మంచిర్యాల టౌన్, మే 17: మంచిర్యాల ప్రజలపై ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావుకు పగ, ద్వేషం, ఈర్ష్య ఎందుకో అర్థం కావడం లేదని, ఇష్టారీతిన వ్యవహరిస్తూ ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడని పనులు చేస్తున్నారని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు ఆరోపించారు. శనివారం మంచిర్యాలలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాట్లాడారు. మంచిర్యాలకు గుండెకాయలాంటి మంచిర్యాల-అంతర్గాం బ్రిడ్జి నిర్మాణం కోసం తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 164 కోట్లు మంజూరు చేశారన్నారు. మం జూరు చేసిన బ్రిడ్జికి టెండర్ ప్రక్రియ, స్థలసేకరణ, అగ్రిమెంట్, మట్టి పరీక్షలు కూడా పూర్తయ్యాయని చెప్పారు. కానీ, గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం మారిన తర్వాత మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు దురాలోచనతో ఆ బ్రిడ్జిని మారుస్తూ, అక్కడ కాకుండా లక్ష్మీ టాకీస్బైపాస్, అమరవీరుల స్తూ పం మీదుగా రాళ్ల వాగు నుంచి రంగపేట, పాత మంచిర్యాల వరకు ఆరు వరుసలతో నిర్మించాలని నిర్ణయించారన్నారు. తాము తీసుకొచ్చిన నిధులు మార్చడమేగాకుండా వంతెన పనిని రద్దు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు.
మంచిర్యాల-అంత ర్గాం మధ్యన గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మిస్తే పెద్దపల్లి, కరీంనగర్, హైదరాబాద్‌లకు వెళ్లే వారికి 18 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని, ప్రజలంతా ఇక్కడే బ్రిడ్జి నిర్మించాలని కోరుకుంటున్నారన్నారు. కానీ ఎమ్మె ల్యే ఒంటెద్దు పోకడలతో ఇక్కడి ప్రజలకు అన్యా యం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. నాలుగు జిల్లాల ప్రజలు కోరుకున్న బ్రిడ్జిని రద్దుచేసి వారికి సంతోషం లేకుండా చేసిన ఏకైక వ్యక్తి మంచిర్యాల అని, ఈ బ్రిడ్జిని పకదారి పట్టించి మంచిర్యాల ప్రజలకు అన్యాయం చేసిన వాడిగా చరిత్రలో నిలిచిపోతారని చెప్పుకొచ్చారు. 2028లో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే మంచిర్యాల-అంతర్గాం బ్రిడ్జిని నిర్మించి తీరుతుందన్నారు. మళ్లీ ఇదే స్థానంలో నిర్మిస్తామని స్పష్టం చేశారు.
మహాప్రస్థానం నిర్మాణంలో జోరుగా అక్రమాలు జరిగాయని, ఎమ్మెల్యే పీఎస్సార్‌కు ఇది బంగారు బాతుగుడ్డుగా మారిందని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. రూ. 4 కోట్లతో చేయాల్సిన పనికి రూ.11 కోట్ల బిల్లులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఇందులో ఎమ్మెల్యే భారీగా దండుకున్నారని ఆరోపించారు. ఎలాంటి అనుమతులు లేకుండా, డబ్బులు కట్టకుండా మంచిర్యాల గోదావరి నుంచి అడ్డగోలుగా ఇసుక, మట్టి అక్రమ రవాణా చేసి మహాప్రస్థానంలో పోయడం జరిగిందని, ఆ మట్టి పోసిన టిప్పర్ల యజమానికి ఇసుక, మట్టి బయట అమ్ముకునే విధంగా అవకాశం కల్పించారని అన్నారు. మహాప్రస్థాన నిర్మాణంపై విచారణ జరిపి స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అండతో అవినీతికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు అకడ శ్మశాన వాటిక నిర్మించడం వల్ల దాని చుట్టుపకల ఉన్న 24 ఎకరాల భూమి నిరుపయోగంగా మారిందని, వందలాది ప్లాట్ల యజమానులు ఇండ్లు నిర్మించుకోలేని పరిస్థితి దాపురించిందని అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గోదావరి నది ఒడ్డున కొనుగోలు చేసిన భూమిలో శ్మశాన వాటిక నిర్మిస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేదని, కానీ అకడ శ్మశాన వాటిక నిర్మిస్తే దివాకర్రావుకి పేరు వస్తుందన్న అకసుతో అకడి భూమిలో నిర్మించలేదని తెలిపారు.
