాబాద్ జిల్లాలో ఏటా వానకాలంలో 4 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతోంది. వివిధ కంపెనీలకు చెందిన బీటీ-2 పత్తి విత్తనాలను వాడతారు. జూన్ మొదటి, రెండో వారంలో విత్తనాలు వేస్తారు. అక్టోబర్ రెండు, మూడో వారం నుంచి పత్తిని ఏరుతారు. సాగులో అన్ని పరిస్థితులు అనుకూలిస్తే ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది.
తేమ నిబంధనతో నష్టం
పత్తిని సీసీఐ మద్దతు ధరతో కొనుగోలు చేస్తుంది. ప్రైవేటు వ్యాపారులు కూడా కొనుగోలు చేస్తారు. బేళ్ల ధరకు అనుకూలంగా ప్రైవేటు వ్యాపారులు ధర చెల్లిస్తారు. ఏటా జిల్లాలో పది మార్కెట్ యార్డుల్లో సీసీఐ పంటను కొనుగోలు చేస్తుంది. సీసీఐ కేంద్రం ప్రకటించిన మద్దతు ధర చెల్లించాల్సి ఉండగా.. నిబంధనల పేరిట రైతులకు కుచ్చుటోపి పెడుతున్నది. పత్తిలో 8 నుంచి 12 శాతం తేమ ఉంటేనే కొనుగోలు చేస్తారు. 8 శాతానికి మద్దతు ధర చెల్లిస్తారు.
9 నుంచి 12 శాతం వరకు క్రమంగా కోతలు విధిస్తారు. గతేడాది క్వింటాలుకు రూ.7521 మద్దతు ధర ఉండగా 8 శాతం తేమకు మాత్రమే చెల్లించారు. 9 శాతం ఉంటే రూ.7446, 10 శాతం ఉంటే రూ.7325, 11 శాతం ఉంటే రూ.7296, 12 శాతం తేమ ఉంటే రూ. 7221 చెల్లించారు. 12 శాతం కంటే ఎక్కువ తేమ ఉంటే కొనుగోలు చేయడానికి నిరాకరిస్తారు. దీంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకు పత్తిని విక్రయించి నష్టపోయారు.
నాణ్యత పేరిట కోతలు
తేమ శాతం 8 ఉన్నా.. నాణ్యత సరిగా లేదంటూ క్వింటాలుకు రూ.100 తగ్గించారు. దూది పింజ పొడువు సరిగా రాకపోవడంతో సీసీఐ అధికారులు ధరను తక్కువ చేసి కొనుగోలు చేశారు. జిల్లాలో పత్తి సాగుకు అనుకూలమైన భూములు, వాతావరణ పరిస్థితుల కారణంగా నాణ్యమైన పంట పండుతుంది. రైతులు పండించిన పత్తి ఆసియాలోనే నాణ్యమైనదిగా నిపుణులు గుర్తించారు.
తాము ఎన్నో సంవత్సరాల నుంచి పత్తిని సాగు చేస్తున్నామని, నాణ్యమైన పత్తిని పండిస్తున్నా సీసీఐ అధికారులు పంట బాగా లేదని కోతలు విధించడం సరికాదని రైతులు అంటున్నారు. గతేడాది పత్తి క్వింటాలుకు రూ.7521 ఉండగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పత్తికి క్వింటాలుకు రూ.589 పెంచి రూ.8110 గా ప్రకటించింది. కేంద్రం ధరలు పెంచుతున్న సీసీఐ అధికారుల విధిస్తున్న నిబంధనల వల్ల తాము నష్టపోతున్నామని రైతులు పేర్కొంటున్నారు. ఎలాంటి కోతలు లేకుండా పంటను కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
సీసీఐది కార్పొరేట్ వ్యాపారం..
కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు ఏటా ధరను పెంచుతున్నది. పెరిగిన పెట్టుబడుల కారణంగా కేంద్రం పెంచుతున్న ధరలు ఏ మాత్రం గిట్టుబాటు కావు. పెంచిన ధరలు జిల్లాలో రైతులకు లభించడం లేదు. పత్తి కొనుగోళ్లలో సీసీఐ కార్పొరేట్ సంస్థగా వ్యవహరిస్తూ రైతులను నష్టాలకు గురి చేస్తున్నది. తేమ పేరిట కేంద్రం ప్రకటించిన మద్దతు ధర చెల్లించడం లేదు. పింజ పొడువు సరిగా లేదంటూ క్వింటాలుకు రూ.100 తక్కువ చేసి కొనుగోలు చేస్తున్నారు. సీసీఐ అధికారుల వేధింపుల కారణంగా రైతులు ప్రైవేటు వ్యాపారులకు పంటను విక్రయించి నష్టపోతున్నారు.
– సంగెం బొర్రన్న, రైతు స్వరాజ్య వేదిక, ఆదిలాబాద్