ఇంద్రవెల్లి : ఇంద్రవెల్లి మండలంలోని ఏమాయికుంట గ్రామపంచాయతీ పరిధిలోని గలియబాయితండాలో మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు జాదవ్ లఖన్ సింగ్ గ్రామస్తుల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. జాదవ్ లఖన్ సింగ్ గ్రామంలోని కొంతమంది యువకులతోపాటు గ్రామపంచాయతీ అధికారులతో కలిసి ప్రధాన కూడల్లలో సీసీ కెమెరాలు పెట్టించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో తరుచుగా దొంగతనాలు జరుగుతున్నాయన్నారు. వాటిని అరికట్టడానికి ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సీసీ కెమెరాలు లేకపోవడంతో దొంగలను గుర్తించడం కష్టంగా మారిందని, అందుకోసం గ్రామంలోని యువకులతో చర్చించగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారని తెలిపారు. తన వంతుగా కొంత డబ్బు ఇచ్చి, యువకుల సహకారంతో సీసీ కెమెరాలు కొనుగోలు చేశామని తెలిపారు.
గ్రామంలోని ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. సాయం చేయడానికి ముందుకు వచ్చిన యువకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అరేల్లి రాందాస్, నిధ్యాన్ సింగ్, చందర్ సింగ్, ఆశోక్, గ్రామ పంచాయతీ కార్యదర్శి రమేష్ తదితరులు పాల్గొన్నారు.