మహాప్రస్థానం నిర్మించే స్థలం ఎవరికీ నచ్చలేదని, ఆఖరికి భగవంతునికి కూడా ఇష్టం లేదని, ప్రజల అఇష్టంతో నిర్మించే ఆ మహా ప్రస్థానం వద్ద ఒక అమాయక యువకుడు 31-01-2025 రోజున కరెంట్ షాక్‌తో మరణించాడని, కనీసం ఆ విషయాన్ని కూడా బయటకు రాకుండా చేశారని చెప్పారు. మంచిర్యాల మహాప్రస్థానం ప్రభుత్వ నిర్మాణం కాబట్టి దానిని ప్రభుత్వమే నిర్వహణ బాధ్యతలు చూసుకోవాలి. కానీ స్థానిక ఎమ్మెల్యే దాని మెయింటెనెన్స్ నెపంతో వ్యాపారస్తులు, కులసంఘాల నుంచి పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. మహానప్రస్థానం మెయింటెనెన్స్ ప్రభుత్వానిది కాబట్టి మంచిర్యాల కలెక్టర్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లు దానిని ప్రభుత్వ పరంగానే మెయింటైన్ చేయాలని, మెయింటైన్ చేస్తున్నట్లు ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు.
మంచిర్యాలలోని ఏసీసీ క్వారీలో ఉన్న ఇండస్ట్రియల్ భూమిని రెసిడెన్షియల్ భూమిగా మార్చడానికి ఆ ప్రాంత ప్రజానీకాన్ని పిలిపించి లక్షలాది రూపాయలు డిమాండ్ చేశారని మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు ఆరోపించారు. డబ్బులు ఇవ్వకుండా ఎవరైనా ఎదురు మాట్లాడితే వారిని భయభ్రాంతులకు గురిచేయడానికి ఒక గ్యాంగ్‌ను తయారు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా నిన్ను గెలిపించిన ప్రజల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలి కానీ.. ఈ విధంగా డబ్బులు అడగడం బాధాకరమని, ప్రతి విషయానికీ డబ్బులు కావాలని అడుగుతున్న ఏకైక ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు మాత్రమేనని అన్నారు.
మంచిర్యాల నియోజకవర్గంలోని ఇటిక్యాల, లక్ష్మీపూర్, గఢ్‌పూర్ గ్రామాల్లోని చెరువుల్లో అక్రమంగా అనుమతులకు మించి మట్టిని తరలిస్తున్నారని, ఇదంతా ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరుగుతుందని దివాకర్‌రావు అన్నారు. ఒక చెరువులోని మట్టి 500 మెట్రిక్ టన్నులు తీయడానికి అనుమతులు తీసుకున్నారని, 500 మెట్రిక్ టన్నుల మట్టి తీయడానికి కేవలం ఒకరోజు మాత్రమే పడుతుందని, కానీ ఏకంగా 15 రోజుల పాటు నిరాటంకంగా మట్టిని తవ్వి తీసుకెళ్లారని తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు మాత్రమే మట్టి తవ్వకాలు జరుపాలని ఉన్నా.. ఆ నిబంధనలు తుంగలో తొక్కి పోలీసుల పహారా మధ్య తరలిస్తున్నారని, నిలదీసిన ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మంచిర్యాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ హయాం లో చేసిన పనులు, అప్పుడే పూర్తిచేసిన పనులను సైతం తాను చేసినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటు అని దివాకర్‌రావు అన్నారు. ఐబీ నుంచి క్యాతన్‌పల్లి వరకు రోడ్డు మరమ్మతుల కోసం రూ. 35 కోట్లతో మంజూరు చేపించి శంకుస్థాపన చేసిన పనికి, ఈ మధ్య కాలంలో మంచిర్యాల ఎమ్మెల్యే తిరిగి అదే ప నికి పేరు మార్చి శంకుస్థాపన చేయడం ప్రజలంద రూ చూశారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పెంట రాజయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు విజిత్‌రావు, నాయకులు గోగుల రవీందర్‌రెడ్డి, అంకం నరేశ్, సు రేందర్‌రెడ్డి, సత్యనారాయణ, వెంకటేశ్, సుబ్బయ్య, శ్రీరాముల మల్లేశ్, తాజుద్దీన్, రవీందర్, పల్లపు రాజు, మధు, బాపు పాల్గొన్నారు.