నిర్మల్, మే 5(నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లావ్యాప్తంగా జనగణనను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ముందుగా ఈ నెల 11వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు ఇళ్ల గణనను చేపట్టనున్నారు. అంతకు ముందే స్వీయ గణనకు కూడా కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. గత ఏప్రిల్ 26వ తేదీ నుంచి ఈ నెల 10వ తేదీ వరకు సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకొనేందుకు గడువు విధించింది. జిల్లాలోని మొత్తం ఇండ్ల సంఖ్యలో కనీసం ఐదు శాతం స్వీయ గణన ద్వారా పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం అధికారులు ప్రసార మాధ్యమాలతోపాటు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేయించారు. అంతేకాకుండా అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆయా శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందితోపాటు ఒక్కొక్కరు కనీసం 10 మందితో సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేయించేలా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులకు దిశానిర్ధేశం చేశారు. నిర్ధేశించిన లక్ష్యం మేరకు జిల్లాలో ఇప్పటికే 87 శాతం స్వీయ గణన పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. ఇక ఈనెల 11 నుంచి జూన్ 9వ తేదీ వరకు ఇళ్ల గణన చేపట్టే ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు ఇప్పటికే శిక్షణ పూర్తి చేశారు. ఇండ్ల గణనలో 1405 మంది ఎన్యుమరేటర్లు, 242మంది సూపర్వైజర్లు పాల్గొననున్నారు. ఎన్యుమరేటర్లు వారికి కేటాయించిన నివాసాలకు వెళ్లి ప్రభుత్వం రూపొందించిన 33 రకాల వివరాలు నమోదు చేస్తారు. అలా నమోదైన ప్రతి కుటుంబానికి ఒక ఐడీ నంబర్ కేటాయిస్తారు. ఇంటి యజమాని వివరాలతోపాటు ఆ ఇంట్లో నివసించే వారి సంఖ్య, ఇంటి నంబర్, ఇంటి నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ వివరాలు, ప్రస్తుతం ఆ ఇంటి స్థితి, నివసించే ఇల్లు సొంతమా? లేక అద్డె ఇళ్లా? తాగునీటి లభ్యత, మరుగుదొడ్ల సౌలభ్యం, వంటగది, ఎల్పీజీ కనెక్షన్, విద్యుత్, వాహనాలు, ఫోన్ సౌకర్యం రోజు తీసుకొనే ఆహార పదార్థాల వివరాలతోపాటు మరికొన్ని వివరాలు నమోదు చేయనున్నారు.
నిర్మల్ జిల్లావ్యాప్తంగా పది రోజులుగా స్వీయ గణన కొనసాగుతున్నది. గత నెల 26 నుంచి ఈ నెల 11 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతున్నది. కేంద్రం అమల్లోకి తెచ్చిన వెబ్ పోర్టల్లో లాగిన్ అయిన తర్వాత కుటుంబ వివరాలు నమోదు చేయాలి. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులతోపాటు విద్యావంతులు, ఇతరులు ఎవరైనా స్వీయ గణనపై అవగాహన ఉన్నవారు సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకోవచ్చు. వెబ్ పోర్టల్లో లాగిన్ అయిన తర్వాత కుటుంబ పెద్ద పేరు, సెల్ ఫోన్ నెంబర్ నమోదు చేయాలి. అనంతరం వచ్చే ఓటీపీ ద్వారా గణనకు సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేయాలి. వివరాలు పూర్తి చేసిన తర్వాత 11 అంకెలతో కూడిన ఒక ఐడీ నంబర్ వస్తుంది. దానిని భద్రపర్చుకోవాలి. ఈనెల 11వ తేదీ తర్వాత ఇళ్ల గణన కోసం ఇంటికి వచ్చే ఎన్యుమరేటర్కు ఐడీ నంబర్ చూపిస్తే వారు వెంటనే అప్రూవల్ ఇస్తారు. ఒకవేళ స్వీయ గణనలో ఏవైనా తప్పులు నమోదు చేసినా సరి చేసే అవకాశం ఉన్నది. వెబ్ పోర్టల్లో ఈ సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి దాదాపు 20 నిమిషాల సమయం పడుతుంది. ఇదిలా ఉంటే ఈ సారి నిర్వహించబోయే ఇళ్ల గణనలో జిల్లా వ్యాప్తంగా 2,05,000 ఇళ్లు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో ఐదు శాతం అంటే 10,910 ఇళ్లను స్వీయ గణన ద్వారా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయా ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులు, సిబ్బందితోపాటు సర్పంచ్లు, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులతో సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేయించేందుకు కార్యాచరణ రూపొందించారు. అలాగే విద్యార్థులు, మేధావులు, ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్నవారిని ఇందులో భాగస్వాములు చేయాలని నిర్ణయించారు. అధికారులు చేసిన ప్రయత్నాలు సఫలం కావడంతో నిర్ధేశించిన ఐదు శాతం లక్ష్యంలో ఇప్పటికే 87శాతం మంది స్వీయ గణన చేసుకున్నట్లు చెబుతున్నారు. సెల్ఫ్ ఎన్యుమరేషన్కు మరో ఆరు రోజుల గడువు ఉన్నందున ఈ సంఖ్య పెరిగి లక్ష్యానికి మించి నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు.
దేశాభివృద్ధిలో జనగణన కీలకపాత్ర పోషిస్తున్నది. జనాభా గణాంకాల ఆధారంగానే ప్రభుత్వాలు ప్రజల అవసరాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల విధివిధానాలు రూపొందిస్తుంటాయి. ఈ ప్రక్రియలో ప్రతి కుటుంబం బాధ్యతాయుతంగా పాల్గొని సరైన సమాచారాన్ని అందించాలి. గత నెల 26 నుంచి ప్రారంభించిన స్వీయ గణనను విద్యావంతులు తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలి. స్వీయ గణన ద్వారా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. జనగణన ప్రక్రియను రెండు దశల్లో నిర్వహించనున్నాం. మొదటి దశలో ఈ నెల 11 నుంచి జూన్ 9వ తేదీ వరకు ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి ఇండ్ల గణన, ఇతర వివరాలు సేకరిస్తారు. రెండో దశలో జనాభా గణనను 2027 ఫిబ్రవరిలో నిర్వహిస్తాం.
– భవేశ్ మిశ్రా, కలెక్టర్, నిర్మల్