ఆదిలాబాద్, డిసెంబర్ 26(నమస్తే తెలంగాణ) ః ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో దళారుల దందా కొనసాగుతున్నది. పత్తి దళారులు మాయాజాలం ప్రదర్శిస్తూ అమాయక రైతుల పేరిట వందల క్వింటాళ్ల పత్తిని సీసీఐకి విక్రయిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. మండల కేంద్రాల్లో రైతుల వద్ద నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ మద్దతు ధరతో సీసీఐకి విక్రయిస్తున్నారు. నార్నూర్, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు చెందిన దళారులు దందాకు పాల్పడుతున్నారు.
దళారులు పక్క రాష్ట్రం పత్తిని వాహనాల్లో తీసుకొచ్చి జిల్లాలోని రైతుల పట్టాలను తీసుకుని సీసీఐకి విక్రయిస్తూ భారీగా డబ్బు ఆర్జిస్తున్నారు. గురువారం నార్నూర్, ఇంద్రవెల్లి, ఇచ్చోడ మార్కెట్ యార్డుల్లో పంట కొనుగోళ్లు జరగకపోగా.. ఆదిలాబాద్ మార్కెట్ యార్డు పత్తి వాహనాలతో నిండిపోయింది. ఇచ్చోడ నుంచి ఐచర్ వాహనంలో వంద క్వింటాళ్ల పత్తిని ఓ దళారి గురువారం ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు తీసుకొచ్చాడు.
బజార్హత్నూర్ మండలానికి చెందిన ఓ రైతుకు చెందిన పదెకరాల పట్టాతోపాటు, ఆధార్ కార్డులను జతచేసి డ్రైవర్ వద్ద ఉంచాడు. వాహనంలో ఆ రైతు కూడా ఉన్నాడు. పంట ఎక్కడిదని అడిగితే నాకు తెలియదు ఓ వ్యాపారి రూ.5 వేలు ఇస్తానని అన్నాడు. తాను పట్టా పాసు పుస్తకాలు, ఆధార్ కార్డు ఇచ్చా. నన్ను వాహనంలో ఆదిలాబాద్‌కు పోయిరమన్నాడని ఆ అమాయక రైతు సమాధానం ఇచ్చాడు. ఇంద్రవెల్లికి చెందిన మరో దళారి ఉట్నూర్ మండలానికి చెందిన రైతుల పట్టాలతో ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు వచ్చి పంటను విక్రయించాడు.
మార్కెట్ యార్డుల్లో పత్తి కొనుగోళ్లకు సంబంధించి అధికారులు పర్యవేక్షణ లోపించడంపై రైతుల సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురువారం ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో దళారులకు సీసీఐకి రైతుల పేరిట వందల క్వింటాళ్ల పత్తిని విక్రయించినా అధికారులు తనిఖీలు నిర్వహించలేదన్నారు. పత్తి కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు కలుగకుండా, అక్రమాలు జరగకుండా వివిధ శాఖల అధికారులను నియమించారు. పత్తి కొనుగోళ్లలు రైతులు నష్టపోకుండా, దళారి వ్యవస్థకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
జిల్లాలో పత్తి విక్రయాల్లో దళారుల దందాను నివారించాలి. రైతుల వద్ద నుంచి తక్కువ ధరకు పంటను కొనుగోలు చేస్తున్న దళారులు, మద్దతు ధరకు సీసీఐకి విక్రయిస్తున్నారు. అమాయక రైతులను డబ్బులు ఆశగా చూపి వారి పట్టాపాసు పుస్తకాలు, ఆధార్‌కార్డులు తీసుకుని పంటను వారి పేరిట అమ్ముతున్నారు. వంద క్వింటాళ్ల పంటను తీసుకొచ్చే వారి వివరాలను క్షణ్ణంగా పరిశీలించాలి. – బొరన్న, రైతు, స్వరాజ్య వేదిక, జిల్లా అధ్యక్షుడు