కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ 17(నమస్తే తెలంగాణ) : జిల్లాలో సీసీఐ పూర్తిస్థాయిలో పత్తి కొనుగోళ్లు ప్రారంభించకపోవడం దళారులకు వరంగా మారుతున్నది. పల్లెల్లో ఎక్కడ పడితే అక్కడ దుకాణాలు తెరచి తక్కువ ధరకు దూది కొంటూ రైతులను నిలువు దోపిడీ చేస్తుండగా, యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నది.
ఆసిఫాబాద్ జిల్లాలో ఈ ఏడాది 3.30 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేసినట్లు తెలుస్తుండగా, 23 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని యంత్రాంగం అంచనా వేస్తున్నది. ప్రభుత్వం ద్వారా జిల్లాలో సీసీఐ ఆధ్వర్యంలో 14 జిన్నింగ్ల మిల్లులు ఉన్నప్పటికీ ఇంకా పూర్తిస్థాయిలో పత్తి కొనుగోళ్లు ప్రారంభించలేదు. దీంతో రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించి నష్టపోవాల్సి వస్తున్నది. వ్యాపారులు తాము చెప్పిందే రేటు.. అన్నట్లుగా పత్తి కొనుగోళ్లు చేపడుతున్నారు. సీసీఐ నిర్ణయించిన ధర క్వింటాలుకు రూ. 7521 ఉంటే.. వ్యాపారులు రూ. 6 వేల నుంచి రూ. 6500 వరకు మాత్రమే చెల్లించి కొంటున్నారు. దీంతో రైతులు రూ. వెయ్యి నుంచి రూ. 1500 వరకు నష్టపోతున్నారు. పత్తి అమ్మిన రైతులకు వ్యాపారులు అప్పటికప్పుడే డబ్బులు చెల్లిస్తుండడంతో వారంతా ఆసక్తి చూపుతున్నారు.
జిల్లాలోని సీసీఐ కొనుగోలు కేంద్రాలు లేని ఏజెన్సీ మండలాలైన లింగాపూర్, సిర్పూర్-యూ, కెరమెరి, తిర్యాణిలలో దళారులు నేరుగా రైతుల నుంచి పత్తి కొనుగోళ్లు సాగిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు జిన్నింగ్లలో 4 వేల క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేస్తే.. బయట వ్యాపారులు మాత్రం 40 వేల క్వింటాళ్లకు పైగా పత్తిని కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఒకటీ.. రెండు ఎకరాల్లో పత్తి సాగు చేసే రైతులు తాము పండించిన పత్తిని దూరంలో ఉన్న సీసీఐ కొనుగోలు కేంద్రాలకు తరలించలేక దళారులకు విక్రయించక తప్పడం లేదు.
రైతుల పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకుంటున్న వ్యాపారులు ఇష్టారీతిలో పత్తిని కొనుగోలు చేస్తున్నారు. ధరలను తగ్గించడమేగాక క్వింటాలుకు ఐదు నుంచి పది కిలోల మేరకు కోత విధిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దళారుల ఆగడాలను అరికట్టేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిన్నింగ్లలో కొ నుగోళ్లను వ్యూహాత్మకంగానే ఆలస్యం చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.