పెంబి, సెప్టెంబర్ 28 : రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని 578 మంది (గిరిజన, గిరిజనేతర) రైతులు గిరిజన రైతు ఉత్పత్తిదారుల సంస్థను ఏర్పాటు చేశారు. ప్రతీ స్యభ్యుడు సభ్యత్వం కింది రూ.10 వేలు జమచేశారు. అనంతరం పేరును రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మండల కేంద్రంలో అద్దె గదులను తీసుకోగా, ఆగస్టు 1న కలెక్టర్ వరుణ రెడ్డి, ఐటీడీఏ పీవో చాహత్ బాజ్పాయ్ చేతుల మీదుగా విత్తనాలు, ఎరువుల దుకాణం ప్రారంభించారు. రూ.57.5 లక్షల మూలధనంతో వ్యాపారం కొనసాగిస్తున్నారు. అధ్యక్షుడు సహా 32 మంది డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. అధ్యక్షుడిగా భూక్యా టీకాజీ, సీఈవోగా మాదిరెడ్డి జహిందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా నాగావత్ ప్రకాశ్, ప్రధానకార్యదర్శిగా గుగ్లావత్ సంతోష్, కోశాధికారిగా కున్సోత్ రవీందర్ కొనసాగుతున్నారు. నిర్మల్ జిల్లాలో ఏర్పాటైన మొట్టమొదటి గిరిజన రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఇదే. ప్రస్తుతం ఏర్పాటు చేసకున్న విత్తనాలు, ఎరువుల దుకాణం లాభాదాయకంలో నడుస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో పంటలు విక్రయించుకోవడంతో పాటు, కూలీల కొరత అధిగమించేందుకు నూతన యాంత్రీకరణ పనిముట్లను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నాబార్డ్, తెలంగాణ ట్రైబల్ కార్పొరేషన్, ఐటీడీఏ ద్వారా సబ్సిడీ రుణాలు తీసుకొని గోదాం నిర్మాణం, వ్యాపార అభివృద్ధికి సన్నాహాలు చేస్తున్నారు.
మండలంలోని 578 మంది రైతులం గిరిజన రైతు ఉత్పత్తిదారుల సంస్థను ఏర్పాటు చేసుకున్నం. కలెక్టర్ వరుణ్ రెడ్డి, ఐటీడీఏ పీవో చాహత్ బాజ్పాయ్ సంస్థ ఏర్పాటుకు ఎంతగానో సహకరించారు. వారి సూచనల మేరకు రైతుందరం సంఘం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. మండల కేంద్రంలో భవనం అద్దెకు తీసుకొని విత్తనాలు, ఎరువుల దుకాణం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సంస్థ ద్వారా ప్రసుతం రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ సంస్థ ద్వారా జాతీయ, ఆంతర్జాతీయ మార్కెట్లో రైతులు పంటలు అమ్ముకునేలా ఏర్పాట్లు చేస్తున్నాం. నాబార్డ్ సహకారంతో గోదాం నిర్మాణానికి కృషి చేస్తున్నాం.
పెంబి గిరిజన రైతు ఉత్పతిదారుల సంస్థలో సభ్యత్వం తీసుకోవడంతో చాలా లాభాలు కలుగుతున్నాయి. బయటి మార్కెట్ కంటే తక్కువ ధరలకే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు లభిస్తున్నాయి. కూలీల ఖర్చులు తగ్గించడానికి వ్యవసాయ పనిముట్లను అందుబాటులోకి తీసుకొచ్చి, తక్కువ ధరకు కిరాయి ఇచ్చేందుకు సంస్థ ఏర్పాట్లు చేస్తున్నది. మా సంస్థకు మంచి గుర్తింపు రావడంతో వ్యవసాయ శాఖ అధికారులు కూడా అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. సంప్రదాయ పంటలకు బదులు లాభాదయక పంటల సాగుపై దృష్టిపెట్టేలా పలు సూచనలు ఇస్తున్నారు. అలాగే అత్యవసర సమయంలో తక్కువ వడ్డీకి విత్తనాలు, ఎరువులు కూడా ఇస్తున్నారు.
గిరిజన రైతు ఉత్పత్తి సంస్థలో సభ్యుడిగా చేరడంతో మంచి లాభాలు కలుగుతున్నాయి. పండించిన పంటలను మార్కెట్లో సులువుగా అమ్ముకోవచ్చు. అలాగే జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో ఎలా అమ్ముకోవాలో గిరిజన సంస్థ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ఈ సంస్థలో రూ.10 వేలు పెట్టుబడి పెట్టి బిజినేస్లో భాగస్వామ్యం అయినందుకు సంతోషంగా ఉంది. బయటి మార్కెట్ కంటే తక్కువ ధరలకే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు లభిస్తున్నాయి. విత్తనాలు, ఎరువుల దుకాణం లాభాదాయంగా నడుస్తున్నది. రాబోయే రోజుల్లో రైతులకు అనేక వ్యవసాయ పనిముట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ సంస్థ రైతు అభివృద్ధి చెందడానికి ఎంతో దోహదపడుతుంది.